Covert Creatures: పావురాల నుంచి డాల్ఫిన్ల దాకా.. | Covert Creatures: History of Spy Animals | Sakshi
Sakshi News home page

Covert Creatures: పావురాల నుంచి డాల్ఫిన్ల దాకా..

Published Tue, Sep 10 2024 6:33 AM | Last Updated on Tue, Sep 10 2024 6:33 AM

Covert Creatures: History of Spy Animals

గూఢచారులుగా జంతువులు, పక్షులు

బెలుగా జాతికి చెందిన అరుదైన పెద్ద గూఢచారి తిమింగలం ‘హవాల్దిమీర్‌’దక్షిణ నార్వే తీరంలో బుల్లెట్‌ గాయాలతో విగతజీవిగా కనిపించడం ఇటీవల అంతర్జాతీయ వార్తాంశంగా నిలిచింది. దీంతో అసలు మనిషి ఇంతవరకు ఏ జాతుల జీవులను నిఘా కోసం గూఢచారులుగా వినియోగించుకున్నాడన్న చర్చ మొదలైంది. గూఢచారులుగా ఈ జంతువులు నిర్వర్తించిన విధుల్లేంటి. వాటిల్లో అత్యుత్తమ గూఢచారి ఏది? వంటి ఆసక్తికర అంశాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం..  

 గూఢచార జీవులు...  
అత్యాధునిక పరికరాలు, చిన్న నిఘా కెమెరాలు రాకముందు సుదూర ప్రాంతాలకు రహస్య సమాచారాన్ని సురక్షితంగా చేరవేయడం ఓ సవాలుగా ఉండేది. దీంతో సందేశాలు పంపడానికి పావురాలను ఉపయోగించేవారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో నిఘా కోసం జర్మన్‌ సైన్యం ప్రత్యేకంగా బుల్లి కెమెరాలు రూపొందించి వాటిని పావురాలకు కట్టింది. వాటిల్లో రికార్డయ్యే సమాచారంతో శత్రు జాడ తెల్సుకునేది. 

రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలూ గూఢచర్యానికి పావురాలనే నమ్ముకున్నాయి. 1970లలో అమెరికా సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ(సీఐఏ) తన ప్రత్యేక నిగా ఆపరేషన్‌ ‘టకానా’లో భాగంగా బుల్లి కెమెరాలు అమర్చిన పావురాలను సోవియట్‌ రష్యాలోకి పంపింది. ఇలా పావురాలు మాత్రమే కాదు.. పిల్లులు, తిమింగలాలు, డాల్ఫిన్లు, ఇంకొన్ని రకాల పక్షులు, చనిపోయిన జంతువులు కూడా కోవర్ట్‌ ఆపరేటర్లుగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాయి.  

డాల్ఫిన్లతో ప్రత్యేకంగా..  
ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సోవియట్‌ నావికాదళం సముద్ర క్షీరదాలతో వివిధ కార్యక్రమాలను చేపట్టింది. వీటిలో ఒకటి డాల్ఫిన్లకు శిక్షణ ఇవ్వడం. అమెరికా నావికాదళం సముద్ర క్షీరదాల కార్యక్రమం(ఎంఎంపీ) కింద సముద్రజలాల్లో నిఘా కోసం డాల్ఫిన్లను ఉపయోగించింది. 1960లలో ప్రాజెక్ట్‌ ఆక్సిగాస్‌లో భాగంగా శత్రు నౌకలకు పేలుడు పరికరాలను అమర్చేందుకు సీఐఏ డాల్ఫిన్లకు శిక్షణ ఇచి్చంది. 

ఈ కార్యక్రమానికి సముద్రాల్లో స్వేచ్ఛగా తిరిగే రెండు ‘బాటిల్‌నోస్‌’డాల్ఫిన్లను ఉపయోగించారు. ప్రపంచంలోని అత్యంత తెలివైన జంతువులుగా డాల్ఫిన్లు ప్రసిద్ధి చెందాయి. క్రిమియాలోని సెవాస్టోపోల్‌ నల్లసముద్రంలోని నౌకాదళ స్థావరంలో శత్రు డైవర్లను గుర్తించడానికి, ఎదుర్కోవడానికి డాల్ఫిన్లకు శిక్షణ ఇచ్చేందుకు రష్యా గత సంవత్సరం ఒక క్షీరద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని బ్రిటిష్‌ ఇంటెలిజెన్స్‌ నివేదిక బహిర్గతంచేసింది. 2023 ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు సెవాస్టోపోల్‌ నౌకాశ్రయంలో తేలియాడే క్షీరదాల బోనుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు బ్రిటిష్‌ సైనిక నిఘా ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది.  

పిల్లుల చెవులకు మైక్రో ఫోన్లు 
పిల్లులను తెలివైన జంతువులుగా భావిస్తారు. సీఐఏ 1960వ దశకంలో పిల్లులను ఉపయోగించి ‘ఆపరేషన్‌ అకౌస్టిక్‌ కిట్టీ’అనే ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. దీని కోసం 2 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. ప్రాజెక్టులో భాగంగా పిల్లుల చెవుల్లో మైక్రోఫోన్లను ఏర్పాటు చేసింది. ఇవి సోవియట్‌ దౌత్యవేత్తలు, ఏజెంట్ల సంభాషణలను రహస్యంగా రికార్డ్‌ చేస్తాయి.

 పిల్లి పెంపుడు జంతువు. అది బహిరంగ ప్రదేశాలు, కొన్ని రహస్య ప్రదేశాల్లో అవి ప్రత్యక్షమవడం శత్రు దేశాలకు అనుమానాలు పెంచే అవకాశం ఉంటుంది. అదీగాక పిల్లులను నియంత్రించడం అంత సులభం కాదు. శిక్షణాసమయంలో వాటిని శిక్షకులు నియంత్రించలేక చేతులెత్తేశారు. పిల్లులు వాటికి సూచించిన ప్రాంతాలకు కాకుండా తమకిష్టమైన ప్రదేశాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో చేసేదిలేక చివరికి 1967లో ఈ కార్యక్రమానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు.  

టాప్‌ ఏజెంట్‌.. పావురం  
పిల్లులు, చనిపోయిన ఎలుకల వంటివాటిని రంగంలోకి దింపి పని కానిచి్చనప్పటికీ వివిధ దేశాల నిఘా సంస్థలు శతాబ్దాలుగా ఎక్కువ నమ్మకం పెట్టుకున్నది పావురం మీదనే. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్‌ ఇంటెలిజెన్స్‌ నిర్వహించిన అత్యంత విజయవంతమైన గూఢచారి కార్యక్రమం ‘ఆపరేషన్‌ కొలంబా’పావురాలతోనే విజయంవంతమైంది. జర్మన్‌ సైనిక కార్యకలాపాలను, సున్నితమైన సైనిక స్థానాలపై నిఘాను హోమింగ్‌ జాతి పావురాలు సేకరించాయి. పేపర్‌పై రాసిన సందేశాలను సూక్ష్మ డబ్బాల్లో పెట్టి పక్షి కాలికి కట్టేశారు. 

ఈ రహస్య సందేశాలలో నాజీ దళాల కదలికలు, నాజీల కొత్త ఆయుధాలపై నివేదికలు, ప్రణాళికాబద్ధమైన రాకెట్‌ దాడుల వివరాలను వేగులు సేకరించి పావురాల ద్వారా ప్రధాన కేంద్రానికి రహస్యాన్ని పంపేవారు. రచయిత గోర్డాన్‌ కోరేరా ‘ఆపరేషన్‌ కొలంబా: ది సీక్రెట్‌ పీజియన్‌ సరీ్వస్‌’పుస్తకంలో ఇలాంటి ఎన్నో వివరాలు ఉన్నాయి. బ్రిటిష్‌ ఇంటెలిజెన్స్‌ 1941 నుంచి 1944 మధ్య నాజీ ఆక్రమిత ఐరోపాపై 16,000 హోమింగ్‌ జాతి పావురాలను వాడారు. అన్నింటికన్నా ముఖ్యంగా పక్షుల ద్వారా గూఢచర్యం విజయవంతంకావడంతో నూతన టెక్నాలజీలకూ కపోతమే స్ఫూర్తిగా నిలిచింది. గత నెలలో చైనా అచ్చం పావురంలాగా ఉండే చిన్నపాటి నిఘా డ్రోన్‌ను ఆవిష్కరించడం తెల్సిందే. 

గూఢచార పావురాలని... 
భారత ఉపఖండంలో సందేశాలను పంపించడానికి పావురాలను ఉపయోగించినట్టుగా చరిత్ర చెబుతోంది. 2020 మేలో కశ్మీర్‌లోని ఓ గ్రామంలో నంబర్ల సెట్‌ ఉంగరం కలిగిన పావురం కనిపించింది. దానిని పట్టుకున్న గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. పాకిస్తాన్‌కు చెందిన గూఢచారి పావురమై ఉంటుందని, దానిపై ఉన్నది కోడ్‌ అని అనుమానించిన పోలీసులు.. డీ క్రిప్ట్‌ చేయడానికి ప్రయట్నించారు. చివరికది గూఢచారి పావురం కాదని తేలడంతో విడిచిపెట్టారు. 

2016 అక్టోబర్‌లో భారత ప్రధానిని బెదిరిస్తూ మరో పావురం కనిపించింది. పంజాబ్‌లోని పఠాన్‌ కోట్‌లో ఈ పావురాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 2023 మేలో ముంబైలో దొరికిన పావురాన్ని చైనా గూఢచారిగా అనుమానిస్తూ ఎనిమిది నెలల పాటు బోనులో ఉంచి దాని ఆనుపానాలు సేకరించారు. ఆ పావురం కాలుకు ఉంగరాలు కట్టి, దాని రెక్కల కింది భాగంలో చైనీస్‌ భాషలో ఏదో రాశారు. అయితే అది తైవాన్‌లో రేసింగ్‌ పోటీలో పాల్గొన్న పక్షి అని ఫిబ్రవరిలో తేలడంతో ఎట్టకేలకు దానిని అధికారులు వదిలేశారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement