వినయం పురుష లక్షణం... | Male characteristic modesty ... | Sakshi
Sakshi News home page

వినయం పురుష లక్షణం...

Published Sun, Feb 21 2016 11:01 PM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM

వినయం పురుష లక్షణం...

వినయం పురుష లక్షణం...

నేడు బీ హంబుల్ డే  /  Be humble day
తనను తాను తగ్గించుకునెడివాడు హెచ్చించబడును. - బైబిల్.

‘గాడ్!’ ‘చెప్పు మానవా’.‘మేము నీకు ఈక్వల్ అయిపోయాం. నువ్వు సృష్టించేదంతా మేమూ సృష్టిస్తున్నాం. కావాలంటే ప్రాణం పోయగలం. తీయగలం. ఏమిటి నీ గొప్ప. ఇప్పటికప్పుడు ఒక మనిషిని సృష్టించి చూపించనా?’‘చూపించు నాయనా’. మట్టి అందుకుంటూ ఉండగా దేవుడు వారించాడు. ‘మానవా!’ ‘ఏమిటి గాడ్?’ ‘చిన్న షరతు. ఆ మట్టి కూడా నువ్వు సృష్టించిందే అయి ఉండాలి.’ మానవుడు లేడు. పారిపోయాడు.

అహంకారానికి ఆమోదం లేదు. ప్రకృతిలో అహంకారం అనే మాట లేదు. ఒక చిన్నపాటి ఉలికిపాటు తెచ్చుకుంటే, కూచున్న చోటు నుంచి కొద్దిగా లేచి నిలబడితే, నా శక్తి చూపించనా అని మహా సముద్రాలు కాసింత జూలు విదిలిస్తే ఎవరూ మిగలరు. కాని అవి ఎప్పుడూ ఒడ్డు దగ్గర అలా అల్లిబిల్లి ఆడుతూ వినయంగా ఉంటాయి. ఎప్పుడైనా కాసింత జ్వరం వస్తే కలవరం పెట్టి తిరిగి స్వస్థత పొందుతాయి. సునామీ కేవలం కాలి కొనగోటు. సముద్రుడి నిజ విశ్వరూపం మనం చూడలేదు. చూశాక మిగిలే అవకాశం లేదు. ఇప్పుడు చూస్తున్నది కేవలం వినయం. వినమ్రత. ఒదిగి ఉండే సుగుణం. భూమికి అహంకారం లేదు. నేను మోస్తున్నాను గనక మీరు బతుకుతున్నారు... నా ప్రతాపం చూపించనా అని ఎప్పుడూ తాండవం ఆడలేదు. ఆడాక మనం ఉండే అవకాశం లేదు. భూకంపాలు, భూకదలికలు... కేవలం కాలిలో ముల్లు గుచ్చుకుంటే వచ్చే ‘ఇస్స్’ అనే మూలుగు. దానికే కకావికలం అయిపోయాం. పటాపంచలుగా చెదిరిపోయాం. భూదేవిది చాలా నిశ్శబ్దమైన వినయం. తిరిగే చప్పుడే మన దాకా రానివ్వదు. ప్రగల్భాలు పలికే ఓ మనిషీ... ఏం చూసుకొని నీ ప్రగల్భాలు.
 నింగి ఎంత వినయపూర్వకమైనదో చూడండి. అది ఏనాడూ విరిగి నెత్తిన పడలేదు. గ్రహశకలాలు రంకెలు వేయవు గమనించండి... ఒక్కటి కూడా వచ్చి మనల్ని తాకవు. సూర్యుడు ఒక గజం కిందకు దిగడు. చందమామ తన ఫిలమెంట్ సైజ్ పెంచుకోడు. సింహం జూలు రెండు జానలే. ఏనుగుకు రెండు దంతాలకు మించవు. అంత పెద్ద చెట్టూ చెద పడితే కూలాల్సిందే. ఎంతో పెద్ద తిమింగలం ఒడ్డున పడితే చావాల్సిందే.

అహంకారానికి ప్రకృతిలో తావు లేదు.
అది మనిషి పెంచుకున్న తోక.
కత్తిరించుకున్నవాడే జ్ఞాని.

ఈ సృష్టిని మోస్తున్న విష్ణువును నేనే మోస్తున్నాను కదా అని అహంకరించాడు గరుత్మంతుడు. ఏమైంది? మోస్తూనే ఉన్నాడు. మోయడం అనేది అతడికి చిక్కిన అపురూపమైన అవకాశం. విష్ణుమూర్తి దయదలుపు. ఉన్నది ఎలా వచ్చింది అని తెలుసుకుంటే వినయం. లేకుంటే అహంకారం. ముల్లోకాలు చుట్టిరావడమే కదా... ఎంతసేపు అనుకున్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. నెమలి ఎక్కి పరుగులిడితే చుట్టి రాగలిగిన పాటివా ముల్లోకాలు? యుగాలు గడిచిపోతాయి. ఆ సంగతి తెలిసినవాడే కనుక విఘ్నేశ్వరుడు వినయంగా తల్లిదండ్రుల ప్రదక్షణను ముమ్మార్లు పూర్తి చేశాడు. కారణాలు ఏవైనా కావచ్చు... పాత అనుభవాలు ఎలాగైనా ఉండొచ్చు... ఇంతిస్తాను అంతిస్తాను అనాలిగాని సూదిమొన మోపినంత స్థలం కూడా ఇవ్వను అని అనకూడదు. అది దుర్యోధనుడి అహంకారం. దానికి కురువంశ వినాశనమే జవాబైంది. ‘రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం’ అని అహంకరించాడు తెల్లవాడు. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలకు కాస్త అటు ఇటుగా ఉండేపాటి స్థలంలో పరిమితమయ్యాడు.రాజు దైవాంశ సంభూతుడు అనుకున్న ఏ రాజూ మిగల్లేదు. అంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన చెంగిజ్ ఖాన్ మరి కొన్నాళ్లు బతికే మార్గముందా అని ఎవరి కాళ్లు పట్టుకున్నా మృత్యువు కరుణించలేదు. అహంకారం శిథిలం అవుతూనే ఉంటుంది. వినయం పదే పదే  మొలక వేస్తూ ఉంటుంది.

ప్రకృతి దగ్గర ఒక చాకు ఉంటుంది.తల ఎగరేసినవాడి శిరోముండనం చేస్తుంటుంది. విర్రవీగడం దానికి నచ్చదు. ఉదాహరణలను చూపి నలుగురినీ హెచ్చరిస్తుంటుంది. అంతపెద్ద సంగీతకారుడు, సంగీత బ్రహ్మ ఏ సంగీతాన్నయితే తాను సృష్టించాడో ఆ సంగీతాన్ని వినే వీలు లేక ‘బితొవెన్’కు ప్రకృతి బ్రహ్మ చెవుడు ప్రసాదించింది. అతిలోక సౌందర్యవతి ఆంజలీనా జూలీ రెండు వక్షోజాలను తొలగించే పరిస్థితి అది ఎందుకు తెచ్చినట్టు? బంగారు ప్రాసాదంలో నిదురించినవాడు, సద్దాం హుసేన్, ఒక కలుగులో చిక్కాడు. సుమున్నతంగా నిలిచాయనుకుంటున్న రెండు అహంకార ప్రాకారాలను రెండు విమానాలు క్షణంలో బూడిద చేశాయి. వినయంతో ఉన్న వాళ్లు అడవుల్లో కందమూలాలైతేనేమి భుజించి సంతోషంగానే ఉన్నారు. అహంకారం కలిగిన వాళ్లు సైన్యాలు పెంచుకుంటూ స్థావరాలు పెంచుకుంటూ ఆయుధాలు పెంచుకుంటూ అణుపరీక్షలు చేసుకుంటూ అశాంతితో ఆగమవుతున్నారు.

ఇది తల్లిదండ్రుల దయ. చదువు ఇచ్చిన గురుదేవుల దయ. ఇది పెద్దవారి ఆశీస్సుల దయ. ఇదంతా ఆ పైవాడి దయ అనుకుని అనుక్షణం వినమ్రంగా ఉన్నవారే విజేతలు అయ్యారు. విజయాన్ని నిలబెట్టుకున్నారు. కొనసాగించగలిగారు. లేనివాళ్లంతా పడ్డారు.పడ్డవాళ్లు చెడ్డవాళ్లు కాకపోవచ్చు.కాని- అహంకారం ఉన్నవాళ్లంతా పడ్డవాళ్లే.

నాకు తెలియనిదంతా నా అజ్ఞానమే అని చెప్పుకున్నాడు సోక్రటీసు. అంతే తప్ప నాకు అంతా తెలుసు అనలేదు. అంత సృజన, పాండిత్యమూ ఉండి కూడా పోతన ‘పలికెడిది భాగవతంబట... పలికించెడువాడు రామభద్రుండట’ అని ఆ క్రెడిట్‌ని రాముడికే ఇచ్చేశాడు. ‘నా గొప్పతనం ఏమీ లేదు... నేను ఎంచుకున్న సత్యమార్గం గొప్పదనమే ఇదంతా’ అన్నాడు మహాత్ముడు. ఈ విజయం ప్రజలది అన్న నాయకుడు నిలిచాడు. నాది అన్నవాడు పోయాడు. పోతాడు.

మరి అన్నివేళలా వినయమేనా? అహంకారం వద్దా? ఉండాలి. అసామాన్యమైన విజయం సాధించాలంటే అహంకారం ఉండాలి. ఓ ఎవరెస్ట్... నీ శిఖరాన్ని నా పాదంతో ముద్దాడుతాను ఉండు... అన్నచోట అహంకారం ఉండాలి. ఓ మహమ్మారి... నీ పీకకు నా టీకాను చుడతాను ఉండు... అన్నచోట అహంకారం ఉండాలి... ఓ పేదరికమా నిన్ను తరిమికొట్టడంలో నేను విశ్రమించను చూడు అన్నచోట అహంకారం ఉండాలి... ఓ హింసా భూతమా నిన్ను కూకటివేళ్లతో సహా పెకలిస్తాను అన్న చోట అహంకారం ఉండాలి.
 అంతే తప్ప స్నేహితుల వద్దా సాటి మనుషుల వద్దా అవసరానికి వచ్చినవాళ్ల వద్దా దీనుల వద్దా భిక్షకుల వద్దా అహంకారం చూపితే ప్రకృతి క్షమించదు.దాని కత్తెర మనవైపు దూసుకువస్తుంది. కచక్.  - నెటిజన్ కిశోర్
 
నాకు తెలియనిదంతా నా అజ్ఞానమే అని చెప్పుకున్నాడు సోక్రటీసు. అంతే తప్ప నాకు అంతా తెలుసు అనలేదు. అంత సృజన, పాండిత్యమూ ఉండి కూడా పోతన ‘పలికెడిది భాగవతంబట... పలికించెడువాడు రామభద్రుండట’ అని ఆ క్రెడిట్‌ని రాముడికే ఇచ్చేశాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement