ఆ విషయంలో భారత్‌దే తొలి స్థానం | Meet These Powerful Women Scientists | Sakshi
Sakshi News home page

శా'స్త్రీ'యవేత్తలు

Published Sun, Feb 7 2021 11:06 AM | Last Updated on Sun, Feb 7 2021 11:06 AM

Meet These Powerful Women Scientists - Sakshi

ఇదివరకటి కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల ఉనికి నామమాత్రంగా ఉండేది గాని, ఇటీవలి కాలంలో ఈ రంగాల్లో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది. అంతరిక్ష ప్రయోగాల్లో సైతం మహిళలు రాణిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక విద్యాభ్యాసంలో భారత మహిళలు ప్రపంచంలోనే ముందంజలో ఉంటున్నారు. అయితే, ఈ రంగాల్లో ఉపాధి పొందడంలో మాత్రం కొంత వెనుకబడి ఉండటమే నిరాశ కలిగిస్తోంది. అయినా, అడుగడుగునా ఎదురయ్యే ప్రతికూలతలను అధిగమిస్తూ మన దేశానికి కొందరు మహిళలు శాస్త్రసాంకేతిక రంగాల్లో అద్భుతమైన విజయాలను సాధిస్తూ యువతరానికి స్ఫూర్తి కలిగిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన దేశంలోని మహిళల స్థితిగతులు, ఈ రంగాల్లో రాణిస్తున్న కొందరు మహిళల గురించి తెలుసుకుందాం...

శాస్త్ర సాంకేతిక రంగాల్లో పట్టభద్రులవుతున్న వారిలో ఎక్కువ సంఖ్యలో మహిళలు గల దేశాలలో భారత్‌ మొదటి స్థానంలో ఉంది. అయితే, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పట్టభద్రులవుతున్న మహిళలకు ఉపాధి కల్పించడంలో మాత్రం 19వ స్థానంలో ఉండటం గమనార్హం. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం మన దేశంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్‌ (స్టెమ్‌) రంగాలలో సుమారు 2.80 లక్షల మంది శాస్త్రవేత్తలు ఉండగా, వీరిలో మహిళలు 14 శాతం మాత్రమే ఉన్నారు. ఈ రంగాల్లో పట్టాలు తీసుకుంటున్న మహిళలు పరిశోధనలకు దూరమవుతున్నారు. ఇది భారత్‌ ఒక్క దేశానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదని, ఇది ప్రపంచవ్యాప్త సమస్య అని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సత్తా చాటుకోవడానికి మహిళలకు ప్రతికూల పరిస్థితులు ఉన్నా, వాటిని అధిగమించి తమ ప్రతిభ నిరూపించుకుంటున్న మహిళలూ ఉంటున్నారు. అలాంటి వారిలో మన దేశానికి చెందిన కొందరు నవతరం మహిళా శాస్త్రవేత్తల సంక్షిప్త పరిచయం...

మురికివాడ నుంచి పరిశోధనల వైపు: షాలినీ ఆర్య
ముంబై మురికివాడలో పుట్టి పెరిగిన షాలినీ ఆర్య ఆహార శాస్త్రవేత్తగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ముంబైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీలోని ఫుడ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సామాన్యులు చిరుధాన్యాలతో రోజువారీగా తయారు చేసుకునే వంటకాల్లో పోషకాలను మరింత పెంచడమే కాకుండా, అవి ఎక్కువకాలం నిల్వ ఉండేలా చేసేందుకు ఉపకరించే సాంకేతిక పద్ధతులను షాలినీ అభివృద్ధి చేశారు. ఈ పద్ధతులను సామాన్యులకు మరింత చేరువ చేసే దిశగా ఆమె తన పరిశోధనలను కొనసాగిస్తున్నారు. ఆహార పదార్థాల్లో పోషకాల పెంపుదల, ఆహార పదార్థాలను ఎక్కువగా నిల్వచేసే సాంకేతిక పద్ధతులపై ఆమె రాసిన పరిశోధన వ్యాసాలు వివిధ అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన ఆమె శాస్త్రవేత్తగా ఎదిగిన తీరు శాస్త్ర సాంకేతిక విద్యార్థులకు స్ఫూర్తినిస్తుంది. 

షాలినీ తండ్రి రోజు కూలి. ఒక చిన్న రేకుల ఇంట్లో ఉండేవారు. ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. తండ్రి షాలినికి ఐదేళ్ల వయసు వచ్చినా బడిలో చేర్చకుండా, ఆమె తమ్ముడిని బడిలో చేర్చాడు. తమ్ముడు రోజూ బడికి వెళుతుంటే తనకూ బడికి వెళ్లాలని ఉండేది. ఒకరోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తమ్ముడి వెనకే అనుసరిస్తూ బడికి చేరుకుంది. పాఠాలు వినాలనే ఆశతో తమ్ముడి తరగతి గదిలో టీచర్‌ టేబుల్‌ కింద నక్కింది. టీచర్‌ ఆమెను గమనించి, ఆమె తండ్రికి కబురు చేసింది. షాలినీని కూడా బడిలో చేర్చమని చెప్పింది. టీచర్‌ మాటపై షాలినీని బడిలో చేర్పించాడు. బడిలో చేరినా, షాలినీకి ఇంటి పనులు ఎప్పటి మాదిరిగానే ఉండేవి. ఇంటిల్లిపాదికీ వంట చేయడం ఆమె డ్యూటీనే. ఇంటి పనులన్నీ పూర్తయ్యాక చదువుకునేది.

హైస్కూలు చదువు పూర్తయ్యాక ఇంజినీరింగ్‌ చదవాలనుకుంది. ఇంజినీరింగ్‌ మగపిల్లల కోర్సు, అది చదవొద్దన్నాడు తండ్రి. చివరకు తండ్రి ఫుడ్‌ టెక్నాలజీ కోర్సులో చేర్పించడానికి ఒప్పుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఇంట్లో వంట చేస్తుండటంతో తనకు వంటావార్పు అంటేనే విసుగుపుట్టిందని, అయిష్టంగానే ఫుడ్‌ టెక్నాలజీలో చేరానని, అయితే, ఇందులో చేరిన తర్వాత త్వరలోనే తన అభిప్రాయాన్ని మార్చుకున్నానని, పూర్తిగా పరిశోధనల వైపు దృష్టి పెట్టానని చెబుతారు షాలినీ. బాల్యంలో పోషకాహార లోపంతో బాధపడిన తాను ఆహార శాస్త్రవేత్తను కాగలిగానని, ఇది తనకెంతో సంతృప్తినిస్తోందని అంటారామె. ఫుడ్‌ టెక్నాలజీ రంగంలో షాలినీ ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. అమెరికాలోని ఇంటర్నేషనల్‌ లైఫ్‌ సైన్సెస్‌ నుంచి ‘మలాస్పినా స్కాలర్స్‌ అవార్డు’, భారత్‌లోని అసోసియేషన్‌ ఆఫ్‌ ఫుడ్‌ సైంటిస్ట్స్‌ అండ్‌ టెక్నాలజిస్ట్స్‌ నుంచి ‘యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు’ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులను దక్కించుకున్నారు.

రాయల్‌ సొసైటీలో దక్కిన చోటు: డాక్టర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌
లండన్‌లోని ప్రతిష్ఠాత్మకమైన రాయల్‌ సొసైటీలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ మహిళా శాస్త్రవేత్తగా డాక్టర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ రెండేళ్ల కిందట ఈ అరుదైన రికార్డు సాధించారు. తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీలో గ్యాస్ట్రోఇంటస్టైనల్‌ విభాగం ప్రొఫసర్‌గా, వైరాలజీ నిపుణురాలిగా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచే లక్ష్యంతో ఆమె సాగించిన పరిశోధనలకు జాతీయంగా, అంతర్జాతీయంగా విశేషమైన గుర్తింపు లభించింది. డయేరియా, రోటావైరస్‌ వ్యాధులను అరికట్టే దిశగా ఆమె విశేషమైన కృషి చేశారు. రోటావైరస్‌ వ్యాక్సిన్‌ రూపకల్పనలో కీలక పాత్ర పోషించడంతో పాటు నోటి ద్వారా తీసుకునే పలు రకాల వ్యాక్సిన్ల పనితీరును మెరుగుపరచడంలో సత్ఫలితాలను సాధించి, ‘ఇండియాస్‌ వ్యాక్సిన్‌ గ్రాండ్‌మదర్‌’గా గుర్తింపు పొందారు. ప్రజారోగ్యం, వైరాలజీ, ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ తదితర అంశాలపై ఆమె దాదాపు మూడువందలకు పైగా పరిశోధన వ్యాసాలను రాశారు. వివిధ అంతర్జాతీయ జర్నల్స్‌లో అవి ప్రచురితమయ్యాయి. 

గగన్‌దీప్‌ కాంగ్‌ సిమ్లాలో పుట్టారు. ఆమె తల్లి ఉపాధ్యాయురాలు, తండ్రి రైల్వేలో మెకానికల్‌ ఇంజినీర్‌. ఉద్యోగరీత్యా తండ్రికి తరచు బదిలీలు అవుతుండటంతో ఆమె చదువు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో కొనసాగింది. చిన్న వయసు నుంచే ఆమెకు సైన్స్‌ సబ్జెక్టులపై ఆసక్తి ఉండేది. ఆమె ఆసక్తిని గమనించిన తండ్రి ఇంట్లోనే చిన్నసైజు లాబొరేటరీని ఏర్పాటు చేశారు. పన్నెండేళ్ల వయసులోనే ఆమె ఇంట్లోని ల్యాబ్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. ఇంటర్‌ తర్వాత వెల్లూరు క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ నుంచి ఎంబీబీఎస్, మైక్రోబయాలజీలో ఎండీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. వైద్య పరిశోధనల్లో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా డాక్టర్‌ పీఎన్‌ బెర్రీ ఫెలోషిప్, ఇన్ఫోసిస్‌ ప్రైజ్‌ సహా పలు అవార్డులు, సత్కారాలు దక్కాయి.

కట్టుబాట్లను దాటి కోడింగ్‌ ప్రపంచంలోకి: కోమల్‌ మంగ్తానీ
కోమల్‌ మంగ్తానీ కోడింగ్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టే మహిళలకు, బాలికలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ‘ఊబెర్‌’ సీనియర్‌ డైరెక్టర్‌ హోదాలో ఇంజినీరింగ్‌ అండ్‌ బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. కోమల్‌ గుజరాత్‌లోని సూరత్‌లో కట్టుబాట్లతో నడుచుకునే సంప్రదాయ కుటుంబంలో పుట్టారు. వారి కుటుంబాల్లో మగపిల్లలే ఉన్నత చదువులకు వెళ్లరు. ఇక ఆడపిల్లల పరిస్థితి వేరే చెప్పేదేముంది? అయితే, కోమల్‌ తల్లిదండ్రులు కూతురి కోసం తమ సామాజికవర్గం నుంచి ఎదురైన విమర్శలకు వెరవకుండా ఆమెను ఉన్నత చదువులు చదివించారు. సూరత్‌లోని ధరమ్‌సిన్హ్‌ దేశాయ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి కోమల్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తి చేశారు. తర్వాత విప్రోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేరారు. కొన్నాళ్లకు మంచి అవకాశాలు రావడంతో అమెరికా వెళ్లారు. అక్కడ ఒరాకిల్, వీఎం వేర్‌ వంటి సంస్థల్లో పనిచేశారు. ఆరేళ్ల కిందట క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థ ‘ఊబెర్‌’లో చేరారు. ఆ సంస్థ కోసం ‘ఊబెర్‌ ఈట్స్‌’, ‘ఊబెర్‌ రైడ్స్‌’, ‘ఊబెర్‌ ఫ్రైట్‌’, ‘జంప్‌ బైక్స్‌’ వంటి బిజినెస్‌ యాప్స్‌ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. కోడింగ్‌ పరిజ్ఞానంలో మహిళలను, బాలికలను ప్రోత్సహించేందుకు ‘విమెన్‌ హూ కోడ్‌’, ‘గర్ల్స్‌ హూ కోడ్‌’ వంటి కార్యక్రమాలను ప్రారంభించి, విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా ఔత్సాహిక మహిళలకు, బాలికలకు కోడింగ్‌లో మెలకువలు నేర్పిస్తున్నారు.

భట్నాగర్‌ పురస్కారం అందుకున్న తొలి మహిళ: అదితి సేన్‌ దే
అదితి సేన్‌ దే దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ పురస్కారం అందుకున్న తొలి మహిళా శాస్త్రవేత్తగా రికార్డు సృష్టించారు. భౌతికశాస్త్రంలో ఆమె పరిశోధనలకు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ప్రస్తుతం ఆమె అలహాబాద్‌లోని హరీశ్‌చంద్ర రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్‌ థియరీలో ఆమె విశేషమైన కృషి కొనసాగిస్తున్నారు. కోల్‌కతాలోని ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగిన అదితి చిన్ననాటి నుంచే సైన్స్‌ సబ్జెక్టులపై ఆసక్తి పెంచుకున్నారు. ఆమె తల్లి స్కూల్‌ టీచర్, తండ్రి పశ్చిమబెంగాల్‌ రాష్ట ప్రభుత్వోద్యోగి. కలకత్తా యూనివర్సిటీ పరిధిలోని బెథూనే కాలేజీ నుంచి మ్యాథమేటిక్స్‌ ఆనర్స్‌తో బీఎస్సీ పూర్తి చేసిన అదితి, తర్వాత అదే యూనివర్సిటీ పరిధిలోని రాజాబజార్‌ సైన్స్‌ కాలేజీ నుంచి అప్లైడ్‌ మ్యాథమేటిక్స్‌లో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఎమ్మెస్సీ చదువుకుంటుండగానే క్వాంటమ్, స్టాటిస్టికల్‌ ఫిజిక్స్‌పై పరిశోధనలు ప్రారంభించారు. భారత్‌లో కొన్నాళ్లు పరిశోధనలు కొనసాగించాక, పోలండ్‌లోని దాంజిగ్‌ వర్సిటీలో అవకాశం దొరకడంతో, అక్కడ చేరి పీహెచ్‌డీ పూర్తి చేశారు. తర్వాత జర్మనీలోని లీబ్నిజ్‌ యూనివర్సిటీలో కొంతకాలం, ఆ తర్వాత స్పెయిన్‌లోని ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫొటానిక్‌ సైన్స్‌లో కొంతకాలం రీసెర్చ్‌ ఫెలోగా పరిశోధనలు సాగించారు. భారత్‌ తిరిగి చేరుకున్నాక ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కొంతకాలం పనిచేశారు. క్వాంటమ్‌ క్రిప్టోగ్రఫీ, క్వాంటమ్‌ కోరిలేషన్స్‌ అంశాల్లో అదితి చేసిన పరిశోధనలకు విశేషమైన గుర్తింపు లభించింది.

సమాచార సాంకేతికతకు కొత్త పుంతలు: సునీతా సరావాగీ
సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త పుంతలు తొక్కించడంలో తనవంతు పాత్ర పోషించిన శాస్త్రవేత్త సునీతా సరావాగీ. ప్రస్తుతం ఆమె ఐఐటీ బాంబేలోని కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం పరిధిలోని సెంటర్‌ ఫర్‌ మెషిన్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా లెర్నింగ్‌లో ఇన్‌స్టిట్యూట్‌ చైర్‌ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి దిశానిర్దేశం చేసిన కొద్దిమంది కీలక శాస్త్రవేత్తల్లో ఒకరిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సునీతా సరావాగీ డేటా మైనింగ్, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి అంశాల్లో కీలక పరిశోధనలు చేశారు. ఇన్ఫర్మేషన్‌ ఎక్ట్స్రాక్షన్‌ టెక్నిక్స్‌కు రూపకల్పన చేసిన తొలితరం శాస్త్రవేత్తల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. కంప్యూటర్‌ డేటాలోకి చేరిన పేర్లు, అడ్రస్‌ల డూప్లికేషన్‌ను తొలగించేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. సునీతా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్‌ పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా నుంచి పీహెచ్‌డీ చేశారు. డేటాబేస్‌ మైనింగ్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌లో కీలకమైన మెషిన్‌ లెర్నింగ్‌కు సంబంధించిన అంశాలపై సునీతా సాగిస్తున్న పరిశోధనలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ప్రస్తుతం ఆమె ‘గూగుల్‌ రీసెర్చ్‌’కు విజిటింగ్‌ సైంటిస్ట్‌గా, కార్నెగీ మెలన్‌ యూనివర్సిటీలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా కూడా సేవలందిస్తున్నారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో సాగించిన పరిశోధనలకు గుర్తింపుగా ఆమెకు ‘ఇన్ఫోసిస్‌’ పురస్కారం సహా పలు అవార్డులు, బహుమానాలు దక్కాయి.

బహుముఖ ప్రజ్ఞతో రాణిస్తున్న వైద్యురాలు: డాక్టర్‌ రోహిణీరావు
చెన్నైలోని కావేరీ హాస్పిటల్‌లో అత్యంత పిన్నవయస్కురాలైన వైద్యురాలు డాక్టర్‌ రోహిణీరావు. చెన్నైలోనే పుట్టి పెరిగిన ఆమె వృత్తిగా ఎంచుకున్న వైద్యరంగంలో కొత్త కొత్త ప్రయోగాలు చేయడమే కాదు, తనకు గల రకరకాల అభిరుచుల కోసం కూడా ఆమె సమయం కేటాయిస్తారు. బోట్‌ సెయిలింగ్, భరతనాట్యం, రంగస్థల నటన, గుర్రపుస్వారీలోనే కాకుండా ‘భైరవముష్టి’ అనే ఒకరకమైన సంప్రదాయ యుద్ధక్రీడలో కూడా ఆమెకు చెప్పుకోదగ్గ నైపుణ్యమే ఉంది. చెన్నైలోని చెంగల్పట్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చదువు సాగిస్తూనే సెయిలింగ్‌లో ఏడు చాంపియన్‌ షిప్‌లు సాధించారు. ఎంబీబీఎస్‌ పూర్తయ్యాక కావేరీ హాస్పిటల్‌లో ఇంటర్న్‌గా చేరారు. ఎడిన్‌బర్గ్‌ యూనివర్సిటీలో స్కాలర్‌షిప్‌ రావడంతో అక్కడ ఎమ్మెస్సీ ఇంటర్నల్‌ మెడిసిన్‌ కోర్సులో చేరారు. అక్కడ చదువు పూర్తయ్యాక తిరిగి కావేరీ హాస్పిటల్‌లో చేరి, కిడ్నీ సమస్యలపై డాక్టరేట్‌ చేశారు. రోగులకు ఉల్లాసం కలిగించేందుకు ఆమె ‘మెడికల్‌ క్లౌనింగ్‌ ప్రోగ్రామ్‌’ ప్రారంభించారు. నవ్వుతో చాలా సమస్యలు దూరమవుతాయని, రోగులను నవ్వించగలిగితే వారు త్వరగా కోలుకుంటారని రోహిణి చెబుతారు. మెడికల్‌ క్లౌనింగ్‌ నిపుణురాలిగా ఆమె అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించారు. మారుమూల ఆఫ్రికా దేశాల్లో పర్యటిస్తూ, అక్కడి వైద్యసేవలు మెరుగుపరచేందుకు కూడా ఆమె తన కృషిని కొనసాగిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement