బూస్టర్‌ డోసు అవసరం లేదు! | No scientific evidence to support need for Covid-19 booster dose | Sakshi
Sakshi News home page

బూస్టర్‌ డోసు అవసరం లేదు!

Published Tue, Nov 23 2021 6:12 AM | Last Updated on Tue, Nov 23 2021 12:39 PM

No scientific evidence to support need for Covid-19 booster dose - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత కొంతకాలానికి బూస్టర్‌ డోసు కూడా తప్పనిసరిగా తీసుకోవాలన్న వాదన ఇటీవల గట్టిగా వినిపిస్తోంది. అయితే, కరోనా మహమ్మారి నియంత్రణకు బూస్టర్‌ డోసు అవసరమని చెప్పడానికి ఇప్పటిదాకా ఎలాంటి శాస్త్రీయ ఆధారం లభించలేదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) డాక్టర్‌ బలరాం భార్గవ సోమవారం చెప్పారు. దేశంలో అర్హులైన వారందరికీ కరోనా టీకా రెండో డోసు పంపిణీని పూర్తి చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం  అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కేవలం భారత్‌లోనే కాదు, ప్రపంచమంతటా అర్హులకు కరోనా వ్యాక్సిన్‌ అందాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు.

ఇమ్యూనైజేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా విభాగం(ఎన్‌టీఏజీఐ) త్వరలో భేటీ కానుంది. బూస్టర్‌ డోసుపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది. బూస్టర్‌ డోసు అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా ఇటీవలే స్పందించారు. దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకా రెండు డోసులు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అది నెరవేరాక బూస్టర్‌ డోసుపై నిపుణుల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. దేశ అవసరాలకు సరిపడా టీకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. బూస్టర్‌ డోసు ఇవ్వాల్సిందేనని ఐసీఎంఆర్, నిపుణుల బృందం సూచిస్తే కచ్చితంగా పరిశీలిస్తామని వెల్లడించారు. అధికార వర్గాలు ప్రకటించిన గణాంకాల ప్రకారం.. భారత్‌లో అర్హులైనవారిలో ఇప్పటివరకు 82 శాతం మంది కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారు. 43 శాతం రెండో డోసు కూడా తీసుకున్నారు. గడువు ముగిసినప్పటికీ 12 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఇంకా రెండో డోసు తీసుకోలేదు.  

ప్రపంచంలో పరిస్థితేంటి?
‘బూస్టర్‌’ అంటే!
కోవిడ్‌ రెండు డోసుల వ్యాక్సిన్స్‌ తీసుకుంటే కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు మన శరీరంలో వృద్ధి చెందుతాయి. ఇవి వైరస్‌ నుంచి మన శరీరాన్ని కాపాడతాయి. వ్యాక్సిన్స్‌ రెండుడోసులు తీసుకొని ఐదారునెలలు గడిచాక వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం తగ్గుతుంది. వ్యాక్సిన్‌ ప్రభావశీలత క్రమేపీ తగ్గుతుంది. అప్పుడేం చేయాలి? అదనంగా మరో డోసు... మూడో డోసు (దీన్నే బూస్టర్‌ డోసు) తీసుకోవాలి. 60 ఏళ్ల పైబడిన వారు, రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవారు, స్టెరాయిడ్ల వాడటం మూలంగా రోగనిరోధక తగ్గినవారిని అధిక రిస్కు కలిగిన వారిగా భావించి... పలుదేశాలు మొదట వీరికి బూస్టర్‌ డోసులను సిఫారసు చేశాయి. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మార్కెట్లు తెరుచుకొని వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు యధావిధిగా సాగాలన్నా, ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కాలన్నా... కోవిడ్‌ నుంచి రక్షణతో జనం స్వేచ్ఛగా విహరించే పరిస్థితినే పలుదేశాలు కోరుకుంటున్నాయి.  

ఏయే దేశాలు ఇస్తున్నాయంటే...
నవంబరు నెలారంభం నాటికే ప్రపంచవ్యాప్తంగా 36 దేశాలు బూస్టర్‌ డోసులను మొదలుపెట్టేశాయి లేదా ఆరంభించే క్రమంలో ఉన్నాయి. ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీ బూస్టర్‌ డోసులిస్తున్నాయి. ఇజ్రాయెల్, యూకే, ద.కొరియా, టర్కీ, బ్రెజిల్‌ ఈ జాబితాలో ఉన్నాయి. స్వీడన్, స్పెయిన్‌ వయోధికులకు మొదలుపెట్టాయి. అమెరికా, కెనడా ఒకట్రెండు రోజుల్లో ఆరంభించనున్నాయి.

12 % బూస్టర్లే
అందుబాటులో ఉన్న లెక్కలకు బట్టి చూస్తే ఒక్క నవంబరు 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన డోస్‌లలో 12 శాతం బూస్టర్‌ డోస్‌లేనట! ప్రతి 100 మంది జనాభాలో అత్యధికులకు బూస్టర్‌ డోసులు ఇచ్చిన దేశాల జాబితాలో ఇజ్రాయెల్, చిలీ, ఉరుగ్వే ముందున్నాయి.

పేద దేశాలకు అన్యాయం చేయొద్దు: డబ్ల్యూహెచ్‌వో
బూస్టర్‌ డోసులు అవసరమనడానికి ఆధారాలు పరిమితంగా, అసంపూర్తిగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంటోంది. ఆధునిక దేశాలు అప్పుడే మూడో డోసులు ఇవ్వడం మొదలపెడితే అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద ఆఫ్రికా దేశాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, వ్యాక్సిన్ల పంపిణీలో తీవ్ర అసమానతలకు దారితీస్తుందని డబ్ల్యూహెచ్‌వో డెరెక్టర్‌ జనరల్‌ ట్రెడోస్‌ అథనోమ్‌ ఘెబ్రెయాసస్‌ ఈనెల 13న హెచ్చరించారు. కొన్ని దేశాల్లో ప్రతి 100 మందిలో 20లోపు మందికే తొలి డోసు అందిందని, ఆఫ్రికా దేశాల్లోనయితే కేవలం 5 శాతం మందే తొలిడోసును పొందగలిగారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం జనాభాలో 52.6 శాతం మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ అందింది.           

– నేషనల్‌ డెస్క్, సాక్షి  

భారత్‌లో..
మనదేశంలో ఇప్పటిదాకా 115 కోట్ల డోసుల పంపిణీ జరిగింది. రెండు డోసులు తీసుకున్న వారు 38.11 కోట్లు ఉండగా... 37. 45 కోట్ల మంది ఒక్కడోసు (ఈనెల 17 నాటికి కేంద్ర ఆరోగ్య మంత్రి మనుసుఖ్‌ మాండవియా చెప్పిన ప్రకారం) తీసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement