ఇంతకు ఈ గోరక్షకులు ఎవరు? | Who is a Gau Rakshak Dal? | Sakshi
Sakshi News home page

ఇంతకు ఈ గోరక్షకులు ఎవరు?

Published Fri, Apr 7 2017 3:57 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Who is a Gau Rakshak Dal?

న్యూఢిల్లీ:  కేంద్రంలో, ఇటీవల పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో, ముఖ్యంగా ఉత్తరాదిలో గోరక్షకుల ఆగడాలు పెరిగిపోయాయి. మొన్నటికి మొన్న రాజస్థాన్‌లో గోరక్షకులు జరిపిన దాడిలో ఓ ముస్లిం వ్యక్తి ప్రాణాలు పోయాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఆరు బీజేపీ పాలిత రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఇంతకు ఈ గోరక్షకులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? వారికి చట్టపరమైన హక్కులుగానీ చారిత్రక నేపథ్యంగానీ ఏమైనా ఉందా?

వెయ్యేళ్లకుపైగా చరిత్ర
భారత దేశంలో నాటి గో రక్షకులకు వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. నేటి గోరక్షకులకు చరిత్ర లేదు. పశు సంపదన రక్షించడం కోసం ప్రాణ త్యాగాలు చేసి నాటి గో రక్షకులు చరిత్రలో నిలిచిపోగా, నేటి గో రక్షకులు ప్రాణాలు తీస్తూ చరిత్ర హీనులుగా మిగిలిపోతున్నారు. నాడు గోరక్షకులను దేవులీలు, పల్లవులు అని ప్రాంతాన్నిబట్టి పిలిచేవారు. మధ్యయుగాల నాడు పశు సంపదే దేశ బలమైన ఆర్థిక వ్యవస్థ. పశ్చిమ, ఉత్తమ భారత దేశంలో అధిక పశు సంపద కలిగిన వారిని ధన్‌గర్, మాల్‌ధారి అని కూడా పిలిచేవారు. వ్యవసాయ పనుల కోసం ఉపయోగ పడడమేకాకుండా అపార పాడినివ్యడంతోపాటు ఊలు, చర్మంతోపాటు మాంసాన్నిచ్చే పశు సంపదే నాడు బలమైన ఆర్థిక శక్తి.

పశు సంపద కోసం యుద్ధాలు జరిగేవి
పశు సంపదను సొంతం చేసుకోవడానికి చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. రాజస్థాన్‌లో వీటి కోసమే 17,18 శతాబ్దంలో కూడా యుద్ధాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. పశువులను ఎత్తుకుపోయి అంగట్లో అమ్మేందుకు దొంగతనాలు జరిగేవి. కొంత మంది దొంగలు తమంతట తామే దొంగతనాలకు పాల్పడితో మరికొంత మంది ఇతరులిచ్చే డబ్బాశకు దొంగతనాలు చేసేవారు. అమ్మాల్సిన పశువులను సంతకు తీసుకెళ్లేందుకు, వాటిని కొనుక్కున్న రైతుల ఇంటికి వాటిని తీసుకెళ్లేందుకు బంజారీలు మధ్యవర్తులుగా పనిచేసే వారు.

రాజ్‌పుత్‌లు, జాట్‌లు పశుపోషకులు
వెయ్యేళ్ల క్రితం దేశంలో పశువుల పెంపకం, వాటి పోషణ బాగా లాభసాటి వ్యాపారం అవడంతో రాజ్‌పుత్‌లు, జాట్‌ కులస్థులు పెద్ద సంఖ్యలో పశువులను పెంచేవారు. వాటిని దొంగల బారి నుంచి శత్రువుల బారి నుంచి రక్షించుకునేందుకు దేవులీలు, పల్లవులని పిలిచే గోరక్షకులను నియమించే వారు. వారిని మొత్తం గ్రామ ప్రజలు ఎంతో గౌరవంగా చూసేవారు. వారిలో కూడా రాజ్‌పుత్, జాట్‌ కులస్థులు ఎక్కువే ఉండేవారు.  వారు పశువుల రక్షణ కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసేవారు. అలా ప్రాణత్యాగం చేసిన వారి పేర్లతో గ్రామస్థులు శిలా విగ్రహాలు ఏర్పాటుచేసి పూజించేవారు. పాబూజీ, తేజాజీ, గోగాపిర్, రామదేవ్‌లు అలా పూజలందుకొని చరిత్రలో నిలిచిపోయారు. వారిలో పాబూజీ, గోగాపిర్‌లు రాజ్‌పుత్‌లుకాగా, తేజాజీ జాట్‌ కులస్థుడు.

పరస్పర సహకారంతో జీవించేవారు...
పశు సంపదపై ఆధారపడి వ్యవసాయం, పాడి, ఊలు, తోలు, మాంసం పరిశ్రమలు కొనసాగేవి. వీటిలో పనిచేసే అగ్రవర్ణాల వారు, రైతులు, దలితులు, ముస్లింల మధ్య పరస్పర సహకారం ఉండేది. మాంస కోసం పశువులను అపహరిస్తున్నారన్న  ఆరోపణలపై ముస్లింలపై రాజ్‌పుత్‌లు దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే అవి రాజ్యాల మీద కాంక్షతో జరిగిన యుద్ధాలేనని చరిత్రకారులు చెబుతారు. ఏదేమైనా గోరక్షకులు మాత్రం ఏ దలితుల మీద, ఏ ముస్లింల మీద దాడి చేసిన దాఖలాలు లేవు.

ఇంతకూ ఈ గోరక్షకులెవరూ?
2012లో భారతీయ గోరక్షాదళ్‌ను పవన్‌ పండిట్‌ ఏర్పాటు చేశారు. ఆయనే దీనికి చైర్మన్‌గా ఉంటున్నారు. దేశావ్యాప్తంగా దీనికి 32 శాఖలున్నాయి. ఈ శాఖల్లో ఆరువేల మంది స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉన్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లోని శాఖలు చురుగ్గా ఉన్నాయి. రాజకీయంగా భారతీయ గోరక్షాదళ్‌ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాకపోయినా ఇందులో హిందూ సంస్థలకు చెందిన సభ్యులే ఎక్కువ మంది ఉన్నారు. ఇందులో పనిచేసే సంస్థలకు చట్టాపరంగా ఎలాంటి హక్కులు, బాధ్యతలు లేవు. హిందూ రత్న, గోరక్షక్‌ సమ్మాన్‌ లాంటి పురస్కారాలు ఉన్నాయిగానీ వేతనాలు కూడా లేవు.

చందాలు, బలవంతపు వసూళ్లు
రాష్ట్ర కమిటీల్లో పనిచేస్తున్న గోరక్షకులు గోరక్షణ పేరిట విరాళాలు వసూలు చేస్తారు. రోడ్డుపక్కన డాబాలను, రెస్టారెంట్లను బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కబేళాలకు ట్రంకుల్లో తరలిస్తున్న పశువులను అనుమతించేందుకు గోరక్షకులు డబ్బులు తీసుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. గోరక్షక కమిటీల్లో ఎక్కువగా హిందూ సంస్థలకు చెందిన కార్యకర్తలే ఉండడం వల్ల మనదే ప్రభుత్వం అధికారంలో ఉందన్న దీమాతో తాజాగా దాడులకు పాల్పడుతున్నారని తెలుస్తోంది.

అహింసే మా సిద్ధాంతం
అహింసే తమ సిద్ధాంతమని, ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మీద దాడులకు పాల్పడరాదని తాము గోరక్షకులకు చెబుతూ వస్తున్నామని భారతీయ గోరక్షా దళ్‌ వ్యవస్థాపకుడు పవన్‌ పండిట్‌ తెలిపారు. తల్లిలాంటి గోవును కబేళాలకు తరలిపోకుండా రక్షించేందుకు పోలీసుల సహకారం తీసుకోవాలే తప్ప చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేతుల్లోకి తీసుకోరాదని తమ కార్యకర్తలకు తాను చెబుతున్నాని ఆయన చెప్పారు. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో గోరక్షకులు తుపాకులు కూడా పట్టుకుంటున్నారు. సైనికుల్లా దుస్తులేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement