వేతన వేదన! | Wages Shortage in Anganwadi Centres | Sakshi
Sakshi News home page

వేతన వేదన!

Published Tue, Dec 25 2018 12:07 PM | Last Updated on Tue, Dec 25 2018 12:07 PM

Wages Shortage in Anganwadi Centres - Sakshi

వేతనాలు సక్రమంగా అందజేయాలంటూ వినతిపత్రం అందజేస్తున్న అంగన్‌వాడీలు(ఫైల్‌)

కర్నూలు, కోవెలకుంట్ల: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యబోధిస్తున్న కార్యకర్తలు, ఆయాలను వేతన కష్టాలు వెంటాడుతున్నాయి. రెండు నెలలుగా వీరికి జీతాలు అందడం లేదు. ఐదు నెలల నుంచి టీఏ, డీఏ బిల్లులు విడుదల కావడం లేదు. మంగళవారం క్రిస్మస్‌ పండుగ ఉండటంతో ఆ కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.  జిల్లాలో 3,486 అంగన్‌వాడీ, 62 మినీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 3,548 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 3,486 మంది ఆయాలు పనిచేస్తున్నారు. వీరిలో 25 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు. ఆయా కేంద్రాల ద్వారా 3.35 లక్షల మంది ఆరు సంవత్సరాల్లోపు చిన్నారులు, 42వేల మంది గర్భిణిలు, 41,319 మంది బాలింతలు లబ్ధి పొందుతున్నారు. వేతనాలు, బిల్లులు అందకపోవడంతో పండగ నిర్వహణ భారంగా మారటంతో క్రైస్తవులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేతనాలకోసం ఎదురుచూపు..
అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న  కార్యకర్తలకు ప్రభుత్వం నెలకు రూ. 10,500, ఆయాలకు రూ. 6వేలు వేతనం అందజేస్తోంది. డిసెంబర్‌ నెల ముగుస్తున్నా అక్టోబర్, నవంబర్‌ నెలలకు సంబంధించిన జీతాలు విడుదల కాలేదు. ఇదిలా ఉండగా..అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు రూ. 1500, ఆయాలకు రూ. 750 వేతనం పెంచుతూ కేంద్రప్రభుత్వం  ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో ఉత్తర్వులు జారీ చేసింది.  పెంచిన వేతనాల ప్రకారం కార్యకర్తలకు నెలకు రూ. 12వేలు, ఆయాలకు రూ. 6,750 వేతనం అందాల్సి ఉంది. సెప్టెంబర్‌ నుంచి అంగన్‌వాడీలకు కొత్త వేతనాలు వర్తింజేయాలి. రెండునెలల వేతనాలు మంజూరు కాకపోవడం, పెంచిన వేతనాలు అమలు కాకపోవడంతో కుటుంబాలను భారంగా నెట్టుకొస్తున్నారు.  ప్రతి నెలా సెక్టార్‌ సమావేశాలకు వచ్చే అంగన్‌వాడీలకు రూ. 125 డీఏ, రూ. 100 టీఏ అలవెన్సు  ఇవ్వాల్సి ఉంది. ఐదు నెలలకు సంబంధించిన అలవెన్సు అందకపోవడంతో దిగాలు చెందుతున్నారు.  

పండుగ చేసేదెట్టా?
క్రైస్తవులకు క్రిస్మస్‌ పండుగ అత్యంత ప్రాముఖ్యమైంది. పేద కుటుంబాల వారు సైతం ఈ పండుగను తమకున్నంతలో అత్యంత వై«భవంగా జరుపుకుంటారు. ఇంటి అలంకరణ, ఇంటిల్లిపాది నూత వస్త్రాల కొనుగోలు, స్వీట్లు, తదితర వాటికి రూ. 5వేలవరకు ఖర్చు  చేస్తారు. ఈ ఏడాది  క్రైస్తవ అంగన్‌వాడీ కుటుంబాల్లో పండుగ బోసిపోయినట్‌లైంది. రెండు నెలల నుంచి వేతనాలు, ఐదు నెలల నుంచి బిల్లులు రాకపోవడంతో పండుగ నిర్వహణ భారంగా మారింది. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని  పెండింగ్‌లో ఉన్న రెండు నెలల వేతనాలు, కొత్తవేతనాలు,  అలవెన్స్‌ విడుదల చేసి ఆదుకోవాలని అంగన్‌వాడీలు కోరుతున్నారు.

పెద్దపండుగ సాదాగా జరుపుకుంటున్నాం
క్రైస్తవులకు క్రిస్మస్‌ పెద్ద పండుగ. రెండు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో పండుగను సాదాగా  జరుపుకుంటున్నాం. ఈ నెల 20వ తేదీ నాటికి వేతనాలు అంగన్‌వాడీల ఖాతాల్లో జమ కావాల్సి ఉండగా ఇప్పటి వరకు అందలేదు. పండుగనాటికైనా అందుతాయని ఆశపడితే నిరాశే మిగిలింది. అధికారులు చర్యలు తీసుకుని రెండు నెలల వేతనాలు మంజూరు చేయాలి.
– వెంకటలక్ష్మి, అంగన్‌వాడీ కార్యకర్త, కోవెలకుంట్ల

వేతనాల మంజూరులో తీవ్ర జాప్యం
అంగన్‌వాడీకార్యకర్తలు, ఆయాలకు వేతనాలు చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ఎవరూ పట్టించుకోలేదు. రెండు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు.   – సుధాకర్, సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి, కోవెలకుంట్ల

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement