నైతిక విలువలు పతనమయిన జీవితాన్ని గడపడం... అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అవుతుంది. దానికి మూడవది కొనసాగింపుగా మనసు కూడా తోడయితే... దానిని దంభం అంటారు. అంటే మనసులో ఒకటి అనుకుంటాడు. పైకి ఒకటి మాట్లాడతాడు, చేసేది మరొకటి అయి ఉంటుంది. అంటే ఈ మూడూ ఒక సరళరేఖలో ఉండవు. అలా లేకుండా ఉండడమే నైతిక భ్రష్టత్వం.
ఏ పని చేయకుండా సంపద కలిగి ఉండడం ప్రమాదం. మనిషి సంపదను ΄పొంది ఉండడంలో తప్పు లేదు. అనువంశికంగా, పిత్రార్జితంగా పెద్దలనుండి వచ్చిన ఆస్తి కలిగి ఉండడం అంతకన్నా దోషం కాదు. కానీ వాళ్ళు ఈ సంపదను సమకూర్చడానికి ఎంత కష్టపడ్డారో, ఎంత చెమట చిందించారో అర్థం అయితే తప్ప ఆ డబ్బు ఖర్చుపెట్టడానికి యోగ్యత ΄పొందలేడు. కారణం.. డబ్బు సంపాదించేటప్పడు మనిషి పడే కష్టం అనుభవాన్ని ఇస్తుంది. అది డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టనీయదు. చెమటకు ఉన్న శ్వాస ఏమిటో అర్థం అవుతుంది. అప్పుడు వ్యసనాలకు వశులు కారు. కష్టపడి సంపాదించుకున్న ద్రవ్యం క్రమశిక్షణను నేర్పుతుంది.
నీతి శాస్త్రం ఏమంటుందంటే... మనిషి ఎంత సంపాదించాడనే దానికంటే ఏ మార్గంలో సంపాదించాడన్నది ప్రధానం. ఎంత ఖర్చు పెట్టావు అనేదానికన్నా ఏ ప్రయోజనానికి ఖర్చుపెట్టావన్నది అత్యంత ప్రధానం. ప్రతివారికి ద్రవ్యసముపార్జనలోని కష్టం తెలియాలి... అంటుంది
రఘువంశం కావ్యంలో... పట్టాభిషిక్తుడైన ప్రతి రాజు కూడా వంశపారంపర్యంగా రాజ్యం అందినా... జీవితంలో ఒకసారి దండయాత్రకు వెడతాడు. రాజులందర్నీ గెలిచి వస్తాడు. ఎందుకు... అంటే తనకు పూర్వం ఉన్న రాజులు దండయాత్రలు చేయడానికి, రాజుల్ని గెలవడానికి, చక్రవర్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఎంత కష్టపడ్డారో, ఎలా కోశాగారాన్ని నింపగలిగారో, ఎలా మంచిపనులు చేసి కీర్తిమంతులు కాగలిగారో తెలియాలంటే వారు కూడా కష్టపడాలి.. అందుకే ఆ దండయాత్రలు.
ఒక వ్యక్తి జీవితంలో ఎంతో కష్టపడి సంపాదిస్తే, ఆ ద్రవ్యం ఎంత మంది ఉద్ధరణకో ఉపయోగిస్తాడు తప్ప నిష్కారణంగా దాచుకుందామన్న ఆలోచనను రానీయడు. నీరు, విద్య, ద్రవ్యం నిలబడి ఉండకూడదు. ప్రవహిస్తూ ఉండాలి. అప్పుడే వాటి ప్రయోజనం సిద్ధిస్తుంది. కష్టపడి సంపాదించడంలో గౌరవం ఉంది. అది ఎంతయినా కావచ్చు. అసలు సంపాదించినది ఏదీ లేక΄ోవచ్చు. అందువల్ల నీతిబద్ధంగా శ్రమించడం ప్రతి వ్యక్తికీ ప్రధానం.
గురువాణి: శ్రమకు నమస్కారం
Published Mon, Feb 20 2023 12:31 AM | Last Updated on Mon, Feb 20 2023 12:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment