గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ :
గ్రామీణ ప్రజలకు ఏ చిన్న అనారోగ్యం తలెత్తినా అందుబాటులో ఉండి మందులు ఇచ్చేదిమల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లే. అయితే జిల్లాలో పనిచేస్తున్న 165 మంది హెల్త్ అసిస్టెంట్ల కుటుంబాలు ఏడు నెలలుగా ఆకలితో అలమటిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యమే తమ దుస్థితికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. ప్రజావాణి వంటి కార్యక్రమాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ బడ్జెట్‌ను తమ శాఖలో పనిచేస్తున్న ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులకు కేటాయిస్తున్నారని, ఫలితంగా తాము పస్తులు ఉండాల్సిన పరిస్థితి తలెత్తిందని పేర్కొంటున్నారు.
డెరైక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ త్రైమాసిక బడ్జెట్‌లో తమ వేతనాలకు నిధులు కేటాస్తారని, అవి చాలకపోతే జిల్లా బడ్జెట్‌లో మిగిలిన నిధుల్ని కేటాయించి ఒక్కొక్కరికి నెలకు రూ.17 వేల చొప్పున జీతం ఇవ్వాల్సి ఉందని, అయినా అమలు కావడం లేదని హెల్త్ అసిసెట్లు విమర్శిస్తున్నారు. మళ్లీ బడ్జెట్ వచ్చే వరకూ తమకు ఆకలి కేకలు తప్పవా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా డీఎం అండ్ హెచ్‌వో సరసిజాక్షిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా బడ్జెట్ లేకపోవటం వల్లనే జిల్లాలోని 165 మంది హెల్త్ అసిస్టెంట్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని తెలిపారు.
అప్పు కూడా పుట్టడంలేదు
ఏడు నెలలుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోతే కుటుంబం ఎలా గడవాలి. రోజూ ఇంటి నుంచి వచ్చి పని చేస్తున్నామే తప్ప పైసా వేతనం ఇవ్వడం లేదు. మా పిల్లల చదువులు ఫీజుల చెల్లించక అటకెక్కుతున్నాయి. మా స్థితి తెలిసి నిత్యావసరాల వస్తువులను కూడా ఎవరూ కూడా అప్పుగా ఇవ్వడం లేదు.
- ఎస్.రమేష్, హెల్త్ అసిస్టెంట్, వడ్లమన్నాడు
క్షేత్రస్థాయి వైద్యానికి దెబ్బ
గ్రామీణ ప్రాంత ప్రజలకు జ్వరమొస్తే మందుబిళ్ల ఇవ్వాల్పిన బాధ్యత మాదే. మాకే జీతం ఇచ్చే దిక్కు లేకుండా పోతే ఎలా? ఇంటింటికీ వెళ్లి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయించేంది మేమే. ప్రభుత్వ పథకాలను నలుగురిలోకి తీసుకెళ్తున్న మాకే జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందిపెడుతోంది.
- సిహెచ్.మహంకాళీరావు, హెల్త్ అసిస్టెంట్, కౌతవరం
ఉద్యమం తప్పదు
హెల్త్ అసిస్టెంట్లకు జీతాలు చెల్లిం చకుండా కాలం గడిపితే ప్రభుత్వంపై ఉద్యమం తప్పదు. సంక్రాంతి పండుగ జరుపుకోకుండా మా ఉద్యోగులను ఇబ్బంది పెట్టారు. మాట్లాడితే బడ్జెట్ రావాలంటున్నారు. మాకు కేటాయిం చిన బడ్జెట్‌ను ఏం చేశారు? ఆ బడ్జెట్‌లో మా వేతనాలు ఎందుకు ఇవ్వలేదు? - కోటా బుజ్జిబాబు,
హెల్త్ అసిస్టెంట్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
హెల్త్ అసిస్టెంట్ల ఆకలి కేకలు
Published Mon, Jan 20 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
Advertisement
Advertisement