అంతులేని వివక్ష.. అతివకేదీ రక్ష! | Womens Day Special Story | Sakshi
Sakshi News home page

రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Published Thu, Mar 7 2019 10:40 AM | Last Updated on Tue, Mar 19 2019 12:13 PM

Womens Day Special Story - Sakshi

అతివ పురోగమిస్తోంది. అద్భుత విజయాలను సాధిస్తోంది. అత్యున్నత  శిఖరాలను చేరుకుంటోంది. విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం ఇతోధికంగా పెరుగుతోంది. శరవేగంగా  అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ ఆధారిత ఆర్థిక  వ్యవస్థ  నగరంలో మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తెచ్చింది. డిజిటలైజేషన్, సోషల్‌ మీడియా సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థల్లో  ఎందరో మహిళలు ప్రతిభా పాటవాలు  చాటుతున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు అన్ని రంగాల్లోనూ మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఇంటా, బయటా అణచివేతకు గురవుతున్నారు. లింగ వివక్షను నేరంగా పరిగణించే చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ మహిళల ప్రాతినిధ్యాన్ని,విస్తృతిని సమాజం ఆమోదించలేకపోతోంది. దీంతో సంఘర్షణ, అణచివేత, హింస, వేధింపులు, నిత్యకృత్యంగా మారాయి. సుమారు కోటి జనాభా ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌లో దాదాపు 25 లక్షల మందికిపైగా మహిళలు వివిధ రంగాల్లో ఉన్నారు. అసంఘటిత కార్మికులుగా, అత్యున్నత మేధోవర్గంగా, సాఫ్ట్‌వేర్‌ నిపుణులుగా, బహుముఖ ప్రజ్ఞావంతులుగా ప్రతిభను చాటుకుంటున్నవాళ్లు ఉన్నారు. కానీ ఇంట్లోనూ, బయటా ఏదో ఒక రూపంలో వివక్షను ఎదుర్కొంటుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఈ నెల 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.  

సాక్షి, సిటీబ్యూరో : తాము ఎంచుకున్న రంగంలో అద్భుతమైన ఫలితాలను సాధించినప్పటికీ  మహిళల సమర్థతపై సందేహాలు నెలకొన్నాయి. ఐటీ రంగంలో ఎంతో పురోగమిస్తున్నారు. వందలాది అంకుర పరిశ్రమలను స్థాపించిన ఔత్సాహిక మహిళలు ఉన్నారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ప్రతిభను చాటుకుంటున్నారు. అయినా కీలకమైన బాధ్యతల నిర్వహణలో మాత్రం పురుషుల తర్వాతే మహిళలు ఉన్నట్లు సాఫ్ట్‌వేర్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. నగరంలోని  హైటెక్‌ సిటీ, మాదాపూర్, కొండాపూర్‌ తదితర ప్రాంతాల్లో సుమారు 600కుపైగా సాఫ్ట్‌వేర్‌ సంస్థలు ఉన్నాయి. వీటిలో మొత్తం 5 లక్షల మందికిపైగా పని చేస్తున్నారు. వీరిలో 1.25 లక్షల వరకు మహిళలు ఉన్నారు. ప్రాజెక్టు మేనేజర్లు మొదలుకొని సీనియర్‌ స్థాయి అధికారుల వరకు ఉన్నారు. కానీ కీలక పోస్టుల్లో మాత్రం మహిళల కంటే  మగవారికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగిని ఒకరు  తెలిపారు. ‘ప్రెగ్నెన్సీ, పెళ్లి వంటి అంశాలు మహిళల పట్ల వివక్షకు కారణమవుతున్నాయి. పెళ్లి చేసుకొంటే ఉద్యోగం చేయకపోవచ్చని, గర్భిణిగా ఉన్న మహిళలు కీలకమైన విధులు నిర్వహించలేరని, సెలవుల కారణంగా సంస్థకు నష్టం వస్తుందనే  సందేహలు ఉన్నాయి. ఇది సాఫ్ట్‌వేర్‌ రంగంలో మహిళలపై కొనసాగుతున్న  వివక్షే’ అని ఐడెంట్‌సిటీ వ్యవస్థాపక  డైరెక్టర్‌ విశాలాక్షి ఆందోళన వ్యక్తం చేశారు. 

మౌలిక వసతులు మృగ్యం..  
షాపింగ్‌మాల్స్, సూపర్‌మార్కెట్లు, చిరు వ్యాపార సంస్థలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, రెస్టారెంట్లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాలు, పెట్రోల్‌ బంకులు, తదితర అన్ని చోట్ల మహిళల శ్రమ, ప్రతిభ ఉంది. వీరి అవసరాలకు తగిన మౌలిక సదుపాయాలు మాత్రం అందుబాటులో లేకుండాపోయాయి. నగరంలో కార్పొరేట్, పెద్ద పెద్ద  ప్రభుత్వ ఆస్పత్రులు మినహాయిస్తే అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు 105 మాత్రమే. నగర జనాభా అవసరాల మేరకు కనీసం మరో 100కుపైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండాలి. మహిళల కోసం ప్రత్యేక వైద్య నిపుణులు అవసరం. వైద్య రంగంలో ఈ కొరత తీవ్రంగా ఉంది. మరోవైపు రవాణా  రంగంలోనూ మహిళలకు అరకొర సదుపాయాలే. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 3,550 ఆర్టీసీ  బస్సులు ఉంటే అందులో మహిళల కోసం ఏర్పాటు చేసినవి 150 నుంచి 200 సర్వీసులు మాత్రమే. పైగా ఈ లేడీస్‌ స్పెషల్‌ బస్సులు సైతంకొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ప్రతి రోజు 121 ఎంఎంటీఎస్‌సర్వీసులు నడుస్తున్నాయి. మహిళల కోసం ఒక్క ‘మాతృభూమి’ ట్రైన్‌లో నాలుగు బోగీలు మాత్రమే వాళ్ల కోసం ఉన్నాయి. మెట్రో  రైళ్లలో మాత్రం ప్రతి సర్వీసులో మహిళలకు ఒక బోగీని ప్రత్యేకంగా కేటాయించారు. లేడీస్‌ స్పెషల్‌ మెట్రోలు మాత్రం ఇంకాఅందుబాటులోకి రాలేదు.

చదువులకు దూరమై..
హైదరాబాద్‌లో సుమారు 1100 వరకు మురికి వాడలు ఉన్నాయి. ఈ బస్తీల్లో ఉండే  80 శాతం మహిళలు ఇళ్లల్లో పని చేస్తున్నారు. ఇళ్లల్లో పని చేస్తున్న తల్లులకు సహాయం చేసేది అమ్మాయిలే కాని అబ్బాయిలు కాదు. దీంతో చిన్న వయసులోనే చాలామంది అమ్మాయిలు చదువులకు దూరమై ఇళ్లల్లో పనిచేసే కార్మికులుగా మిగిలిపోతున్నారు.   – మంజుల, ఎంఎస్‌ఐ సంస్థ ప్రతినిధి

తప్పని ఘర్షణ, వేధింపులు..
బహిరంగ స్థలాలు, రవాణా సదుపాయాల్లో, ఆఫీసులు, ఇతర చోట్ల వివక్ష కనిపిస్తోంది. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు సమానంగా చదువుకుంటున్నారు. పోటీ పడుతున్నారు. కానీ అమ్మాయిలపై వివక్ష చూపుతున్నారు. తన ఇష్టానుసారంగా జీవించేందుకు అమ్మాయిలు, మహిళలు ఎంతో ఘర్షణ, హింసను, వేధింపులను ఎదుర్కోవాల్సివస్తోంది.       – బి.గిరిజ,స్టేట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్, సఖి  

మార్పు ఇంటి నుంచే రావాలి..
కొడుకులను, కూతుళ్లను సమాన అవకాశాలతో పెంచి పోషించే స్థాయికి కుటుంబాలు ఎదగాలి. వివక్ష, అణచివేత కుటుంబం నుంచే మొదలవుతోంది. పరువు పేరిట సొంత కూతుళ్లను హతమార్చే వరకు వెళుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పేద కుటుంబాల్లో  ఆర్థిక ఇబ్బందుల కారణంగా అబ్బాయిల్లా అమ్మాయిలు స్వేచ్ఛగా ఎదగలేకపోతున్నారు.– సుమిత్ర,‘అంకురం’ వ్యవస్థాపకురాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement