వినయాన్ని నేర్చుకోవడానికి సిలబస్ ఉంటుందా!
విద్య - విలువలు
గురువు తాను తెలుకున్న విషయాలను తన విద్యార్థులకు, తన శిష్యులకు అర్థమయ్యేటట్టు బోధించడానికి ఎంతో కిందకు దిగివచ్చి తేలికైన ఉపమానాలతో వివరిస్తాడు. అవతలివాడికి అర్థం కావాలని, వాడూ తనతో సమాన స్థాయికి ఎదగాలని ఏ విధమైన స్వార్థమూ లేకుండా బోధిస్తాడు. అలా చేయడం త్యాగం. అందుకే గురువు బోధనలను వర్షపుధారలతో పోలుస్తారు. ఈ విత్తనం మొలకెత్తాలి, ఇది మొలకెత్తకూడదన్న వివక్ష వర్షపుధారకు ఉండదు. అది అన్నింటిపైనా సమానంగా కురుస్తుంది. కొన్ని మొలకెత్తుతాయి, కొన్ని మొలకెత్తవు.
రాతినేల మీద ఉన్న విత్తనం మొలకెత్తే అవకాశం ఉండదు. మట్టిలో ఉన్న విత్తనానికి తడి తగిలితే చాలు, మొలకెత్త్తేస్తుందంతే. అలాగే శిష్యుడిలో కూడా ఆర్ద్రత అనేది ఉండాలి. తడి తగలాలి. అంటే గురువుగారి నోటి వెంట వచ్చిన మాటలను ప్రయోజనాత్మకంగా మలచుకోగలిగిన శక్తి శిష్యుడిలో ఉండాలి. అది లేనప్పుడు రాతినేల మీది విత్తనంలాగా నిష్ప్రయోజనం అవుతుంది.
ఇలా మొలకెత్తడానికీ, మొలకెత్తకపోవడానికీ మధ్యలో వచ్చిన సమస్య ఏమిటి? అని అంటే... వినయం లేకుండుట అని చెప్పాలి. ఎప్పుడు గురువుగారి దగ్గరకు వెళ్లినా, అది పాఠశాల, కళాశాల, వేదాధ్యయనం... ఏదైనా కావచ్చు. ఎక్కడైనా కావచ్చు.
మొట్టమొదట జ్ఞాపకం చేసుకోవలసింది...‘గురువు ముందు నేను లఘువును’ అని. అంటే ‘ఆయన కంటే నేను చిన్నవాడిని, ఆయన అన్నీ తెలిసున్నవాడు, సర్వజ్ఞుడు, ఆయన మాట్లాడతాడు, నేను వింటాను’ అన్న స్పృహ. అంతే తప్ప గురువుగారి దగ్గరకు వెళ్లి తాను అవసరానికి మించి మాట్లాడటం గానీ, ఆయన విజ్ఞానం ఏ పాటిదని అర్థం వచ్చేటట్లుగా ఆయనను తేలిక చేస్తూ ప్రవర్తించడం గానీ ఎన్నడూ పనికిరాదు.
గురువు ఎంత రాగద్వేషాలు లేకుండా, ఎంత పక్షపాత రహితుడై ఉంటాడంటే విజ్ఞానాన్ని అందించడంలో తరతమ భేదాలు పాటించడు. ద్రోణాచార్యులవారు గురుకులాన్ని నిర్వహిస్తున్న కాలంలో... ద్రోణాచార్యుడిని సంహరించగలిగిన కొడుకు కావాలని ద్రుపదుడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ వాటికలోంచి పుట్టాడు ధృష్టద్యుమ్నుడు. ఆయనకు విలువిద్య నేర్పించవలసి వచ్చింది.
గురువుగా తన స్థానానికి ఏ పక్షపాతం లేకుండా చూడడం కోసం తనని చంపడమే లక్ష్యంగా పెట్టుకుని శిష్యుడిగా వచ్చినవాడికి విద్యనంతటినీ ద్రోణాచార్యుడు బోధించాడు. తన సొంత కొడుకైన అశ్వత్థామకు కూడా నేర్పని బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని, ఉపసంహారాన్ని ఆయన అర్జునుడికి నేర్పించాడు.
ఒకప్పుడు ప్రపంచం మొత్తంమీద విద్యాభ్యాసానికి ఆలవాలమైన భూమి ఒక్క భారతదేశం మాత్రమే. పతంజలి దగ్గర వ్యాకరణ భాష్యం నేర్చుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు నర్మదా నదిని దాటి దక్షిణదేశానికొచ్చి ఆయన దగ్గర ఉండి ఆరోగ్య సూత్రాలు, బ్రహ్మసూత్రాలు నేర్చుకున్నారని పతంజలి చరిత్ర చదివితే తెలుస్తుంది. అలా చదువుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మొట్టమొదటగా గురుశిష్యుల మధ్య ఉండాల్సినది వినీత-వినీయ సంబంధమే. గురువు దగ్గర మొదట వినయం నేర్చుకుంటాడు. వినయం నేర్చుకోవడానికి సిలబస్ అంటూ ఏదీ ఉండదు.
పాఠ్యాంశాలుండవు. వినయంగా ఉండాలనుకుంటేనో, అహంకారంతో ఉండకూడదకుంటేనో వినయం రాదు. వినయం రావడానికి ఒకే ఒక్క కారణం ఉంటుంది. ఎన్ని తెలిసి ఉన్నవాడైనా ‘నాకు తెలిసినది ఏపాటి?’ అన్న మనస్తత్త్వం ఉన్నప్పుడు వాడంత వినయశీలి లోకంలో మరొకడుండడు. వాడు నిరంతర విద్యార్థి. నాకు తెలియనిది ఏముంది? అన్నాడనుకోండి. అంతే. ఇక పాత్రత ఉండదు.
అహంకారం విస్తృతంగా పైకి లేచిపోతుంది. దాన్ని తొక్కేయడమే వినయానికి పాత్రత.
‘నాకు తెలిసినదేపాటి!’ అని మనస్సాక్షిగా ప్రకటించడం అంత తేలికైన విషయమేమీ కాదు. ‘నేను తప్ప రామాయణం మీద ఇంత బాగా ఎవరు ప్రవచనం చేయగలరు’ అన్నాననుకోండి! మరుక్షణంలో నాలో అహంకారం ప్రబలుతుంది. శ్రీరామాయణంలో ఒక శ్లోకంలోని ఒక పాదంలో ఉన్న ఒక పదానికి వ్యాఖ్యానం చేస్తూ, దర్శనం చేస్తూ తరించిపోయిన మహాపురుషులున్నారు. ‘శ్రీరామ’ అని మూడుసార్లు అనవలసిన అవసరమేముంది.
ఒక్కసారి చాలు’ అని సిద్ధాంతీకరించినవారున్నారు. అలాంటి వారి ముందు నాకు తెలిసున్నదేపాటి. 24 వేల శ్లోకాలు నాకేం కంఠగతం కావు. ఎంత పెద్ద భారతం, తెలుగు, సంస్కృతాలలో ఎన్ని భారతాలు, ఎన్ని పద్యాలు, ఎన్ని వ్యాఖ్యానాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వాటికి భాష్యాలు, నాలుగు వేదాలు... ఇవన్నీ చదువుకోవడానికి నా జీవితకాలం ఎక్కడ సరిపోతుంది! నాకేం తెలుసని అహంకరించను! అన్నీ తెలిసినవాళ్లు మేం ఎంతటివాళ్లం అని నిలబడ్డారు. శంకరభగవత్పాదుల కన్నా జ్ఞాని ఎవరూ లేరు. అన్నీ తెలిసున్నా, ఆయన ‘ఈశ్వరా! నేను పశువును.
నీవు పశుపతివి. చాలదా మనకు ఈ సంబంధం’ అన్నారు. అంతటి శంకరులే నాకేం తెలుసని అంటుంటే... ఏదో తెలిసున్న ఒక చిన్న విషయాన్ని పట్టుకుని, ఏదో సిలబస్ చదువుకుని, పేరు పక్కన మూడు నాలుగు అక్షరాలు వచ్చి చేరగానే నాకన్నా గొప్పవాళ్లు లేరనుకోవడం హాస్యాస్పదమౌతుంది. అందుకే ఎప్పుడూ స్మరించ వలసింది... ‘నాకు తెలిసినది ఎంత కనుక!’
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు