పరస్పర సహకారంతోనే సమాజం సుభిక్షం | Interaction Making an ideal society | Sakshi
Sakshi News home page

పరస్పర సహకారంతోనే సమాజం సుభిక్షం

Published Fri, Dec 6 2013 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM

పరస్పర సహకారంతోనే సమాజం సుభిక్షం

పరస్పర సహకారంతోనే సమాజం సుభిక్షం

ప్రవక్త ప్రవచించినట్లు, సాటివారి కష్టాలను దూరం చెయ్యడం, వారి బాధల్లో పాలు పంచుకోవడం, అన్న వస్త్రాలు, గృహవసతి లాంటి ప్రాథమిక అవసరాలు తీర్చడంతోపాటు, పీడన, వివక్ష, అసమానతలు లేని సమాజం ఆవిష్కృతమైతే ఇంకా అంతకంటే కావలసినదేముంటుంది?
 
 సమాజం సుభిక్షంగా ఉండాలంటే, మానవుల మధ్య పరస్పర సంబంధ బాంధవ్యాలు సజావుగా, సామరస్య పూర్వకంగా, ప్రేమమయంగా ఉండాలి. హజ్రత్ అబూ హురైరా (రజి) కథనం ప్రకారం, ఈ విషయాన్ని దైవప్రవక్త ముహమ్మద్ (స) ఇలా విశదీకరించారు...
 
 ‘‘ఒక వ్యక్తి మరో వ్యక్తికి సంభవించే ప్రాపంచిక ఆపదల్లో కనీసం ఒకదాన్నయినా సరే దూరం చేసినట్లయితే, దైవం ఆ వ్యక్తిని ప్రళయదినం నాటి ఆపదల్లో ఒకదాన్నుండి కాపాడతాడు. వస్త్రాలు లేనివారికి వస్త్రాలు సమకూరిస్తే, దైవం పరలోకంలో అతనికి ఆచ్ఛాదన కలుగజేస్తాడు. సాటి మానవుల కష్టాలు తీర్చడంలో, వారికి సాయం చెయ్యడంలో ఎవరైతే నిమగ్నమై ఉంటారో, అలాంటి వారి కష్టాలు తీర్చడంలో వారికి సాయం చేయడంలో దైవం లీనమై ఉంటాడు. జ్ఞానసముపార్జన కోసం, దాన్ని సర్వసామాన్యం చెయ్యడంకోసం కృషి చేస్తున్నవారికి దైవం స్వర్గమార్గాన్ని సుగమం చేస్తాడు. ఎవరైతే దైవగృహాల్లో సమావేశమై దైవగ్రంథాన్ని పారాయణం చేస్తారో, దాన్ని ఇతరులకు ఉపదేశిస్తారో, అలాంటి వారి హృదయాలకు దైవం శాంతి, సాంత్వన కలుగజేస్తాడు.
 
 ఆకలి, అజ్ఞానం, పేదరికం, దోపిడీ, పీడన, అసమానత, అమానవీయతల్లేని సమసమాజ నిర్మాణానికి మనమీనాడు ముహమ్మద్ ప్రవక్త (స) వారి ఈ బోధనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈనాటి మన మానవ సమాజంలో కనిపిస్తున్న అన్ని లోపాలకూ, అవలక్షణాలకూ, రుగ్మతలకూ ఈ బోధనల్లో పరిపూర్ణ పరిష్కారం ఉంది. ప్రవక్త ప్రవచించినట్లు, సాటివారి కష్టాలను దూరం చెయ్యడం, వారి బాధల్లో పాలు పంచుకోవడం, అన్న వస్త్రాలు, గృహవసతి లాంటి ప్రాథమిక అవసరాలు తీర్చడంతోపాటు, పీడన, వివక్ష, అసమానతలు లేని సమాజం ఆవిష్కృతమైతే ఇంకా అంతకంటే కావలసినదేముంటుంది?
 
 కాని మానవుల్లో స్వార్థం ఉన్నంతకాలం సాటివారి పట్ల సానుభూతి, ప్రేమ జనించనంతకాలం ఇది అసాధ్యం. మానవుల్లో ఈ సుగుణాలు జనించాలంటే దైవంపై అచంచల విశ్వాసం ఉండాలి. ఆయన తన ప్రవక్త ద్వారా మానవులకు అందజేసిన హితోపదేశాలను హృదయపూర్వకంగా ఆచరించకపోతే, దైవానికి సంజాయిషీ చెప్పుకోవలసి ఉంటుందన్న భయం ఉండాలి. ఆయన ఆదేశాలను పాటించకపోతే శిక్షిస్తాడన్న భీతితోపాటు, చిత్తశుద్ధితో ఆచరిస్తే అనంతంగా సంతోషించి చక్కటి ప్రతిఫలం ప్రసాదిస్తాడన్న ఆశ ఉండాలి.
 
 ఈ విధంగా దైవభీతి, పరలోక చింతన కలిగి, నైతిక, ఆధ్యాత్మిక పరివర్తనతో జీవితం గడిపితే నిజంగానే మానవ సమాజం శాంతి సౌభాగ్యాలతో, సుభిక్షంగా వర్థిల్లుతుంది. కాబట్టి ప్రవక్త మహనీయుని హితోపదేశాలను పాటిస్తూ, ఆకలి, దారిద్య్రం, అసమానతల్లేని ఓ సుందర సత్సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం.
 
 - యండి ఉస్మాన్‌ఖాన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement