దడదడలాడిస్తున్న స్వైన్‌ఫ్లూ
⇒ నివారణ చర్యలు వేగవంతం
⇒ అవగాహన కోసం సదస్సులు
⇒ విద్యార్థులకు కరపత్రాల పంపిణీ
⇒ అధికారులతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
⇒ ఆగమేఘాల మీద కదిలిన ఆరోగ్య శాఖ
⇒ జిల్లాకు ప్రత్యేకాధికారి నియామకం
ప్రత్యేకాధికారిగా జనార్ధన్‌రెడ్డి
స్వైన్‌ఫ్లూ విజృంభిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నివారణ చర్యలకు నడుం బిగించింది. తాజా పరిస్థితులను సమీక్షించేందుకు సీనియర్ ఐఏఎస్‌లను ప్రత్యేకాధికారులుగా నియమించింది. మన జిల్లాకు ప్రత్యేకాధికారి గా మున్సిపల్ పరిపాలనా శాఖ కమిషనర్ అండ్ డెరైక్టర్ బి. జనార్దన్‌రెడ్డి నియమితులయ్యారు. స్వైన్‌ఫ్లూ నివారణ కోసం జిల్లాలో తీసుకోనున్న చర్యలను ఆయన పర్యవేక్షిస్తారు.
నిజామాబాద్ అర్బన్ : రాష్ట్రాన్ని వణికిస్తున్న స్వైన్‌ప్లూ పై వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైం ది. వ్యాధి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు, అవగాహన సదస్సులు చేపట్టేందుకు సిద్దమైంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బుధవారం ఆ శాఖకు పలు సూ చనలు చేసింది. జిల్లాలోని అన్ని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలలో వ్యాధికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు జోరుగా చేపట్టాలని వైద్య శాఖ నిర్ణయించింది.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్వైన్‌ఫ్లూ కు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేయనున్నారు. మూడేళ్ల క్రితం స్వైన్‌ప్లూతో జిల్లాలో నలుగురు మృతి చెందగా, పదిహేను కేసులు నమోదయ్యాయి. అప్పుడు మహా రాష్ట్రలో వ్యాధి తీవ్రత ఉండడంతో జిల్లాపై దీని ప్రభావం పడింది. గత వారం డిచ్‌పల్లి మండలం ఇందల్‌వాయిలో అన్వర్ అనే యువకుడు ఇవే లక్షణాలతో మృతి చెందాడు. అప్పటి నుంచే అధికారులు దీనిపై దృష్టి సారించారు. ఆ గ్రామానికి వెళ్లి మాత్రలను పంపిణీ చేశారు.
గోడప్రతులు, కరత్రాలు పంపిణీ
వ్యాధికి సంబంధించిన బ్యానర్లు, వాల్‌పోస్టర్లను అన్ని ఆరోగ్యకేంద్రాలకు పంపిణీ చేయనున్నారు. అన్ని గ్రామ పంచాయతీలు, ప్రధాన కూడళ్లు, ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. రోజూ గ్రామంలో డప్పు చాటింపు చేయనున్నారు. వ్యాధి సోకితే నివారణ మందులు అందించేందుకు సిద్దంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బసవేశ్వరి సిబ్బం దిని ఆదేశించారు. ప్రస్తుతం కొద్ది సంఖ్యలో మాత్రమే మాత్రలు మాత్రమే అం దుబాటులో ఉన్నాయి. ఆస్పత్రి అభివృద్ధి సంఘం నుంచి మాత్రలు కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలోనూ ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నారు. ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.
ప్రత్యేక కార్యక్రమాలు
స్వైన్ ప్లూకు గురికాకుండా ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ తెలిపారు. వైద్యాధికారులతో ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసి అన్ని పీహెచ్‌సీలలో వ్యాక్సిన్లు, మాత్రలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించామన్నారు. వ్యాధి ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
రాష్ట్రంలో హైదరాబాద్ మొదలు వివిధ ప్రాంతాలలో వ్యాధి ప్రబలుతోందని, జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అధికారులకు సూచించారు.స్వై న్‌ప్లూ అంటువ్యాధి అని, వైరస్‌తో వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. ఊపిరితిత్తులకు సోకి ప్రాణాంతకంగా పరిణమిస్తుందని హెచ్చరించారు. బుధవారం ఆయన సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తాజా పరిస్థితిని సమీక్షించారు.
దూరంగా ఉండండి
ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పు డు వ్యాప్తి చెందుతుందని ప్రజారోగ్య శాఖ సంచాలకులు సాంబశివరావు తెలి పారు. జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం దీని లక్షణాలని పేర్కొన్నారు. ఈ వ్యాధి నివారణకు ఎక్కువగా నీటిని, ద్రవపదార్థాలను తీసుకోవాలని సూచిం చారు.
సబ్బును, శుభ్రమైన నీటిని ఉపయోగించి చేతులను కడుక్కోవాలన్నారు. స్వైన్‌ప్లూ వ్యాధిగ్రస్తుల నుంచి దూరంగా ఉండాలని, నోటికి మాస్కులు ధరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ గ్రామీణ ఆరోగ్య సంస్థ ఎండీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ బుద్ధప్రసాద్, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ బసవేశ్వరి, డీసీహెచ్‌ఎస్ శివదాస్, డీపీఓ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఇలా చేయండి
* బహిరంగ ప్రదేశాలలో, కార్యాలయాలలో, ఏటీఎంలు, తలుపు గొళ్లాలు, లిప్టు స్విచ్చులు మొదలైనవి వాడిన పిదప, ప్రయాణాలు చేసిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అప్పటివరకు ముక్కు, కళ్లు, నోటిని ముట్టుకోకండి. చేతులను కడుక్కొనేందుకు సబ్బును లేదా డిటర్జెంట్ ద్రావణాన్ని ఉపయోగించండి.
* చేతులను తరచుగా కడుక్కోండి
* తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కును, నోటికి చేతి రుమాలు లేక చేతిని అడ్డం పెట్టుకోండి
* నిద్రకు తగినంత సమయం కేటాయించండి
* ఎక్కువగా నీళ్లు తాగండి, పౌష్టికాహారం తినండి
చేయకూడనివి
* ఇతరులను కలిసిప్పుడు చేతులు కలపడం, (షేక్ హ్యాండ్) లేక కౌగిలించుకోవడం
* జన సమ్మర్థం ఉన్న ప్రాంతాలకు వెళ్లడం
* బహిరంగ ప్రదేశాలలో ఉమ్మివేయడం.
* డాక్టరు సలహా లేకుండా స్వయంగా మందులు వాడటం ప్రమాదకరం.