పేట ఆస్పత్రిలో అరాచకాలు | Harssments On Nayudu Peta Hospital | Sakshi
Sakshi News home page

పేట ఆస్పత్రిలో అరాచకాలు

Published Wed, Apr 4 2018 11:52 AM | Last Updated on Wed, Sep 26 2018 6:15 PM

Harssments On Nayudu Peta Hospital - Sakshi

నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రం

నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కందల కృష్ణారెడ్డి అరాచకాలకు అంతేలేకుండో పోతోంది. ఏడాది క్రితం అభివృద్ధి కమిటీ పేరుతో పదవి తెచ్చుకున్న టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆస్పత్రిలోనే తిష్టవేశారు. తనకు ప్రత్యేక గదిని కేటాయించుకుని అందరికన్నా పెద్ద కుర్చీయే ఉండాలంటూ అభివృద్ధి నిధులతో దర్జాగా ఆ గదిని అలంకరించుకున్నారు. అప్పటి నుంచి ఆస్పత్రికి వచ్చే డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ నుంచి వైద్యులు, సిబ్బంది, క్షేత్రస్థాయి సిబ్బందితో సహా తన కనుసన్నల్లోనే ఉండాలంటూ ఆంక్షలు విధించారు. మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధిత ఉద్యోగులపై మరింతగా అరాచకాలు సృష్టిస్తూ భయభ్రాంతులకు గురిచేయడం ఆయనకు పరిపాటిగా మారింది.

నాయుడుపేట: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి కొత్తగా వచ్చిన మహిళా వైద్యులతో పాటు సిబ్బంది సైతం ఆస్పత్రిలో అడుగు పెడితే అభివృద్ధి కమిటీ చైర్మన్‌ గదికి వెళ్లి నమస్కారం చేసి విధులు నిర్వర్తించాలని కృష్ణారెడ్డి హుకుం జారీ చేశారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో టీవీటీ కంపెనీ సౌజన్యంతో కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్న క్లీనింగ్‌ సూపర్‌వైజర్‌ జువ్వలపాటి వజ్రమ్మతో పాటు మరో ఆరుగురు మహిళలు క్లీనింగ్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. వజ్రమ్మపై కొంతకాలంగా అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ వస్తున్నారు. ఈ విషయం తన భర్త జువ్వలపాటి హుస్సేన్‌కు సమాచారం ఇవ్వడంతో చైర్మన్‌ను ప్రశ్నించడంపై ఆస్పత్రి వద్ద సోమవారం వివాదం చోటు చేసుకుంది. మీ అంతు చూస్తానంటూ ఉద్యోగంలో నుంచి తొలగిస్తానంటూ చైర్మన్‌ బెదిరింపులకు దిగారు.

తన భార్యపై లైంగిక వేధింపులకు గురిచేయడం ఏమిటని ప్రశ్నిస్తుంటే అక్కడే ఉన్న ఓ రోగి ఎందుకిలా చేశారన్నందుకుగాను చైర్మన్‌ కృష్ణారెడ్డి అనుచరుడు ఆ వృద్ధుడి చెంప చెళ్లు మనిపించడంపై తీవ్ర గందరగోళం నెలకొంది. ‘జిల్లా కలెక్టర్, మీడియాకు చెప్పుకుంటారా.. చెప్పుకోండి’ అంటూ రుబాబు చేశారు. అంతలోనే చుట్టుపక్కల ప్రాం తాల నుంచి బాధితులపై దాడి చేసేందుకు తన అనుచరులు గుమికూడటంతో భయాందోళనకు గురైన బాధితురాలు వజ్రమ్మ, భర్త హుస్సేన్, రజక వృత్తిదారుల సం ఘం రాష్ట్ర సభ్యుడు పుల్లూరు మనోరమ అక్కడి నుంచి తిన్నగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కృష్ణారెడ్డిపై ఫిర్యాదు చేశారు. సోమవారం ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు స్పందించక పో వడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కృష్ణారెడ్డి మామ తంబిరెడ్డి జనార్దన్‌రెడ్డి, సమీప బంధువులు జలదంకి మధుసూదన్‌రెడ్డి, గూడూరు రఘునాథరెడ్డి టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వారి నుంచి ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు బాధితులు తెలిపారు. అంతేకా కుండా నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు ఈ కేసును రాజీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

కేసు నమోదు చేయకపోతే  ఉద్యమం
క్లీనింగ్‌ సూపర్‌వైజర్‌ జువ్వలపాటి వజ్రమ్మపై లైంగిక వేధింపులతో పాటు చాకలి కులానికి చెందినదానా అంటూ అసభ్యకరంగా మాట్లాడటం సాక్ష్యాలు చూపిస్తే మీకు ఉద్యోగం ఉండబోదంటూ బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న చైర్మన్‌ కృష్ణారెడ్డిపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి 38 గంటలు అవుతున్నా పోలీసులు కేసు నమోదు చేయక పోవడం విడ్డూరం. టీడీపీ నాయకులు ఈ కేసు మాఫీ చేసేందుకు బాధితులకు ఫోన్లు చేసి బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఆ బెదిరింపులకు లొంగబోం. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయకపోతే సీఎం చంద్రబాబును కలిసి అధికారపార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలపై ఎండగడతాం.–మన్నూరు భాస్కరయ్య, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

వేధింపులు తట్టుకోలేకే తిరుగుబాటు చేశా
ఆస్పత్రిలో నేను బాధ్యతను తీసుకున్నప్పటి నుంచి పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నా. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే పేదలకు న్యాయం చేద్దామని ఆలోచించా. ప్రైవేటు ఉద్యోగమైనా, జీతం రూ.5 వేలైనా ఉద్యోగానికి న్యాయం చేద్దామని తోటి సిబ్బందితో నిస్పక్షపాతంగా పనిచేయించా. అందరు బాధ్యతగా ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూ వచ్చారు. మూడు నెలల పాటు టీవీటీ కాంట్రాక్ట్‌ కంపెనీ నుంచే మాకు జీతాలు అందేవి. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కృష్ణారెడ్డి తన చేతుల మీదుగా జీతాలు పంపిణీ  చేయకపోతే కంపెనీని తొలగిస్తామంటూ మాకు ఉద్యోగం అందించిన కంపెనీపై ఒత్తిడి తెచ్చారు. అప్పటి నుంచి ఆయన సమక్షంలోనే జీతాలు పంపిణీ జరిగేది. అప్పటి నుంచి మమ్మల్ని లైంగికంగా వేధిస్తూ మానసికంగా క్షోభకు గురిచేసేవాడు. గతంలో ఆయన ఒత్తిళ్లు తట్టుకోలేకే ఆత్మహత్యాయత్నం చేశా. అయినా ఆ రాక్షసుడు వేధింపులు అధికం చేశాడు. కుటుంబ సభ్యులకు చెప్పి పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశా. పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు.–జువ్వలపాటి వజ్రమ్మ, క్లీనింగ్‌ సూపర్‌వైజర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement