హైదరాబాద్: అంతుచిక్కని వ్యాధితో పోరాడిన సందెపల్లి శివచరణ్ ఓడిపోయి మృత్యువు ఒడికి చేరుకున్నాడు. తీవ్ర అస్వస్థతకు గురై ఆదివారం ఇంట్లోనే ప్రాణాలు విడిచాడు. మృతుడి అన్న అఖిల్ పరిస్థితి కూడా విషమంగానే ఉందంటూ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం, ముల్కలపల్లి గ్రామానికి చెందిన సందెపల్లి ఉప్పలయ్య, పారిజాత దంపతులు చాలాకాలం క్రితం నగరానికి బతుకుదెరువు కోసం వచ్చి స్థానిక సోనియాగాందీనగర్‌లో నివాసం ఉంటున్నారు.
వారికి సందెపల్లి అఖిల్, సందెపల్లి శివచరణ్ ఇద్దరు కుమారులు. అయితే వీరిద్దరూ చిన్ననాటి నుంచే అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. వారు మస్క్యూలర్ డిస్ట్రోఫి అనే వ్యాధితో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. నడవలేకపోవడం, నడుస్తూ పడిపోవడం వంటి లక్షణాలతో ప్రారంభమైన వ్యాధి రానురాను కదల్లేని పరిస్థితుల్లోకి తీసుకెళ్లింది. క్రమంగా చేతులు, కాళ్లు వంకరపోయి పూర్తిగా చచ్చుబడిపోవడంతో ఒకరు 12, మరొకరు 8వ ఏట నుంచి మంచానికే పరిమితమయ్యారు. పిల్లల దుస్థితిని తట్టుకోలేని తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి వైద్యం చేయించినా ఫలితం దక్కలేదు.
తీవ్ర జ్వరంతో శివచరణ్ మృతి
ఈ క్రమంలో వారు 2017లో సాక్షిని ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పిల్లల దుస్థితిపై ఆడి.. పాడే.. వయస్సులో అంతుచిక్కని వ్యాధి అంటూ 2017 మే నెలలో సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది. సాక్షి కథనానికి స్పందించిన బీఎల్‌ఆర్ ట్రస్టు చైర్మన్, ప్రస్తుత బీఆర్‌ఎస్ ఉప్పల్ నియోజకవర్గ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి వారిని కలిశారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముంబైలో వ్యాధికి సంబంధించి వైద్యం లభిస్తుందని, అందుకు తమకు స్థోమత లేదని బీఎల్‌ఆర్‌తో తల్లిదండ్రులు వాపోయారు.
తనకున్న పరిచయాలతో అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరి వైద్యం చేయించారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నారని కొంత కాలం మందులు వాడాలన్న వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ వచ్చారు. ఈ క్రమంలో తీవ్ర జ్వరంతో శివచరణ్ ఆదివారం మృతిచెందాడు. పెద్ద కొడుకు అఖిల్ పరిస్థితి కూడా విషమంగానే ఉందని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీఎల్‌ఆర్ వారికి ఆర్థికసాయం అందజేసి ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment