పస్తులేనా! | Sankranti, Anganwadi workers, Wages | Sakshi
Sakshi News home page

పస్తులేనా!

Published Fri, Jan 13 2017 12:47 AM | Last Updated on Fri, Jul 6 2018 3:36 PM

పస్తులేనా! - Sakshi

పస్తులేనా!

అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు అందని వేతనాలు
సాక్షర భారత్‌ కో–ఆర్డినేటర్‌లకు పత్తాలేని జీతాలు
అభయహస్తం పింఛన్‌ లబ్ధిదారుల పరిస్థితి అంతే..
పంచాయతీ కార్మికులకు జీతాలివ్వని జీపీలు
సంక్రాంతికి చేతిలో చిల్లిగవ్వ లేక అవస్థలు


ఇందూరు : సంక్రాంతి పండుగ పలువురు చిరుద్యోగులను సంకట  స్థితిలో పడేసింది. అందరూ ఉద్యోగులు ఈ నెల వేతనాలు తీసుకుని సంక్రాంతి పండుగను నిర్వహించుకోవడానికి సిద్ధమవుతుంటే    అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు.. సాక్షర భారత్‌ మండల, గ్రామ కో–ఆర్డినేటర్‌లు.. అభయ హస్తం పింఛన్‌ లబ్ధిదారులు, పంచాయతీ కార్మికులు మాత్రం వేతనాలు రాక, చేతిలో డబ్బులు లేక పండుగెట్లా చేసుకోవాలని బాధ పడుతున్నారు.

‘అక్షరం’ సాక్షిగా పద్నాలుగు నెలలుగా వేతనాల్లేవు..
నిరక్ష్యరాసులను అక్షరాస్యులగా మార్చేందుకు గ్రామాల్లో      అక్షరాలు నేర్పించే సాక్షర భారత్‌ గ్రామ కో–ఆర్డినేటర్‌లు, మండల కో–ఆర్డినేటర్‌లకు ప్రభుత్వం పద్నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. జిల్లాలో మొత్తం గ్రామ కో–ఆర్డినేటర్‌లు 650 వరకు ఉండగా.. మండల కో–ఆర్డినేటర్‌లు 19 మంది ఉన్నారు. వీరికి   ప్రభుత్వం నుంచి నెలనెల వేతనాలు రావాల్సి ఉన్నా.. ఎప్పుడు  నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. గతేడాది నుంచి వచ్చిన దసరా, దీపావళి పండుగలతోపాటు సంక్రాంతిని కూడా వేతనాలు లేక కుటుంబంలో పండుగలు సక్రమంగా జరుపుకున్న సందర్భాలే లేవు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాల పోషణ వీరికి కష్టంగా మారింది. అయితే తమకు అన్ని పండగలకు ప్రభుత్వ ఈ రకంగా బాధించడం సరికాదని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు.

ఆవేదనలో అంగన్‌వాడీ ఉద్యోగులు
అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు కూడా సంక్రాంతి పండుగ పూట ప్రభుత్వ వేతనాలను మంజూరు చేయలేదు. కొన్ని ప్రాజెక్టుల్లో డిసెంబర్‌ వరకు వేతనాలు చెల్లించగా, మరి కొన్ని ప్రాజెక్టుల్లో మూడు నుంచి నాలుగు నెలల వేతనాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. జిల్లాలో ఐదు ప్రాజెక్టులకు 1,500 అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు 2,250 మంది, ఆయాలు 2,200 మంది పని చేస్తున్నారు. కార్యకర్తలకు రూ. 7 వేలు, ఆయాలకు రూ.4,500 నెలసరి వేతనం ప్రభుత్వం ఇస్తుంది. దాదాపు అందరికి డిసెంబర్‌ నెలకు సంబంధించి వేతనాలు రాలేదు. బోధన్‌ ప్రాజెక్టులో నాలుగు నెలలు, ఆర్మూర్‌లో 150 మందికి, నిజామాబాద్‌ అర్బన్‌ ప్రాజెక్టులో 25 మంది కార్యకర్తలు, 50 మంది ఆయాలకు వేతనాలు లేవు. దీంతోవీరి కుటుంబంలో కూడా సంక్రాంతిపండుగ ఎట్లా చేసేది అక్కా అన్న చందగా మారింది.

డబ్బులు వచ్చినా.. ‘అభయం’ లేదు..
ఏడాది తరువాత ప్రభుత్వం జిల్లాకు అభయహస్తం పింఛన్‌ డబ్బులు మంజూరు చేసినా లబ్ధిదారుల చేతికి అందని విధంగా మారింది. జిల్లాలో మొత్తం అభయహస్తం పెన్షన్‌ లబ్ధిదారులు 5,340 మంది ఉన్నారు. ఒక్కో లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి నెలకు రూ.500 పెన్షన్‌ను ఇవ్వాలి. కానీ.. ప్రభుత్వం ఏడాది కాలంగా వీరికి పెన్షన్‌ డబ్బులు మంజూరు చేయడం లేదు. అయితే పక్షం రోజుల క్రితం ఈ డబ్బులకు మోక్షం కలిగిస్తూ ప్రభుత్వం జిల్లాకు రూ.3 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. వీటిని డీఆర్‌డీఏ అధికారులు సంబంధిత మండలాల ఎంపీడీఓల ఖాతాల్లో జమ చేశారు. డబ్బులు చేతికివ్వమని, బ్యాంకు ఖాతాలు ఇస్తే అందులో జమ చేస్తామని చెప్పడంతో సంక్రాంతి పండగ ముంగిట చేతిదాక వచ్చిన డబ్బులు చేతికి అండకుండానే పోయాయి. అందరు బ్యాంకు ఖాతాలు ఇచ్చినప్పుడే డబ్బులు చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సంక్రాంతి పండక్కు డబ్బులు ఆసరాగా ఉంటాయనుకున్న లబ్ధిదారుల ఆశలు ఆవిరయ్యాయి.

సఫాయి కార్మికుల పరిస్థితి దారుణం
జిల్లాలో 393 పంచాయతీలున్నాయి. ఈ పంచాయతీల్లో పారిశుధ్యం పనులు చేసే కార్మికులు దాదాపు 420 మంది వరకు ఉంటారు. వీరికి ఐదారు నెలలుగా పంచాయతీల నుంచి వేతనాలు రావడం లేదు. అలాగే మున్సిపాలిటీలో పని చేసే సఫాయి కార్మికులకు కూడా రెండు, మూడు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. వీరికి వచ్చేది కొద్ది పాటి వేతనాలే అయినా వేతనాలు ఇవ్వడంతో మున్సిపాల్టీలు, పంచాయతీ పాలకవర్గాలు తీవ్ర జాప్యం చేస్తున్నాయి. డబ్బులు లేవని అందుకే వేతనాలు ఇవ్వడం లేదని స్పష్టం చేస్తున్నారు. సఫాలు కార్మికులు వారి వేతనాలు తప్పామరే మార్గం లేక దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇటు పంచాయతీ కారోబార్లు కూడా ఇదే విధంగా వేతనాలు లేక సంక్రాంతి పండక్కు ఇంట్లో సంబరం లేకుండా పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement