సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ ఘంటికలు మోగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 22 మందికి స్వైన్‌ఫ్లూ సోకినట్టు ప్రజారోగ్యశాఖ గుర్తించింది. అందులో ఇద్దరు మృతి చెందారు. ముఖ్యంగా విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో వ్యాధి సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లాలంటేనే జనం భయపడే పరిస్థితి నెలకొంది. వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో, చిత్తూరు జిల్లా వాసి తమిళనాడులోని వేలూరులో చికిత్స చేయించుకుంటూ మృతి చెందారు. రోజు రోజుకూ వైరస్ వ్యాప్తి జరుగుతున్నట్టు ప్రజారోగ్యశాఖకు సమాచారమందింది. హెచ్1 ఎన్1గా చెప్పుకునే ఈ వైరస్ చిన్న పిల్లలు, గర్భిణులు, 65 ఏళ్లు దాటిన వారికి ఎక్కువగా సోకుతున్నట్టు ప్రజారోగ్యశాఖ వెల్లడించింది. అంతేగాకుండా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండే కాలేయ, కిడ్నీ, గుండె, రక్తహీనత వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. చలి పెరిగే కొద్దీ వైరస్ మరింతగా విస్తరించే అవకాశమున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తిరుపతి, విశాఖల్లో హై అలర్ట్...
రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కువగా చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. తిరుమలలో ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్న కారణంగా రద్దీ పెరుగుతోందని, ఈ వ్యాధి ఎక్కువగా జనసమర్థ ప్రాంతాలకే సోకుతుందని హెచ్చరించారు. గత ఏడాది ఒక్క చిత్తూరు జిల్లాలోనే 44 మందికి ఈ వ్యాధి సోకింది. విశాఖపట్నంలోనూ అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పోయే వారి వల్ల అక్కడ కూడా ఎక్కువగా నమోదవుతున్నట్టు తేలింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం విమానాశ్రయంలో ఇప్పటికే ప్రత్యేక వైద్య పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ రెండు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించినట్టు ప్రజారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తగా ఎన్ 95 మాస్కులు, పీపీఈ కిట్‌లు, ప్రత్యేక వార్డుల ఏర్పాటు, వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలని అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు వెళ్లాయి.
స్వైన్‌ఫ్లూ లక్షణాలు
– స్వైన్‌ఫ్లూ లక్షణాలను మూడు కేటగిరీలుగా విభజిస్తారు. ఎ కేటగిరీలో తీవ్రస్థాయిలో జలుబు, తుమ్ములు రావడం, ముక్కుల వెంట విపరీతంగా నీళ్లు కారడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, స్వల్పంగా జ్వరం ఉంటాయి.
– బి కేటగిరీలో కొద్ది కొద్దిగా జ్వరం, ఒళ్లునొప్పులు పెరగడంతో దగ్గు ఎక్కువగా ఉంటుంది. స్వల్ప ఆయాసంతో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది.
– సి కేటగిరీలో జలుబు తీవ్రమై ఆయాసంతో గుక్కతిప్పుకోలేక పోవడం, ఛాతీలో నొప్పి ఉంటుంది. తీవ్రత పెరిగితే అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
నివారణకు మార్గాలు
– తుమ్ములతో కూడిన జలుబు ఉంటే పారాసెటిమాల్ మాత్రలు వేసుకుంటూ... ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి.
– బి కేటగిరీలో ఉన్న వ్యాధిగ్రస్థులైతే వైద్యుల సలహాతో ఒసాల్టమవీర్ మందులను వేసుకోవాలి.
– సి కేటగిరీలో ఉన్న వారు ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులో చికిత్స పొందాలి.
– వ్యాధి లక్షణాలున్న వారు జనసమర్థ ప్రాంతాల్లో తిరగకూడదు
– రోగులు గానీ, వారికి వైద్యమందించే సిబ్బందిగానీ మాస్క్‌లు, గ్లౌజ్‌లు విధిగా ధరించాలి
పీహెచ్‌సీ స్థాయి నుంచి మందులు అందుబాటులో
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి బోధనాసుపత్రి వరకూ టామీఫ్లూ మాత్రలు, సిరప్స్ అందుబాటులో ఉంచాం. ఇప్పటికే అన్ని జిల్లాల వైద్యాధికారులకు అప్రమత్తంగా ఉండాలని సూచించాం. వ్యాధి సోకిన బాధితుల పరిసర ప్రాంతాలను పరిశీలించాలని చెప్పాం. ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించాం. ప్రమాదకర పరిస్థితులు ఏమీ లేవు.
– డా.గీతాప్రసాదిని, అదనపు సంచాలకులు, ప్రజారోగ్యశాఖ
Comments
Please login to add a commentAdd a comment