‘గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్ బాత్రూంలో 29వ తేదీ సాయంత్రం హిడెన్ కెమెరా పట్టు బడింది’. రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన ఇది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అసాంఘిక కార్యకలాపాలకు దుర్వినియోగం చేస్తున్న వాళ్లు కూడా విద్యావంతులే.
ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు వ్యవస్థ మొత్తం నిద్రలేవడం, ఆ తర్వాత మర్చిపోవడమే జరుగుతోంది. స్పై కెమెరాల దుర్వినియోగం మీద నిఘా వ్యవస్థ రోజూ పని చేయాల్సిందేనన్నారు ‘యాంటీ రెడ్ ఐ’ యాక్టివిస్ట్ వరలక్ష్మి. ఈ డేగకన్ను గురించి సామాన్యుల్లో అవగాహన కల్పించడానికి సినిమా హాళ్లలో ప్రకటనల రూపంలో స్పై కెమెరాలు ఎన్ని రకాలుగా అమర్చే అవకాశం ఉంటుందో బొమ్మలతో చూపిస్తూ న్యూస్ రీల్ వేయాలన్నారు.
తరచూ తనిఖీలు తప్పనిసరి!
విద్యాసంస్థలకు అనుమతులిచ్చేటప్పుడే అమ్మాయిలు, అబ్బాయిల హాస్టల్ భవనాలు ఏ దిశలో ఉన్నాయి. రెండు భవనాల్లో బాత్‌రూమ్‌లు ఒకరికొకరు కనిపించని విధంగా నిర్మాణం ఉండాలి. షీ టీమ్స్, భరోసా టీమ్ సభ్యులు ప్రతి విద్యాసంస్థ నుంచి కొందరు ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ ఉమెన్ క్యాడెట్‌లను సమీకరించి వర్క్‌షాపులు నిర్వహించాలి. ఆ ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ క్యాడెట్‌లు తమ విద్యాసంస్థలో వర్క్‌షాపులు నిర్వహిస్తూ స్పై కెమెరాలను గుర్తించడం, గుర్తించిన వెంటనే ఇంటర్నల్ కమిటీలకు తెలియచేయడం మీద చైతన్యవంతం చేయాలి. పోలీస్ డిపార్ట్‌మెంట్ పట్టణం, నగరంలోని విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, హాస్పిటళ్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్‌లో తనిఖీలు చేసి ‘ఫలానా తేదీన, ఫలానా టైమ్‌లో తనిఖీ జరిగింది. అసాంఘికంగా ఎటువంటి స్పై కెమెరాలు లేవు’ అనే స్టిక్కర్ అతికించాలి. స్పై కెమెరాను గుర్తిస్తే ఆ విద్యాసంస్థ, వ్యాపార సంస్థ ఏదైనా సరే తక్షణమే మూసివేయడం, యజమాని మీద నాన్‌బెయిలబుల్ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేయడం వంటి కఠినచర్యలు ఉండాలి. రోజూ నగరంలో ఏదో ఒక చోట తనిఖీలు జరుగుతుంటే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు కళ్లెం పడుతుంది. వ్యాపార సంస్థల ప్రకటనల హోర్డింగ్‌లో స్పై కెమెరా లోగో, ‘మహిళల భద్రత మా బాధ్యత’ అనే క్యాప్షన్ ముద్రించడం తప్పనిసరి చేయాలి.
స్పై కెమెరాలు లక్షల్లో అమ్ముడవుతున్నాయి!
స్పై కెమెరాల అమ్మకం మీద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్పై కెమెరా కొంటున్న వారి ఆధార్ నంబరు, స్పై కెమెరా కొంటున్న అవసరం ఏమిటో స్పష్టంగా తెలియచేయాలనే నిబంధన పెట్టాలి. ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో లోకల్ కమిటీలున్నాయి. జిల్లా కలెక్టర్, షీ టీమ్స్ సేవలను విస్తృతం చేయడంతోపాటు బాధితులు సమాచారం అందించడానికి జిల్లాకో ఫోన్ నంబరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. అప్పుడే ఇలాంటి దుశ్చర్యలకు అడ్డుకట్ట పడుతుంది.
కెమెరా లేదనే భరోసానిద్దాం!
హెవెన్ హోమ్స్ సొసైటీ ద్వారా ఆపదలో ఉన్న అమ్మాయిలను రక్షించడం, వారికి సాధికారమైన ఉ΄ాధి కల్పించడం, వివిధ సామాజికాంశాలపై అవగాహన కోసం సదస్సులు, శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ‘యాంటీ రెడ్ ఐ’ పేరుతో స్పై కెమెరాల మీద యుద్ధం మొదలు పెట్టాం. ఈ దుర్మార్గాన్ని అరికట్టడానికి ఒక నియమావళిని రూపొందించాను. ఆ సూచనలతో తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15న స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా మహిళల భద్రత కోసం ‘నో హిడెన్ కెమెరా ఇన్‌సైడ్’ అనే ప్రోగ్రామ్ మొదలు పెట్టింది. సీసీటీవీలున్న చోట ‘మీరు సర్వేలెన్స్ కెమెరా నిఘాలో ఉన్నారు’ అనే హెచ్చరిక ఉన్నట్లే... ‘స్పై కెమెరా లేదా హిడెన్ కెమెరా లేదు, మీరు ధైర్యంగా ఉండవచ్చు’ అని భరోసా కలిగించే క్యాప్షన్ కూడా ఉండాలి. నిర్భయ నిధులు ప్రతి రాష్ట్రానికీ విడుదలవుతుంటాయి. కానీ ఖర్చు చేయకుండా ఉండి పోతుంటాయి. ఆ నిధులను ఇలా సద్వినియోగం చేయాలి. – అడపా వరలక్ష్మి, సామాజిక కార్యకర్త
– వాకా మంజులారెడ్డి,
సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment