Trincomalee
-
లంకతో ఆరు రక్షణ ఒప్పందాలు
కొలంబో: పొరుగు దేశం శ్రీలంకతో భారత్ ఆరు భారీ రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంది. లంకలోని ట్రింకోమలీని ఇంధన హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు పవర్ గ్రిడ్ కనెక్టివిటీపై కూడా ఒప్పందాలు కుదిరాయి. శనివారం లంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకెతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చల అనంతరం ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. సంపూర్ సౌర విద్యుత్కేంద్రాన్ని నేతలిద్దరూ వర్చువల్‌గా ప్రారంభించారు. భద్రత విషయంలో ఇరుదేశాలు పరస్పరం ఆధారపడి ఉన్నాయని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘దిస్సనాయకె అధ్యక్షునిగా ఎన్నికయ్యాక తొలి విదేశీ పర్యటనకు భారత్‌నే ఎన్నుకున్నారు. ఆయన హయాంలో లంకను సందర్శించిన తొలి విదేశాధినేతను నేనే. ద్వైపాక్షిక బంధానికి ఇరు దేశాలూ ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనం’’ అన్నారు. అనంతరం జరిగిన చర్చల్లో పలు కీలకమైన అంశాలు వారి నడుమ ప్రస్తావనకు వచ్చాయి. లంక జైళ్లలో మగ్గుతున్న భారత మత్స్యకారులను విడిచి పెట్టాల్సిందిగా మోదీ కోరారు. ఈ విషయంలో ఇరు దేశాలూ మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాలన్నారు. ‘‘ఆర్థిక సాయంలో భాగంగా లంకకు ఇచ్చిన రుణాలను పునర్ వ్యవస్థీకరిస్తున్నాం. వాటిపై వడ్డీరేటును మరింత తగ్గిస్తున్నాం. లంకకు ఇచ్చిన 10 కోట్ల డాలర్ల మేరకు రుణాలను గ్రాంట్లుగా మార్చాం. శ్రీలంక ప్రజలకు భారత్ అన్నివిధాలా అండగా నిలుస్తుంది’’ అని పునరుద్ఘాటించారు. లంక తూర్పు ప్రాంతాల ఆర్థికాభివృద్ధి నిమిత్తం 240 కోట్ల శ్రీలంక రూపాయల సాయాన్ని ప్రకటించారు. చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగినట్టు దిస్సనాయకె తెలిపారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు లంక భూభాగాన్ని వాడుకునేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు. శ్రీలంకలోని కీలక నౌకాశ్రయాలు, భూభాగాలను నిఘా తదితర కార్యకలాపాలకు వాడుకునేలా చైనా పథక రచన చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. గుజరాత్లో ఆరావళి ప్రాంతాల్లో 1960లో దొరికిన బుద్ధుని పవిత్ర అవశేషాలను లోతైన పరిశోధనల నిమిత్తం లంకకు పంపుతున్నట్టు మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు. మోదీకి అత్యున్నత పురస్కారం ప్రధాని మోదీ శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం మిత్ర విభూషణను అందుకున్నారు. అధ్యక్షుడు దిస్సనాయకె ఆయనకు స్వయంగా అవార్డును ప్రదానం చేశారు. ద్వైపాక్షిక బంధాన్ని పటిష్టపరచడంలో మోదీ కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. దీన్ని 140 కోట్ల పై చిలుకు భారతీయులకు లభించిన గౌరవంగా ప్రధాని అభివరి్ణంచారు. ఘనస్వాగతం అంతకుముందు రెండు రోజుల థాయ్‌లాండ్ పర్యటన ముగించుకున్న మోదీ శుక్రవారం రాత్రి బ్యాంకాక్ నుంచి కొలంబో చేరుకున్నారు. నగరంలోని చారిత్రక ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద శనివారం ఆయనకు అత్యంత ఘనస్వాగతం లభించింది. అధ్యక్షుడు దిస్సనాయకె స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. ఒక విదేశీ నేతలకు ఈ స్థాయి స్వాగతం లభించడం శ్రీలంక చరిత్రలో ఇదే తొలిసారి.తమిళులకు న్యాయం చేయండి శ్రీలంక తమిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు, వారికి న్యాయం జరిగేలా చూసేందుకు భారత్ ఎప్పుడూ కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. శ్రీలంక పర్యటన సందర్భంగా శనివారం స్థానిక తమిళ నేతలతో సమావేశమయ్యాక ఆయన ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అధ్యక్షుడు దిస్సనాయకెతో చర్చల సందర్భంగా కూడా ఈ అంశాన్ని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘లంక తమిళుల ఆకాంక్షలను గౌరవించండి. హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం రాజ్యాంగంలో పేర్కొన్న హామీలన్నింటినీ నెరవేర్చండి. ప్రొవిన్షియల్ కౌన్సిళ్లకు తక్షణం ఎన్నికలు జరిపించండి’’ అని సూచించారు. అనంతరం మోదీ మీడియాతో మాట్లాడారు. లంక తమిళుల ఆకాంక్షలను దిస్సనాయకె సర్కారు నెరవేరుస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. భారత మూలాలున్న తమిళులకు 10 వేల ఇళ్ల నిర్మాణం త్వరలో పూర్తవుతుందని తెలిపారు. రాజ్యాంగంలో పేర్కొన్న మేరకు తమకు కూడా అధికారంలో భాగస్వామ్యం కావాలని తమిళులు చిరకాలంగా కోరుతున్నారు. -
కార్పొరేట్లకు మద్దతులో ఎస్బీఐ పాత్ర భేష్
కొలంబో: భారత్‌లోనే కాకుండా, అంతర్జాతీయ వాణిజ్యంలోసైతం కార్పొరేట్లకు మద్దతు ఇవ్వడంలో బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అందిస్తున్న సేవలు అద్భుతమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. అంతక్రితం ఆమె శ్రీలంక తూర్పు ఓడరేవు పట్టణం ట్రింకోమలీలో ఎస్బీఐ శాఖను ప్రారంభించారు. తూర్పు ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్, శ్రీలంకలో భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే, ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంకకు విచ్చేసిన సీతారామన్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఎస్బీఐ బ్రాంచ్‌ను ప్రారంభించే ముందు నగరంలో ప్రధాన హిందూ దేవాలయాన్ని సైతం సందర్శించి పూజలు చేశారు. అనంతరం లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ కాంప్లెక్స్‌ను సందర్శించారు. ఎస్బీఐ శాఖ ప్రారంభం అనంతరం ఆమె ఏమన్నారంటే. వాణిజ్యాభివృద్ధిలో ఎస్బీఐ 159 సంవత్సరాల గణనీయమైన ప్రభావాన్ని కలిగిఉంది. ఇది శ్రీలంకలో అత్యంత పురాతనమైన బ్యాంక్. స్వదేశంతో పాటు విదేశాల్లో తన కార్యకలాపాలను విస్తృతం చేస్తోంది. ఆర్థిక సంక్షోభం సమయంలో శ్రీలంకకు భారత్ 1 బిలియన్ అమెరికా డాలర్ల విలువైన క్రెడిట్ లైన్‌ను సజావుగా కొనసాగించడానికి ఎస్బీఐ మార్గం సుగమం చేసింది. శ్రీలంకలోని బ్రాంచ్ కార్యకలాపాలతో పాటు, ఎస్బీఐ శ్రీలంక యోనో యాప్, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా బలమైన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ఎస్బీఐ నిర్వహిస్తోంది. తద్వారా డిజిటల్ చెల్లింపుల పురోగతికి దోహదపడుతోంది. ద్వైపాక్షిక చర్చల పునఃప్రారంభ నేపథ్యం... దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఆర్థిక, సాంకేతిక సహకార ఒప్పందం (ఈటీసీఏ) కోసం భారత్– శ్రీలంక ఉన్నతాధికారుల మధ్య చర్చల పునఃప్రారంభం నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శ్రీలంక మూడురోజుల పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2016 నుంచి 2018 వరకు ఇరుదేశాల మధ్య 11 రౌండ్ల చర్చలు జరిగాయి. ఆ తర్వాత చర్చలు నిలిచిపోయాయి. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1వ తేదీ మధ్య 12వ దఫా చర్చలు జరిగాయి. 12వ రౌండ్లో వస్తు సేవలు, కస్టమ్స్ విధానాలు, వాణిజ్య సౌలభ్యం, వాణిజ్యానికి సాంకేతిక అడ్డంకులు, నివారణ వంటి పలు అంశాలు చోటుచేసుకున్నాయి. భారత్‌కు చెందిన అనేక ప్రముఖ కంపెనీలు శ్రీలంకలో ఇప్పటికే పెట్టుబ డులు పెట్టాయి. పెట్రోలియం రిటైల్, టూరిజం, హోటల్, తయారీ, రియల్ ఎస్టేట్, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాలలో భారతదేశం నుండి ప్రధాన పెట్టుబడులు ఉన్నాయి. 2022–23లో శ్రీలంకకు భారత్ ఎగుమతులు 5.11 బిలియన్ డాలర్లు. 2021–22లో ఈ విలువ 5.8 బిలియన్ డాలర్లు. ఇక భారత్ దిగుమతులు చూస్తే, 2021–22లో ఈ విలువ ఒక బిలియన్ కాగా, 2022–23లో 1.07 బిలియన్ డాలర్లకు చేరింది.