న్యూఢిల్లీ: రానున్న మధ్యంతర బడ్జెట్‌పై ఫార్మా, హెల్త్‌కేర్ రంగం పెద్దగా ఆశలు పెట్టుకోకపోయినప్పటికీ కొన్ని విధానపరమైన చర్యల అవసరాన్ని ప్రస్తావించాయి. ఎగుమతులకు ప్రస్తుతం ప్రోత్సాహాలు కల్పిస్తున్న ‘భారత్ నుంచి సరుకుల ఎగుమతుల పథకం (ఎంఈఐఎస్)’ 2020 మార్చిలో కాల వ్యవధి తీరిపోతుందని, దీన్ని పొడిగించాలని పరిశ్రమ ప్రధానంగా కోరుతోంది. ఈ తరహా పథకాలను పొడిగించాలని పరిశ్రమ కోరుకుంటున్నట్టు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. ఇక పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) వ్యయాలపై ఉన్న 150 శాతం ప్రామాణిక మినహాయింపును 200 శాతం చేయాలన్నది మరో డిమాండ్‌గా ఆయన పేర్కొన్నారు. ఆర్‌అండ్‌డీకి ఈ మాత్రం ప్రోత్సాహకం అవసరమన్నారు.
జీఎస్టీని మినహాయించాలి...
జీఎస్టీని హేతుబద్ధీకరించాలని హెల్త్‌కేర్ రంగం కోరుతోంది. పెరిగిన ముడి పదార్థాల ధరలతో ఆరోగ్య సంరక్షణ భారంగా మారుతోందని అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ ఎండీ సునీతారెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్య సేవలను అందుబాటు ధరల్లో ఉంచాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా... ఈ రంగానికి సరఫరా అయ్యే ముడి పదార్థాలపై జీఎస్టీని మినహాయించాలని సూచించారు. ఎందుకంటే ఈ ధరల భారాన్ని రోగుల నుంచి రికవరీ చేసుకోవడానికి అనుమతించకపోవడంతో, చెల్లించిన జీఎస్టీని సర్దుబాటు చేసుకోలేకపోతున్నట్టు ఆమె చెప్పారు. దీనివల్ల తమ మార్జిన్లపై ప్రభావం పడి, తమ నిధుల లభ్యత ప్రభావితమై అధునాతన టెక్నాలజీలు, నాణ్యతపై వెచ్చించే అవకాశం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
150 శాతం తరుగుదలను అనుమతించే సెక్షన్ 35ఏడీని తిరిగి ప్రవేశపెట్టాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. నూతన ప్రాజెక్టులపై పెట్టుబడులకు ఇది ప్రోత్సాహకాలు కల్పిస్తుందని ఆమె వివరించారు. ‘‘ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపును గణనీయంగా పెంచాలి. మన దేశంలో ఓ వ్యక్తి ఆరోగ్యం కోసం చేసే సగటు ఖర్చు 85 డాలర్లు (6,035). ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. రానున్న బడ్జెట్‌లో ఆయుష్‌మాన్ భారత్ పథకాన్ని నియంత్రణలు లేకుండా ప్రైవేటు రంగానికీ విస్తరింపచేయాలి’’ అని హెల్త్‌కేర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్, సీఈవో అజయ్ కుమార్ పేర్కొన్నారు.
ప్రోత్సాహకాలు కావాలి...
చిన్న పట్టణాల్లోనూ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రోత్సాహకాలను రానున్న బడ్జెట్‌లో ప్రకటించాలని హెల్త్‌కేర్ స్టార్టప్ ‘లెట్స్‌ఎండీ’ కోరింది. అలాగే, బీమా వ్యాప్తి కోసం చర్యలు అవసరమని ఈ సంస్థ సీఈవో నివేష్ ఖండేల్‌వాల్ అభిప్రాయపడ్డారు. ఆరోగ్య సేవల వ్యయాలు పెరిగిపోతుంటే, ఈ రంగంలో బీమా విస్తరణ అతి తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.
ఆయుష్మాన్ భారత్ పథకం, మెడికల్ డివైజెస్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఏర్పాటు మొదలైన చర్యలతో కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా హెల్త్‌కేర్ విభాగంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్‌లో వీటికి తగినంత స్థాయిలో నిధుల కేటాయింపు జరుగుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం వైద్య పరికరాల రంగం 70 శాతం పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీన్నుంచి బయటపడేందుకు మేకిన్ ఇండియా నినాదం తరహాలో బై ఇండియా (భారతీయ ఉత్పత్తులే కొనుగోలు చేయడం) విధానాలు కూడా అమలు చేస్తే బాగుంటుంది.
– జీఎస్‌కే వేలు, మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ గ్రూప్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment