అక్షర తూణీరం
గుమ్మడి కాయంత బంగారం, కుక్క ముట్టుకుందని పారేశాం. అందుకే ఇలా వచ్చానని జోలె చూపిస్తాడు. ఆ కబుర్లు, కోతలు ఓటుకొచ్చే వారి మాటల్ని తలపిస్తాయ్.
సంక్రాంతి పండగ కనుచూపు మేరలో ఉంది. ఓట్ల పండగలాగే సంక్రాంతి కూడా నెల ముందునుంచీ సంద డికి దిగుతుంది. సాంతం తెల్లారకుండానే సాతాని జియ్యరు పాడినపాటే పాడుకుంటూ గడపగడపకీ తిరు గుతాడు. అక్షయ పాత్రలో బియ్యం పడగానే ‘కృష్ణార్పణం’ అంటూ మరో ముగ్గులోకి వెళ్లిపోతాడు. పాడిన పాటే పాడుకుంటూ ఓట్ల కోసం వస్తారు. కాకపోతే ఓటేశాక మనమే ‘కృష్ణార్పణం’ అనుకుని సరిపెట్టుకోవాలి. ఈ తరుణంలో గంగిరెద్దులస్వామి వస్తాడు. ‘అయ్యగారికి దణ్ణం పెట్టు, అమ్మగారికి దణ్ణం పెట్టు’ అంటూ బొంతలు కప్పుకున్న గంగిరెద్దుని మోకరిల్ల చేస్తాడు. బోలెడు దీవెనలు పెడతాడు. అన్నింటికీ ఆ బసవన్న తలూపుతుంది.
అప్పుడు దాని మెడలో గంటలు మోగుతాయి. ఒకసారి నాయకత్వం తలపైకొస్తే, ఇక తర్వాత అందర్నీ డూడూ బసవన్నలని చేసి ఆడించవచ్చునని ఒక ధీమా, ఒక నమ్మకం, ఒక నిజం. బుర్రమీసాలు, వెలిసిపోయిన కోటు, చిరుగుల గొడుగు, తలకి పాగా, చేతిలో ఢక్కా నుదుట పెద్ద కుంకమ బొట్టుతో బుడబుక్కల స్వామి కొంచెం దాష్టీకంగా ఉంటాడు. ‘అంబ పలుకు, జగదాంబ పలుకు’ అనే పల్లవితో ఇంటిల్లపాదికీ దీవెనలు పెడతాడు. అంతా జయమే కలుగుతుందంటూ జోస్యాలు చెబుతాడు. బోలెడు కోరికలు కోరతాడు. కోరినవన్నీ సాధించుకు గాని వెళ్లడు. మంచి కార్యసాధకుడైన నేతలా కనిపిస్తాడు.
కట్టె తుపాకీ బుజాన పెట్టుకుని, విచిత్ర వేషధారణలో వినోదాన్ని ఇంటి ముందుకు తెస్తాడు పిట్టలదొర. ఇది చాలా ప్రసిద్ధమైన సంక్రాంతి ముష్టిపాత్ర. కావల్సినన్ని కబుర్లు చెబుతాడు. అంతులేనన్ని కోతలు కోస్తాడు. గుమ్మడి కాయంత బంగారం ఉన్నవాణ్ణి, కుక్క ముట్టుకుందని అవతల పారేశాం. అందుకే ఇలా వచ్చానని జోలె చూపిస్తాడు. ఆ కబుర్లు, కోతలు ఓటుకొచ్చే వారి మాటల్ని తలపిస్తాయ్. కడవలో నీళ్లు పోసి, నీళ్లలో కత్తి గుచ్చి, ఆ కత్తిని కావడికి వేలాడదీసి ఊరంతా ఊరేగిస్తారు మాసాబత్తినివాళ్లు. విప్రవినోదులు హస్తలాఘవంతో ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు ప్రదర్శిస్తారు. నీళ్లలో కత్తి గుచ్చి ఇంద్రజాలం చేయడం, హస్తలాఘవ విద్య రాజకీయ వ్యాపారానికి పెట్టుబడులు. ఏది శంకుస్థాపనో, ఏది ప్రారంభోత్సవమో అంతుపట్టదు.
కోడిపందేలు సరేసరి. పందెపు కోళ్లు బాదంపప్పులు దాణాగా తింటాయ్. స్కాచ్ విస్కీ పుచ్చుకుంటాయ్. వాటి గెలుపోటములు కొందరి జీవితాలని నిర్ధారిస్తాయ్. మన పల్నాటి చరిత్రని పందెపు కోళ్లే రచించి, పౌరుషానికి నిర్వచనం చేశాయి. ‘‘ఏమిటోనండీ! ఈ సంక్రాంతి లాంఛనాలతో, అల్లుళ్ల అలకలతో ఇది మాత్రం మోదీ పెట్టిన జీఎస్టీలాగా తినేస్తోందండి!’’ ఈ సంక్రాంతి వేళ ఓ గృహస్తు బావురుమన్నాడు.
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Comments
Please login to add a commentAdd a comment