'ప్రవచనం' కాలక్షేపం కోసం కాదు! | - | Sakshi
Sakshi News home page

'ప్రవచనం' కాలక్షేపం కోసం కాదు!

Published Fri, Dec 15 2023 3:02 AM | Last Updated on Fri, Dec 15 2023 10:29 AM

- - Sakshi

సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ

తూర్పుగోదావరి/రాజమహేంద్రవరం: రామకథ యథార్థ తత్త్వాన్ని తెలియచెప్పడమే లక్ష్యంగా తాను రామాయణాన్ని ప్రవచిస్తున్నానని, కాలక్షేపం కోసం కాదని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ ఉద్ఘాటించారు. రాజమహేంద్రవరంలోని హిందూ సమాజంలో రుషిపీఠం మండల దీక్షగా శ్రీరామ మహాయజ్ఞం నిర్వహిస్తోంది. 42 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగు వేల శ్లోకాల రామాయణ సారాన్ని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ప్రవచించి, రామభక్తులను పులకింపచేస్తున్నారు.

జనవరి 23వ తేదీ వరకు రోజూ సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఈ ప్రవచన మహాయజ్ఞం సాగనుంది. సీతారామలక్ష్మణుల పాదస్పర్శతో పునీతమైన గోదావరీ తీరం రామకథా ప్రవచన, స్మరణాలతో మారు మోగుతోంది. ‘రాజ’మహేంద్రి ‘రామ’మహేంద్రిగా మారింది! ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో సామవేదం ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...

ఉత్తరకాండ అవాల్మీకం కాదు..
లోకంలో ఉత్తరకాండ వాల్మీకి మహర్షి విరచితం కాదనే మాట గట్టిగానే వినపడుతోంది. యుద్ధకాండలో పట్టాభిషేక సర్గలో ఫలశృతి చెప్పాక, తదనంతరం కథ ఉండదని వీరి వాదన. బాలకాండలో మహర్షి స్వయంగా చెప్పారు, షట్కాండలు రచించిన అనంతరం ఉత్తరకాండ రచించినట్లు....‘తచ్చకారోత్తరే కావ్యే వాల్మీకిర్భగవాన్‌ ఋషి’....బాలకాండలో స్పష్టంగా చెప్పారు. రామాయణంలో 24 వేల శ్లోకాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ఉత్తరకాండలోని శ్లోకాలు కలుపుకుంటేనే ఈ సంఖ్య వస్తుంది.

పురాణాదులలో అవతార పురుషుల ఆవిర్భావం చెప్పినట్లు, అవతార పరిసమాప్తి కూడా చెప్పడం సంప్రదాయం. రామావతార పరిసమాప్తి ఉత్తరకాండలో చూస్తాం. రామాయణంలోని కొన్ని సందేహాలకు మనకు ఉత్తరకాండలో సమాధానాలు కనపడతాయి–ఉదాహరణకు సుందరకాండలో హనుమంతుడిని చూసిన రావణుడు వచ్చినవాడు నందీశ్వరుడా అని అనుమానపడతాడు. రావణ, నందీశ్వరుల నడుమ జరిగినది మనకు ఉత్తరకాండలోనే గోచరిస్తుంది. ఉత్తరం అనే మాటకు సమాధానం అని అర్థం చెప్పుకోవచ్చు.

నేటికీ చెదరని రామాయణ ప్రాధాన్యం!
ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని విమర్శలు, దాడులు చేసినా రామాయణం ప్రాచుర్యం, ప్రాధాన్యం కోల్పోదు. త్రేతాయుగమైనా, కలియుగమైనా, ఏ యుగమైనా మానవధర్మం శాశ్వతమైనది. రాగద్వేషాలు, మానవ సంబంధాలు మారవు. మన స్వభావాలను తీర్చి దిద్దేది రామాయణం. ఈ భూమిపై చెట్లు, పర్వతాలు, నీరు ఉన్నంత కాలం రామాయణం ప్రచలితం కాక మానదు. ఇది బ్రహ్మవాక్కు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement