- పాడి రైతులకు తప్పని తిప్పలు
- 22 ఆస్పత్రులు అప్‌గ్రేడైనా ఫలితం శూన్యం
- జిల్లాలో 39వైద్యుల పోస్టులు ఖాళీ
గుడ్లవల్లేరు : పశువుల ఆస్పత్రులలో చాలినంతమంది వైద్యులు లేకపోవడంతో పాడిరైతులు అవస్థలు పడుతున్నారు. కాగా కొన్ని ఆస్పత్రుల భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో పశువులకు వైద్యం చేయడానికి వీల్లేక వైద్యులు సమస్యలెదుర్కొంటున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 212 పశువుల ఆసుపత్రులు ఉండగా, వాటిలో 92 ఆస్పత్రులకే వైద్యులు ఉన్నారు.
మిగిలిన వాటిలో వైద్య సిబ్బందే ఇప్పటివరకూ వైద్యం అందిస్తూ వచ్చారు. మొత్తం 114మంది వైద్యులు ఉం డాల్సి ఉండగా 39 ఖాళీలున్నాయి. కాగా ఇటీవల పశు వైద్య సహాయకులకు పదోన్నతులు రావడంతో 90 పోస్టులు ఖాళీ అయ్యాయి. ఆ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో పశువులకు సకాలంలో వైద్యం అందక చనిపోతున్నాయని పాడిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేరుకే ఆసుపత్రుల అప్‌గ్రేడ్..
ప్రభుత్వం జిల్లాలో 22ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేసింది. కాగా అందుకు తగినట్లుగా వైద్యులను నియమిం చడం కానీ, భవనాలు నిర్మిం చడం కానీ జరగలేదు. కేవలం నాలుగు ఆస్పత్రులకు మాత్రమే వైద్యులను నియమించారు. దీనివల్ల ప్రయోజనం ఏమిటని పాడిరైతులు ప్రశ్నిస్తున్నారు. అవసరమైన చోట కొత్త భవనాలను నిర్మించేందుకు రూ.5 లక్షల చొప్పున మంజూరు చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా కార్యరూపం దాల్చటం లేదు.
గోపాల మిత్ర భవనాలతో పాటు 80 గ్రామీణ పశు వైద్యశాలల నిర్మాణాలకు రూ.5.03కోట్లను కేటాయించినా పనులు పూర్తి స్థాయిలో జరగటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామంలోని ఆస్పత్రిలో చాలా కాలం నుంచి వైద్యుడు లేకుండానే సిబ్బందే పశువులకు వైద్యం అందిస్తున్నారని రైతుక్లబ్ కన్వీనర్ పెన్నేరు ప్రభాకర్ తెలిపారు. ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేసినా డాక్టరూ రాలేదు. కొత్త భవనం నిర్మించ లేదని చెప్పారు. విన్నకోటలో పశువుల ఆస్పత్రి భవన నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేయడంతో పాలకేంద్రం ఆవరణలో పశువులకు వైద్యం చేస్తున్నారు.
ప్రభుత్వానికి నివేదించాం..
జిల్లాలో పశువుల వైద్యులు, వైద్య సహాయకుల కొరత ఉన్నమాట వాస్తవమేనని జిల్లా పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ టి.దామోదరనాయుడు అంగీకరించారు. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక పంపించామని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో అప్‌గ్రేడైన 22 ఆస్పత్రుల్లో కొన్నింటికి భవనాలను నిర్మించాల్సి ఉందని, టెండర్లు పిలిచే సమయానికి ఎన్నికల కోడ్ అడ్డం వచ్చిందని వివరించారు.