అంతర్జాతీయ మ్యాచ్ ఆడి దశాబ్ద కాలం గడిచిన తర్వాత ఒక ప్లేయర్‌ను క్రీడా ప్రపంచం, అభిమానులు గుర్తుంచుకోవడం దాదాపు అసాధ్యం... ఇక మహిళా క్రికెటర్లకు మన వద్ద దక్కే గుర్తింపును బట్టి చూస్తే ఇంకా కష్టం... స్వయంగా ఆ ప్లేయరే ఆటను మరచిపోయి ఇక తన పని ముగిసినట్లే భావించి అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు... కానీ 10 సంవత్సరాల విరామం తర్వాత కూడా ఒక పెద్ద టోర్నీలో మళ్లీ తెరపైకి రావచ్చని ఒక ప్లేయర్ నిరూపించింది.
ఆమె పేరే గౌహర్ సుల్తానా. హైదరాబాద్‌కు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్. 2014లో భారత్‌కు ఆఖరిసారిగా ప్రాతినిధ్యం వహించిన గౌహర్ ఇప్పుడు 2024 డబ్ల్యూపీఎల్‌లో మళ్లీ కనిపించబోతోంది. వేలంలో యూపీ వారియర్స్ జట్టు సొంతం చేసుకున్న గౌహర్ 36 ఏళ్ల వయసులో తనలో ఇంకా క్రికెట్ మిగిలి ఉందని నిరూపించేందుకు సిద్ధమైంది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తాజా సీజన్‌లో ఆడుతున్న వారిలో 2010కు ముందు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ప్లేయర్లు ఇద్దరే ఉన్నారు. 2009లో హర్మన్‌ప్రీత్ కౌర్ తన తొలి మ్యాచ్ ఆడితే అంతకుముందు ఏడాదే 2008లో గౌహర్ సుల్తానా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. 2008 నుంచి 2014 మధ్యలో గౌహర్ భారత్ తరఫున 50 వన్డేలు, 37 టి20లు ఆడి మొత్తం 95 వికెట్లు పడగొట్టింది.
చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో ఆ సమయంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ ఆరేళ్ల కాలంలో వన్డేల్లో భారత బెస్ట్ బౌలర్‌గా (66 వికెట్లు) కొనసాగింది. రెండు వన్డే ప్రపంచకప్‌లలో ఆడింది కూడా. తన చివరి 2 వన్డేల్లో నాలుగేసి వికెట్లు చొప్పున తీసినా అనూహ్యంగా ఆమెపై సెలక్టర్లు వేటు వేశారు. అప్పుడు గౌహర్ వయసు 26 ఏళ్లు. కారణాలేమిటో తెలియకపోయినా మళ్లీ భార త జట్టు కోసం ఆమె పేరును పరిశీలించనేలేదు.
సైకాలజిస్ట్ సహాయంతో...
‘సాధారణంగా భారత్‌లో మహిళా ప్లేయర్లకు 26–27 ఏళ్లు వస్తే వారిని ఇక వారి వయసు అయిపోయిందని, ఆటకు పనికి రారని భావిస్తారు. ఇక 30 తర్వాత అయితే బరువు పెరుగుతుంది. ఎవరూ పట్టించుకోరు. కానీ నా ఫిట్‌నెస్ విషయంలో రాజీ పడరాదని భావించాను. అందుకే చాలా కష్టపడ్డాను’ అని గౌహర్ చెప్పింది. జాతీయ జట్టుకు దూరమైన తర్వాత ఆమె ఆగిపోలేదు. గత పదేళ్లలో దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్, పుదుచ్చేరి, బెంగాల్, రైల్వేస్ జట్లకు ఆడుతూ వచ్చింది.
అయితే కొత్త అమ్మాయిలతో పోలిస్తే తాను బాగా ఆడలేక వెనుకబడిపోతున్నానని భావించి తనపై తనకే అనుమానం వేసింది. ఇది మానసికంగా ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపించింది. ఇలాంటి స్థితిలో మాజీ క్రికెటర్, భారత అండర్–19 జట్టు కోచ్ నూషీన్ అల్ ఖదీర్ తగిన రీతిలో అండగా నిలిచింది. భారత జట్టులో గౌహర్‌తో కలిసి ఆడిన నూషీన్... సైకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించడంతో పరిస్థితి మెరుగైంది.
పట్టుదలగా నిలిచి...
గౌహర్ తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన రోజులతో పోలిస్తే మహిళా క్రికెట్ ఎంతో మారింది. వేగంలో, వ్యూహాల్లో, ఆదరణలో అంతా మారిపోయింది. అయితే చికిత్స తర్వాత దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా బౌలింగ్ చేస్తుండటంతో గౌహర్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. గత రెండేళ్లలో వరుసగా వికెట్లు పడగొట్టడంలో కూడా సఫలమైంది. దాంతో 2023 డబ్ల్యూపీఎల్ వేలం కోసం తన పేరును నమోదు చేసుకుంది.
కానీ సహజంగానే ఈతరం అమ్మాయిల గురించి ఆలోచించే ఫ్రాంచైజీలు ఆమెను పట్టించుకోలేదు. ఈసారి కూడా సందేహంగానే అనిపించింది. కానీ ఎట్టకేలకు ఆ అవకాశం వచ్చింది. 36 ఏళ్ల వయసులో తాను పోటీ క్రికెట్ ఆడగలనని నమ్మకం వల్లే ఈ పునరాగమనం సాధ్యమైంది.
30 ఏళ్లు దాటిన తర్వాత ఒక సీనియర్ ప్లేయర్ ఎన్నో ప్రతికూలతలను దాటి దేశవాళీ క్రికెట్‌ను నమ్ముకొని ముందుకు సాగడం అసాధారణం. గత పదేళ్లు ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు గౌహర్ వేసే ప్రతీ బంతిపై అందరి దృష్టీ ఉంటుంది. ఈ ఇన్నింగ్స్‌లో ఆమె అదృష్టం ఎలా ఉంటుందనేది ఆసక్తికరం.
- సాక్షి క్రీడా విభాగం
Comments
Please login to add a commentAdd a comment