సగానికిపైగా అంగన్‌వాడి కేంద్రాలు అద్దె కొంపల్లోనే
ఏళ్ల తరబడి నిర్మాణం పూర్తికాని 309 భవనాలు
వాటిని పట్టించుకోకుండా కొత్తగా 691 భవనాలు మంజూరు
225 చోట్లే అందుబాటులో స్థలాలు
అంచనా వ్యయం రూ.12.50 లక్షలు.. ఇచ్చింది ఏడు లక్షలు
ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధికారులు
ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధి లోపం.. శాఖల మధ్య కొరవడిన సమన్వయం అంగన్‌వాడీ చిన్నారులకు శాపంగా మారింది. అద్దె కొంపలు.. ఇరుకు గదులు.. శిథిల భవనాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వస్తోంది. ఆర్భాటంగా శంకుస్థాపనలు చేయడం.. ఆనక నిధులు చాల్లేదని మధ్యలోనే అర్ధతరంగా నిలిపేయడం పరిపాటిగా మారింది. గత అనుభవాలను పట్టించుకోకుండా జిల్లా యంత్రాంగం మరోమారు అరకొర నిధులతో అంగన్‌వాడీ భవనాలు నిర్మిం చేందుకు సిద్ధమవుతోంది.
విశాఖపట్నం: ముఖ్యంగా ఉపాధి హామీ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారుల తీరు వల్ల వందలాది అంగన్‌వాడీ భవనాలు పిల్లర్ల స్థాయిలో నిలిచిపోయి ఎందుకూ కొరగాకుండా తయారయ్యాయి. జిల్లాలో 4952 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 3587 మెయిన్, 1365 మినీకేంద్రాలున్నాయి. మెయిన్ కేంద్రాల్లో 1071 సెంటర్లకు సొంత భవనాలు ఉన్నాయి. 592 కేంద్రాలు ఎలాంటి అద్దె లేని ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయి. మరో 1924 కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. ఇక మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏ ఒక్క దానికి సొంత భవనం లేదు. వీటిలో చాలా కేంద్రాలు పూరిపాకల్లో నెట్టుకొస్తున్నారు.
ఏళ్ల తరబడి మొండిగోడలకే పరిమితం
ఆర్‌ఐడీఎఫ్, ఏపీఐపీ, అప్‌గ్రేడేషన్‌ల వంటి పథకాల కింద గతంలో 981 భవనాలు మంజూరు కాగా వాటిలో 387 మాత్రమే పూర్తయ్యాయి. 285 భవనాల పనులు కనీసం ప్రారంభానికి కూడా నోచుకోలేదు. 309 భవనాల నిర్మాణాలను అర్ధంతరంగా నిలిపేశారు. అప్పట్లో ఒక్కో భవనం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణాలు చేపట్టగా, నిధుల లేమితో మధ్యలో నిలిచిపోయి ఏళ్ల తరబడి మొండిగోడలకే పరిమితమయ్యాయి. వీటిని పూర్తిచేసేందుకు ఐసీడీఎస్ అధికారులు ఎంతగా ఒత్తిడి తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోతోంది.
నిధుల లేమి.. స్థలాల కొరత
తాజాగా జిల్లాకు కొత్తగా 691 భవనాలు మంజూరు కాగా.. వాటిలో 346 భవనాల నిర్మాణానికి నిధులు కూడా మంజూరయ్యాయి. ఓ పక్క స్థలాల కొరత.. మరో పక్క నిధుల కొరతే వీటికి శాపంగా మారింది. కనీసం నాలుగు సెంట్లు కూడా లేకుండా భవనాలు నిర్మించే అవకాశం లేదు. కొత్తగా మంజూరైన భవనాల కోసం స్థలాలు చూపించాల్సిందిగా పంచాయతీ కార్యదర్శులను కోరినా ప్రయోజనం లేకుండా ఉంది. కేవలం 225 కేంద్రాలకు మాత్రమే చాలినంత స్థలం అందుబాటులో ఉన్నట్టు గుర్తించారు. మిగిలిన చోట్ల స్థలాల కొరత పీడిస్తోంది. మరో పక్క కనీసం రూ.12 లక్షలు అంచనా వ్యయంతో చేపడితే కానీ ఈ భవనాల నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి లేదు. కానీ ఉపాధి హామీ కాంపొనెంట్ నిధుల నుంచి రూ.5 లక్షలు, ఐసీడీఎస్ నుంచి రూ.2 లక్షల చొప్పున కేటాయిస్తున్నారు. ఈ నిధులు ఏ మూలకూ సరిపోవని అధికారులు చెబుతున్నారు. మరో రూ.3 లక్షలు జెడ్పీ నుంచి సపోర్టు ఇవ్వాల్సిందిగా కోరినప్పటికీ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకు కేటాయిస్తుండడంతో జెడ్పీ కూడా నిధుల కొరతతో ఇబ్బందిపడుతోంది. దీంతో ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంది. దీంతో ఎన్‌ఆర్‌ఐల ద్వారా విరాళాలు సమీకరించి కనీసం రూ.10 లక్షలతోనైనా భవన నిర్మాణం చేపట్టాలని ఐసీడీఎస్ అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే చిత్తూరులో ఈ విధంగా ఓ ఎన్‌ఆర్‌ఐ సంస్థ అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి అదనపు ఆర్థిక సాయం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఆ సంస్థ ద్వారా జిల్లాలో అర్ధంతరంగా నిలిచిన భవనాలతో పాటు కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు కూడా అవసరమైన ఆర్థికసాయం కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.