విజృంభిస్తున్న ‘లంపీస్కిన్‌’ | Lumpy Skin Disease Affecting White Cows And Bulls In Telangana | Sakshi
Sakshi News home page

విజృంభిస్తున్న ‘లంపీస్కిన్‌’

Published Sun, Oct 16 2022 1:07 AM | Last Updated on Sun, Oct 16 2022 1:09 AM

Lumpy Skin Disease Affecting White Cows And Bulls In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో తెల్లజాతి ఆవులు, ఎద్దులకు సోకుతున్న లంపీస్కిన్‌ వ్యాధి విజృంభిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటివరకు 5,219 పశువులు ఈ వ్యాధి బారినపడగా వాటిలో 24 ఆవులు మృతి చెందాయి. 2,484 పశువులు ఇప్పటికీ వ్యాధితో బాధపడుతున్నాయని పశుసంవర్ధక శాఖ తెలిపింది.  

32 జిల్లాల్లో లక్షణాలు 
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మినహా మిగిలిన 32 జిల్లాల్లోని పశువులకు ఈ వ్యాధి సోకిందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షలకుపైగా తెల్లజాతి పశువులుంటాయని అంచనా వేస్తుండగా ఇప్పటివరకు మొత్తం పశుసంపదలో 0.27 శాతానికి ఈ వ్యాధి సోకింది. గత వారం, పది రోజులుగా ఈ వ్యాధికారక క్యాప్రిపాక్స్‌ వైరస్‌ విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే 150 పశువులకు ఈ వ్యాధి సోకిందని అధికారులు వివరించారు. వ్యాధి సోకిన పశువులను ఐసొలేషన్‌లో ఉంచడంతోపాటు ఇప్పటివరకు 5,34,273 పశువులకు వ్యాక్సిన్లు వేశారు. 

వాతావరణ సానుకూలతతో
ఉత్తరాదిలో ఐదారు నెలల కిందటి నుంచే ఈ వ్యాధి వ్యాపిస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని వేలాది పశువులు లంపీస్కిన్‌ కారణంగా చనిపోయాయి. అయితే సెప్టెంబర్‌ మధ్య వరకు రాష్ట్రంలో లంపీస్కిన్‌ ఆనవాళ్లు కనిపించలేదు. ఆ తర్వాత అక్కడక్కడా కనిపించినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ వ్యాధి తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే నష్టనివారణ చర్యలు చేపట్టడంతో రాష్ట్రంపై పెద్దగా ప్రభావం ఉండదని పశుసంవర్ధక శాఖ అధికారులు భావించారు.

కానీ ఉన్నట్టుండి లంపీస్కిన్‌ వ్యాధి తీవ్రరూపం దాలుస్తోంది. దోమలు, ఈగలు, గోమార్ల ద్వారా సంక్రమించే క్యాప్రిపాక్స్‌ వైరస్‌కు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, చలి వాతావరణం కూడా తోడైందని అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల అనుభవాలను బట్టి రాష్ట్రంలోని 20 శాతం పశువులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  

కేంద్రం హెచ్చరికలు.. 
దేశంలో లంపీస్కిన్‌ వ్యాధి విజృంభిస్తున్న తీరుపై కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. పశువులకు వ్యాక్సినేషన్‌ను ఉధృతం చేయాలని శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించింది. లంపీస్కిన్‌ లక్షణాలు కనిపించిన పశువులున్న 5 కి.మీ. పరిధిలోని అన్ని గ్రామాల్లోగల పశువులకు వ్యాక్సిన్లు వేస్తున్న పశుసంవర్ధక శాఖ... ఇకపై రాష్ట్రంలో అన్ని తెల్లజాతి పశువులకు టీకాలు వేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 15 రోజుల కార్యాచరణను రూపొందించింది. యుద్ధప్రాతిపదికన పశువులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ముమ్మరం చేసింది. 

లంపీస్కిన్‌ లక్షణాలివే.. 
►పశువులకు తీవ్రమైన జ్వరం 
►కంటి నుంచి నీరు కారడం 
►చర్మంపై పెద్దపెద్ద గడ్డలు 
►తీవ్రమైన ఒళ్లు నొప్పులు 
►చర్మమంతా పొలుసులుగా మారడం 
►పశువు మేత తినదు... పాలివ్వదు

వ్యాధిబారినపడ్డ ఆవుల పాలు తాగొద్దు
పశువుల్లో లంపీస్కిన్‌ లక్షణాలు కనిపిస్తే రైతులు వెంటనే స్థానిక పశువైద్యాధికారికి సమాచారం ఇవ్వాలి. ముందుగా జ్వరం నియంత్రణకు వైద్యులు మందులు వాడతారు. వ్యాధి సోకిన పశువులను మంద నుంచి దూరం చేయాలి. ఆ పశువులు తిన్న గడ్డి ఇతర పశు వులకు వేయొద్దు. వాటి పాలు తాగొద్దు. ఈ వ్యాధి కారణంగా గొడ్డుమోతు తనం కూడా వచ్చే అవకాశముంది.    
– డాక్టర్‌ ఎస్‌. రాంచందర్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ 

రోగం గురించి చెప్పేవారే లేరు
పశువులు లంపీస్కిన్‌ వ్యాధి బారినపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏ మందులు వాడాలి వంటి విషయాలు చెప్పే వారు మాకు అందుబాటులో లేరు.     
– బొక్కల మల్లారెడ్డి, హుజూరాబాద్‌  

వ్యాక్సిన్‌ ఇచ్చారు..
లంపీస్కిన్‌ వ్యాధి నుంచి ఆవులను కాపాడేందుకు పశువైద్యులు మా ఆవులకు వ్యాక్సిన్‌ ఇచ్చారు. ఆవులను మందలోకి వదలకుండా నేనే మేతకు తీసుకువెళ్లి తిరిగి ఇంటికి తీసుకొస్తున్నా. 
– కరుణాకర్‌రావు, మెట్‌పల్లి, మాక్లూర్‌ మండలం, నిజామాబాద్‌ జిల్లా 

రెండు ఎడ్లకు సోకింది
మా రెండు ఎడ్లకు లంపీస్కిన్‌ వ్యాధి సోకింది. ఎడ్ల శరీరంపై దద్దుర్లు వచ్చాయి. పశు వైద్యాధికారికి చెబితే వచ్చి టీకాలు వేశారు. జాగ్రత్తలు చెప్పారు. 
– రాతిపల్లి మల్లేశ్, సుబ్బరాంపల్లి, చెన్నూరు మండలం, మంచిర్యాల జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement