15 తర్వాతే సమగ్ర నోటిఫికేషన్‌! | education department exercise with the teacher recruitment exam | Sakshi
Sakshi News home page

15 తర్వాతే సమగ్ర నోటిఫికేషన్‌!

Published Tue, Aug 29 2023 4:34 AM | Last Updated on Tue, Aug 29 2023 4:34 AM

education department exercise with the teacher recruitment exam - Sakshi

ప్రశ్నపత్రాల కూర్పు ఎవరికి? 
టీఆర్టీ పరీక్ష నిర్వహణ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌కు ఇవ్వడమా? ఎస్‌సీఈఆర్టీకి ఇవ్వడమా? అనే అంశంపై అధికారులు చర్చించారు. ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహిస్తే పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ పరిధిలోకి తెచ్చే వీలుందని, ఆఫ్‌లైన్‌ విధానమైతే ఎస్‌సీఈఆర్టీకి అప్పగించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మొత్తం మీద ఎస్‌సీఈఆర్టీకి ఇవ్వడమే సరైన నిర్ణయమని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్టు తెలిసింది.   

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) విధివిధానాల రూపకల్పనపై ముమ్మర కసరత్తు జరుగుతోంది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సమక్షంలో ఉన్నతాధికారులు సోమవారం ఈ అంశంపై చర్చించారు. ఒకటీ రెండు రోజుల్లో వీటిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే వీలుంది. ప్రతి జిల్లాలోనూ డిపార్ట్‌మెంట్‌ సెలక్షన్‌ కమిటీ (డీఎస్సీ) ఏర్పాటు, వాటికి ఇవ్వాల్సిన అధికారాలపై అధికారులు చర్చించినప్పటికీ ఇంకా 

స్పష్టత రాలేదని తెలిసింది. టీఆర్టీని రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో డీఎస్సీలకు పరిమిత అధికారాలు మాత్రమే ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమన్వయం దెబ్బతినకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి పెట్టారు. మరోవైపు పరీక్ష నిర్వహణ ప్రక్రియ మొత్తం రాష్ట్రస్థాయిలోనే కేంద్రీకృత వ్యవస్థలో నిర్వహించే అంశాన్నీ పరిశీలిస్తున్నారు.

అవసరమైతే రాష్ట్రస్థాయి పరీక్ష నిర్వహణకు ప్రత్యేక సమన్వయ కర్తలను నియమించాలని భావిస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో టీఆర్టీ పరీక్షకు చట్టపరమైన అడ్డంకులు తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం సూచించింది. దీంతో విధివిధానాల తయారీలో న్యాయ కోవిదుల సలహాలు కూడా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పరీక్షకు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్‌ సెపె్టంబర్‌ 15 తర్వాతే వెలువడే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి.  

ఆన్‌లైనా? ఆఫ్‌లైనా? 
     పరీక్ష నిర్వహణ మొదలుకొని, నియామక ప్రక్రియ వరకూ ఎవరి బాధ్యత ఏమిటనే దానిపై తొలుత వెలువడే ప్రభుత్వ జీవోలోనే స్పష్టత ఇవ్వాలని వాకాటి కరుణ అధికారులకు సూచించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పరీక్షల్లో ఏది ప్రయోజనం అనే అంశాన్నీ చర్చించారు. ఆన్‌లైన్‌ విధానంలో కొన్ని సమస్యలు వచ్చే వీలుందని అధికారులు భావిస్తున్నారు.

టీఆర్టీ పరీక్ష భాషా పండితులకు, సబ్జెక్టు టీచర్లకు, ఎస్టీజీటీలకు విడివిడిగా నిర్వహిస్తారు. టీఆర్టీకి దరఖాస్తు చేసే వారి సంఖ్య దాదాపు 4 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆన్‌లైన్‌ పరీక్ష విధానంలో ప్రశ్నపత్రం కూర్పు సమస్యలకు తావిస్తుందనే సందేహాలున్నాయి.

ఒకేరోజు 4 లక్షల మందికి కంప్యూటర్‌ బేస్డ్‌గా పరీక్ష నిర్వహణ కష్టమని.ఒక్కో జిల్లాకు రెండు సెషన్స్‌ పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు. అదే ఆఫ్‌లైన్‌లో అయితే రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు పరీక్ష నిర్వహించవచ్చని భావిస్తున్నారు. అయితే దీనివల్ల ఫలితాల ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.  

పోస్టులు, వెయిటేజీపై ఇంకా అస్పష్టత 
    సమగ్ర నోటిఫికేషన్‌ సెప్టెంబర్ 15 తర్వాతే వెలువడే వీలుందని అధికారులు అంటున్నారు. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయి? సబ్జెక్టుల వారీగా ఎన్ని ఉన్నాయి? రిజర్వేషన్ల వారీగా పోస్టుల విభజన, బ్యాక్‌లాగ్‌ పోస్టుల సంఖ్యపై ముందుగా స్పష్టత రావాల్సి ఉంటుంది. దీంతో పాటు ఎస్జీటీలకు, ఎస్‌ఏలకు ఉండే అర్హతలపైనా అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. మరోవైపు టెట్‌ అర్హులకు ఇవ్వాల్సిన వెయిటేజీ పైనా చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమగ్ర నోటిఫికేషన్‌ వెలువడేందుకు మరికొంత సమయం పట్టే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement