అదొక విచిత్ర బంధం! పట్టు విడుపులు ఉంటేనే.. | Brahmasri Chaganti Koteswara Rao About How To Overcome Greediness | Sakshi
Sakshi News home page

అదొక విచిత్ర బంధం! పట్టు విడుపులు ఉంటేనే..

Published Mon, Dec 12 2022 11:35 AM | Last Updated on Mon, Dec 12 2022 12:02 PM

Brahmasri Chaganti Koteswara Rao About How To Overcome Greediness - Sakshi

లోకంలో ఒక బంధనం ఉన్నది. బంధం అంటే కట్టేయడం. ఒక తాడేసి కాళ్లూచేతులూ కట్టేసామనుకోండి. కదలలేం కదా! కాళ్ళువిరిగిపోయిన వాడో, నడవలేనివాడో ఎలా కూర్చుండిపోతారో అలా బంధనం పడిన వాడు కదలలేక ఒక చోటే ఉండిపోతాడు. కానీ లోకంలో మరో ఆశ్చర్యకర బంధనం కూడా ఉన్నది. ఏమిటది? ఆశానామ మనుష్యాణాం /కాచిదాశ్చర్య శృంఖలా/యయాబద్ధా ప్రధావన్తి/ముక్తాస్తిష్ఠ పంగువత్‌... అన్నది హితవాక్కు. 

ఆశ అనే బంధం, దానిచేత కట్టబడినవాడు పరుగులు తీస్తుంటాడు. కట్టినప్పుడు కదలికలు ఆగిపోవాలి కానీ, ఈ బంధం పడినప్పుడు పరుగులు తీస్తుంటాడు. కట్టు విప్పినప్పుడు స్వేచ్ఛగా పరుగెత్తాలి. కానీ ఆశాబంధాన్ని విప్పదీస్తే వాడు హాయిగా కూర్చుండిపోతాడు. పరమ ప్రశాంతంగా నిశ్చల చిత్తంతో ఉండిపోతాడు. ఇదొక విచిత్ర బంధం.

ఆశకు అంతేమిటి! ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలని ఆరాటపడడం. లోకంలో సర్వం స్వంతమయినా, ఎంత గొప్పగా అన్నీ పొందినా... ఇంకా ఏదో కావాలని మరేదో పొందాలన్న కోరిక స్థిరంగా ఉండనీయదు. అందుకే ఆ పరుగులు. అయితే ఆశ లేకుండా ఉండడం సాధ్యం కాదు. మంచిదీ కాదు. ఒక స్థితిలో మనిషికి ఆశ ఉండాలి. నేను బాగా చదువుకోవాలి, ఒకరి దగ్గర చేయి చాచకుండా బతకాలి, ధార్మికంగా బతకాలి, ఎన్నో పుణ్యకార్యాలు చేయాలి... ఈ ఆశలన్నీ మనిషికి ఉండొచ్చు.

అయితే ఆశ కలిగినప్పుడు చేయవలసినది. దాని పరిశీలన. దేన్ని పరిశీలించాలి.. అలా ఆశపడిన దానిని సాధించుకోవడానికి మనకున్న సమర్ధతను పరిశీలించకుండా ప్రతిదానికోసం ఆశపడడం, వెంపర్లాడడం, తన సమర్థత సరిపోక నిరాశా నిస్పృహలు పొందుతూ ఉండడం మంచిది కాదు. తన సమర్థతను పరిశీలించుకోవడానికి తనకన్నా యోగ్యుడు మరొకడుండడు.

పరిశీలించడం రాకపోతే... మంట దగ్గరకు వెళ్ళి...నెయ్యి ఏదో, నీరేదో తెలుసుకోలేక ఒకదానికి బదులు మరొకటి వేస్తే భగ్గున మండుతుంటుంది. కాబట్టి ఆ విచక్షణ అవసరం. వివేకంతో కూడిన సమర్థత ఎంత ముఖ్యమో ప్రయత్నం కూడా అంతే ముఖ్యం. ఆశ ఉంది, సమర్థత ఉంది.. కానీ ప్రయత్నం లేకపోతే వృథా.

తాను ఒక స్థితికి చేరిపోయిన తరువాత తాను ప్రశాంతంగా ఉండాలి. దానిని రాగద్వేషాలు పాడు చేస్తాయి. రాగము అంటే.. కోరిక, అది తీరకపోతే అశాంతి. తీరినా అశాంతే. ఎందుకంటే మళ్ళీమళ్ళీ కావాలని పెట్టే పరుగుల వల్ల. రాగద్వేషాలు లేనివాడిలో కదలికలుండవు, పరుగులుండవు, ఒక వయసులో, ఒక స్థితిలో, వృద్ధాప్యంలో.. అంటే

జీవన పరిపూర్ణత్వానికి ఈ రెండోకోణం పరిశీలన అవసరం. ఈ స్థితికి రావాలంటే.. పట్టువిడుపులు తెలియాలి. ఇది తెలిస్తే, అలవాటయితే ఎప్పుడు ఏది పొందాలో అది పొందుతారు. పూవు కావాలనుకుంటే పూవు అవుతారు, పిందె కావాలనుకుంటే పిందెవుతారు. కాయవుతారు, పండవుతారు, బాగా పండిపోయి రంగు మారి చెట్టునుండి వదిలిపెట్టేస్తారు. వారంతటవారుగా విడిపోతారు.

కాబట్టి మనందరం ఎప్పుడు పరుగెత్తాలో అప్పుడు పరిగెత్తాలి. దాన్ని విశ్లేషించుకొంటూ, ప్రయత్నించుకొంటూ, సాధించి తృప్తి, భోగం, కీర్తి పొంది ఒకానొక వయసు వచ్చిన తరువాత పరిణతి చేత శాంతిని పొంది ఆశాపాశాలనుండి విముక్తిని పొంది జీవనసాఫల్యాన్ని పొందాలి. 
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement