సాక్షి,ఆదిలాబాద్/ఆదిలాబాద్‌అర్బన్: వృద్ధాప్య పింఛన్ వయసు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి 57 ఏళ్లు నిండిన వృద్ధులు ప్రతీనెల పింఛన్ అందుకునే వెసులుబాటు సర్కార్ కల్పించింది. గతంలో వృద్ధాప్య పింఛన్ వయసు 65 ఏళ్లుగా ఉండగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం 57 ఏళ్లకు కుదించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు రెండురోజులక్రితం విడుదల అయ్యాయి. నూతన మార్గదర్శకాలు జిల్లా అధి కారులకు అందాల్సి ఉంది. 57 ఏళ్లు నిండిన వృ ద్ధులు పింఛన్ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓటరుకార్డులోని వయసు ప్రమాణికంగా తీసుకొని పింఛన్‌కు ఎంపిక చేయనున్నారు.
జిల్లాలో 57 ఏళ్ల నుంచి 64 ఏళ్లలోపు ఎంత మంది ఉన్నారు..ఎంత మంది ఆసరా పథకానికి అర్హులు కానున్నారనే వివరాలు ఆయా మండలాల వారీగా లెక్క తేల్చేందుకు జిల్లా అధి కారులు చర్యలు ప్రారంభించారు. అయితే అర్హత వయసు నిండిన వారందరికీ వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటిన పింఛన్ సొమ్ము చేతికందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆసరాకు బడ్జెట్ కేటాయించి ఎన్నికల హామీ మేరకు పెంచిన పింఛన్ సొమ్ముతోపాటు కొత్త పింఛన్లను అందించేందుకు కసరత్తు మొదలుపెట్టింది.
జిల్లాలో 13 వేల మందికిపైగా అర్హులు
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పింఛన్ మం జూరుకు ఓటరుకార్డులోని వయసు ప్రమాణికంగా తీసుకుంటున్నందున 2018 సెప్టెంబర్ 19 నా టికి 57 ఏళ్లు నిండిన వారందరూ అర్హులే. అయితే ఆదిలాబాద్, బోథ్ రెండు నియోజకవర్గాల్లో 50 నుంచి 59 ఏళ్లు గల ఓటర్లు 47,979 మంది ఉన్నారు. ఇందులో 57 నుంచి 59 ఏళ్ల వయసు వారు సుమారు 8 వేల మందికిపైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 60 నుంచి 69 ఏళ్ల వయసు గల ఓటర్లు 27,085 మంది ఉన్నారు. అయితే ఇందులో 60,61, 62, 63,64 వయసు గల వారు సుమారు 5 వేలకుపైగా ఉంటారని అధికారులు అంచనాకు వచ్చారు.
అయితే ప్రస్తుతం సంవత్సరాల వారీగా ఓటర్ల వి వరాలు అందుబాటులో లేవు. ఒక ఫార్మాట్‌లో పదేళ్లకు కలిపి ఒకేసంఖ్య వచ్చేలా ఓటర్ల వివరా లు ఉన్నాయి. అయితే వయసుల వారీగా ఓట ర్లను గుర్తించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను హైదరాబాద్ నుంచి తీసుకురానున్నారని సమాచారం. ఇలా అయితేనే జిల్లా ఓటర్ల జాబితాలో 57 ఏళ్ల నుంచి 64 ఏళ్లలోపు ఎంత మంది ఉన్నారనేది స్పష్టంగా చెప్పవచ్చని అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా జిల్లాలో మరో13 వేల మందికిపైగా లబ్ధిదారులకు కొత్తగా ఆసరా పింఛన్ మంజూరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా జిల్లాలో ప్రస్తుతం 69,956 మంది ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. కొత్త వాటిని కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరగనుంది.
పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ..
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగనుంది. గ్రామాల్లో, పట్టణాల్లో ఎంపికకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. గ్రామాల్లో వీఆర్వోలు, పట్టణాల్లో అయితే బిల్ కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పాల్గొంటారు. ఇలా ఎంపిక చేసిన జాబితాను గ్రామ సభల ద్వారా ప్రదర్శిస్తారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే స్వీకరించి వచ్చిన వాటిని పరిశీలన చేసి తుది జాబితా రూపొందిస్తారు. లబ్ధిదారుల ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా, ఫొటోను పంచాయతీ కార్యదర్శులు, బిల్‌కలెక్టర్లు సేకరిస్తారు. గ్రామాల్లోని లబ్ధిదారుల జాబితాను ఎంపీడీవోలు, పట్టణ లబ్ధిదారుల జాబితాను కమిషనర్లు పరిపాలన అనుమతికోసం కలెక్టర్‌కు పంపిస్తారు. ఆమోదం తెలిపిన అనంతరం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ప్రస్తుతం ఉన్న ఆసరా సాప్ట్‌వేర్‌లో లబ్ధిదారుల వివరాలు అప్‌లోడ్ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment