ఇబ్బందుల్లో అంగవాడీ కేంద్రాలు
చిన్నారులకు తప్పని తిప్పలు
ప్రతి నెలా అద్దె రాక అంగన్‌వాడీల అవస్థలు
జిల్లాలో 969కి 499 కేంద్రాలు అద్దె భవనాల్లోనే
సొంత భవనాల్లో కొనసాగుతున్నవి 220 మాత్రమే
పిల్లలు తక్కువుంటే వచ్చే విద్యా సంవత్సరంలో సమీప కేంద్రాల్లో విలీనం!
మంచిర్యాల టౌన్ : అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసి పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం ఓ వైపు ప్రకటిస్తోంది. కానీ వాస్తవంలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. మంచిర్యాల జిల్లాలో పలు అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడంతో ఎన్నో ఏళ్లుగా అద్దె భవనాల్లో నిర్వహించాల్సి వస్తోంది. ఇరుకు గదుల్లో ఇబ్బందుల మధ్య చిన్నారులు చదువు సాగించాల్సి వస్తోంది. అరకొర వసతులతో అద్దె భవనాలు సాగుతున్నాయి. పలు కేంద్రాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడం మాటేమోగానీ ఎంతకాలం కొనసాగుతాయనే ప్రశ్న తలెత్తక మానదు. మంచిర్యాల జిల్లాలోని 18 మండలాల పరిధిలో 969 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి.
ఇందులో 896 ప్రధానమైనవి కాగా, 73 మినీ కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. ఇందులో 220 కేంద్రాలకు స్వంత భవనాలు ఉండగా, 250 వరకు ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. మిగిలిన 499 కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. సగానికి పైగా కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతుండడం ఐసీడీఎస్ దుస్థితిని తెలియజేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేదని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంగన్‌వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా మార్చే ప్రక్రియ మొదలు కావడం అనుమానమే.
జిల్లాలో ఐదు ప్రాజెక్టులు
గతంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖగా ఉన్న శాఖను జిల్లాల పునర్విభజన తరువాత వికలాంగ, వృద్ధుల సక్షేమ శాఖతో కలిపి విలీనం చేశారు. దీంతో ప్రస్తుతం ఇది స్త్రీ, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖగా పేరు మార్చి సేవలు అందిస్తోంది. జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉండగా.. ఐదు ప్రాజెక్టులున్నాయి. మంచిర్యాల ప్రాజెక్టు పరిధిలో 243, చెన్నూరులో 248, లక్సెట్టిపేట్‌లో 200, బెల్లంపల్లిలో 165, తాండూరులో 107 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల్లో ఆరేళ్ల పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, వన్‌డే ఫుల్‌మీల్, పూర్వ ప్రాథమిక విద్యాబోధన, వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియ, ఆరోగ్య పరీక్షలు మొదలైన సేవలందిస్తారు. బాల్య వివాహాలు అరికట్టడం, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, వికలాంగులు సంక్షేమ కార్యక్రమాల అమలుతోపాటు వారికి న్యాయపరమైన సహకారం అందించడం అంగన్‌వాడీ కార్యకర్తల విధి. ప్రస్తుతం జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు 5,080 మంది, బాలింతలు 5,869, ఆరేళ్లలోపు చిన్నారులు 29,715 మంది ఉన్నారు. వీరికి అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించడం, పిల్లలకు చదువుపై ఆసక్తిని కలిగించడం, ఆటవస్తువులతో ఆడించడం అంగన్‌వాడీలకు కష్టంగా మారింది.
అద్దె భవనాలతో అవస్థలు...
జిల్లాలోని 969 అంగన్‌వాడీ కేంద్రాల్లో 499 కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. 220 స్వంత భవనాల్లో కొనసాగగా, అద్దె భవనాల్లోని కేంద్రాలకు ప్రతి నెలా అద్దెను చెల్లించడం లేదు. దీంతో అంగన్‌వా డీ కార్యకర్తలు అద్దె కోసం ఇంటి యజమానుల నుంచి ప్రతి నెలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి ఈజీఎస్ నుం చి నిధులను మంజూరు చేసినా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడంలో జాప్యం జరుగుతోంది. రెండు మూడు నెలలకు ఒకసారి అద్దెను ప్రభుత్వం అందించడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు వారి వేతనాల్లోంచి అద్దె చెల్లిం చి, ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఐసీడీఎస్ ద్వారా అందె అద్దె సైతం తక్కువగా ఉండడం, పట్టణ ప్రాంతాల్లో అద్దె ఎక్కువగా ఉండడంతో, తక్కువ అద్దెకు లభిస్తున్న ఇరుకైన చిన్న గదులు, శిథిలావస్థలో ఉన్న వాటిలోనే అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. చిన్నారులకు ప్రతిరోజూ పోషకాహారంతోపాటు ఆటపాటలతో కూడిన పూర్వప్రాథమిక విద్య అందించాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలు ఇరుకైన అద్దె భవనాల్లో అందించడం కష్టంగా మారింది.
ఆటలకు చిన్నారులు దూరం
అంగన్‌వాడీ కేంద్రాల్లో గది లోపల, ఆరుబయట ఆటలను ఆడించాల్సి ఉంటుంది. ఇందుకు గాను చిన్నారుల కోసం ప్రతి ఏడాది అన్ని కేంద్రాలకు క్రీడా సామగ్రిని ప్రభుత్వం సరఫరా చేస్తుంది. గదిలోపల ప్లకార్డులు, చెక్కబొమ్మలు, పుష్పాలు, కథల పుస్తకాలు, వస్తువులు, రంగులను గుర్తించడం, అట్టముక్కలతో వాటిని తయారు చేయడం వంటివి పిల్లలకు నేర్పించాల్సి ఉంటుంది. ఇక చిన్నారులకు శారీరక ఉల్లాసానికి ఆరుబయట ఆటలు ఆడేందుకు జారుడు బిల్ల, ఊయల, చెక్కబల్లలపై కూర్చుని ఆడుకునే వస్తువులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అద్దె భవనాలు ఇరుకుగా ఉండి, ఆరుబయట సరైన స్థలం లేక చిన్నారులకు ఆటలు ఆడుకునేందుకు అవకాశం లేకుండా పోయింది.
అద్దె కేంద్రాలు
Published Mon, Jan 23 2017 10:07 PM | Last Updated on Tue, Oct 2 2018 7:58 PM
Advertisement