అద్దె భవనాల్లో ఇంకెన్నాళ్లు?
► ఏళ్లుగా అద్దె భవనాల్లోనే అంగన్ వాడీ కేంద్రాలు
► మౌలిక వసతులు లేక ఇబ్బందులు
► పట్టించుకోని అధికారులు
ఇల్లంతకుంట : మూడు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులందరికి చదువుపై ఆసక్తిని పెంపొందించడంతోపాటు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్ వాడీ కేంద్రాలు అవస్థల నడుమ కొనసాగుతున్నాయి. మండలంలో 66 అంగన్ వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 30 సొంత భవనాలుండగా 14 కేంద్రాలు అద్దె ఇళ్లలో కొనసాగుతున్నాయి. 22 ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. అద్దె భవనంలో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కొన్ని గ్రామాల్లో పురాతన ఇళ్లలో కేంద్రాలు కొనసాగిస్తుండడంతో చిన్నపాటి వర్షం కురిసినా ఊరుస్తున్నాయి.
రేపాక, అనంతగిరి, వల్లంపట్ల, ఓబులాపూర్, ఇల్లంతకుంట గ్రామాల్లోని అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాల పరిస్థితి దయనీయంగా తయారైంది. అంగన్ వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు ప్రతీరోజు భోజనంతోపాటు పౌష్టికాహాన్ని అందిస్తున్నారు. అద్దె భవనాల్లో కేంద్రాలు కొనసాగించడం ఇబ్బందికరంగా మారిందని అంగన్ వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. వసతులు సక్రమంగా లేకపోవడంతో పిల్లలను పంపేందుకు వారి తల్లిదండ్రులు భయపడుతున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
మౌలిక వసతులు కరువు
కేంద్రాల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలతోపాటు మంచినీటి సదుపాయాలు లేవు. దీంతో కార్యకర్తలు, ఆయాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరో చోటు నుంచి నీళ్లు తీసుకొచ్చి కేంద్రాల్లో ప్రతీరోజు వంట చేయాల్సిన పరిస్థితి తయారైంది. ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని ప్రజలు, అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు.