
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి వేళ గంగిరెద్దులాటకు పోలీసుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఉండవని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు తెలిపారు. రహదారులపై, చౌరస్తాల వద్ద భిక్షాటన చేస్తూ ప్రజలకు ఆటంకం కలిగిస్తున్న వారిని మాత్రమే అదుపులోకి తీసుకుని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని వారు చెబుతున్నారు. గంగిరెద్దులు ఆడించేవారు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు మూడు కమిషనరేట్ల పోలీసు కమిషనర్లు శ్రీనివాసరావు, సందీప్ శాండిల్య, మహేశ్ భగవత్ శనివారం ప్రకటనలు విడుదల చేశారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా గంగిరెద్దులాట అనేది హిందూ సంస్కృతిలో భాగమని, తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆటకు పోలీసుల నుంచి ఆటంకం ఉండదని వారు వెల్లడించారు. గంగిరెద్దులాడించే వారికి నగరంలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే కంట్రోల్ రూమ్ నం. 100కు తెలపవచ్చని.. వెంటనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.