ప్రధాని మోదీపై అభ్యంతరకర వీడియో.. కలకలం
రాంచీ: ప్రధాని నరేంద్ర మోదీని తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఓ ముస్లిం యువకుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టగా అతడికి 14 రోజుల పోలీసు కస్డడీ విధించారు. హజారిబాగ్ ఎస్పీ అనూప్ బిర్తారే కథనం ప్రకారం.. 25 ఏళ్ల యువకుడు మహమ్మద్ ఆరిఫ్ ఝార్ఖండ్లోని హజారిబాగ్లో నివాసం ఉంటున్నాడు. గోవధ నిషేధంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆరిఫ్ తన నిరసనను వ్యక్తం చేయాలని భావించి కటకటాల పాలయ్యాడు.
స్థానిక కెరెదారి బ్లాక్ లో మెకానిక్గా పనిచేస్తున్న ముస్లిం యువకుడు ఆరిఫ్.. గోవధ నిషేధంపై మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. ప్రధాని మోదీని అవమానించేలా అసభ్య పదజాలంతో దూషించాడు. ఆపై బహిరంగంగానే గోవులను వధిస్తామని, ఏం చేస్తారో చేసుకోండి అంటూ సవాల్ విసిరాడు. దీంతో పాటు మత పరమైన వివాదాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన నిందితుడు ఆరిఫ్ ఈ తతంగాన్ని వీడియా తీశాడు. ఆపై వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలలో పోస్ట్ చేయగా వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సోమవారం అర్ధరాత్రి ఆరిఫ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళవారం మేజిస్టేట్ ఎదుట హాజరుపరిచినట్లు తెలిపారు.
నిందితుడికి 14 రోజుల పోలీసు కస్డడీకి తరలించారు. కాగా, కేవలం హజారిబాగ్ లోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, వీడియోలు షేర్ చేసిన కారణంగా ఈ ఏడాది 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వీటి కారణంగానే ఈ నెల 14న, 18న హజారిబాగ్ లో మత కలహాలు చెలరేగిన విషయం తెలిసిందే. ఇంటికి సమీపంలో గోమాంసం కనిపించిందన్న కారణంగా జూన్ 27న గోరక్షకులు గిరిద్ లో ఓ ముస్లిం వ్యక్తిని చితకబాదారు. పటిష్ట చర్యలు తీసుకున్నా సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న పోస్టుల కారణంగా తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఎస్పీ అనూప్ బిర్తారే వివరించారు.