నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: జిల్లా వైద్యఆరోగ్యశాఖ తాజాగా మరో వివాదానికి కేంద్రబిందువైంది. కాంట్రాక్టు ప్రాతిపదికన నియమితులైన హెల్త్ అసిస్టెంట్లకు(మేల్) గుట్టుచప్పుడు కాకుండా నియామక ఉత్తర్వులు అందజేయడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే డీఎంహెచ్‌ఓ సెలవుపై వెళ్లడంతో కొందరు ఆ ఆరోపణలకు మరింత పదును పెట్టారు.
ఈ వ్యవహారంలో భారీగా నగదు వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 52 హెల్త్‌అసిస్టెంట్(మేల్) పోస్టులను గురు, శుక్రవారాల్లో భర్తీ చేశారు. వీరంతా 2002,03 నుంచి ఆ పోస్టుల్లో కొనసాగుతున్న వారే. అవసరానికి మించి పోస్టులు భర్తీ చేశారనే కారణంతో గత ఏడాది జూలై 3న వీరిని ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇలా వందలాది మంది ఉద్యోగాలు కోల్పోవడంతో హైదరాబాద్‌లో ఏడాదిపాటు నిర్విరామంగా రిలేదీక్షలు కొనసాగించారు. ఎట్టకేలకు స్పందించి ప్రభుత్వం వీరిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ ఇటీవల అన్ని జిల్లాల డీఎంహెచ్‌ఓలకు ఆదేశాలిచ్చింది. అందులో భాగంగా జిల్లాలోనూ డీఎంహెచ్‌ఓ సుధాకర్ గురువారం 40 మందికి, శుక్రవారం 12 మందికి నియామకఉత్తర్వులిచ్చారు. వీరంతా గతంలో తాము పనిచేస్తున్న స్థానాల్లోనే నియమితులయ్యారు.
అయితే వీరికి నియామక ఉత్తర్వులు అందించే క్రమంలో భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులంతా సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సమ్మెలో ఉండగా గురువారం సాయంత్రానికి ఎక్కువ శాతం మందికి నియామక ఉత్తర్వులు అందజేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నియామక ప్రక్రియ పూర్తవగానే డీఎంహెచ్‌ఓ 22వ తేదీ వరకు సెలవు పెట్టారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు ఈ దండకాల వ్యవహారంలో కీలకపాత్ర పోషించారని కార్యాలయంలో ప్రచారం జరుగుతోంది. సుమారు రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్టు ఆరోపిస్తున్నారు.
గుట్టుగా ‘హెల్త్’ పోస్టుల భర్తీ !
Published Sat, Oct 19 2013 5:08 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement