దౌల్తాబాద్ : ఏడాది వయసున్న కుమారుడిని చంపేసి వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దౌల్తాబాద్ మండలం కుదురుమళ్లలో శనివారం చోటుచేసుకొంది. సీఐ నాగేశ్వర్‌రావు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నీలి శ్రీనివాస్ హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఉన్న ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన మల్లిక (24) పని చేస్తుండేది. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కులాలు వేరైనా వారిద్దరూ 2017 డిసెంబర్‌లో యాదాద్రిలో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో వారికి సాత్విక్ (1) జన్మించాడు. హైదారాబాద్‌లో వారి కాపురం సజావుగా సాగుతోంది.
అయితే మార్చి నెలలో లాక్‌డౌన్ విధించడంతో భార్యాభర్తలు బాబుతో కలిసి కుదురుమళ్లకు వచ్చారు. కుటుంబసభ్యులతో కలిసి జీవిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం భర్త శ్రీనివాస్, అత్తామామ బయటకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా మల్లిక ఫ్యాన్‌కు వేలాడుతుండగా ఏడాది బాబు విగతజీవిగా పడి ఉన్నాడు. ఈ ఘటనతో షాక్‌కు గురైన భర్త శ్రీనివాస్ వెంటనే భార్య మృతదేహాన్ని కిందకు దించాడు. అయితే కుమారుడిని గొంతు నులిమి చంపినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. అయితే శ్రీనివాస్ అంతకుముందే ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకుని ఆమెతో ఆరు నెలలు కాపురం చేసి వదిలేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న సీఐ నాగేశ్వర్‌రావు, ఎస్‌ఐ విశ్వజాన్ సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ నాగేశ్వర్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment