ఆవులతో తొక్కించుకుంటే అదృష్టం మనదే!
పదుల సంఖ్యలో ఆవులు వీధుల్లో వేగంగా పరుగులు తీస్తున్నాయి. మామూలుగా అయితే మనమేం చేస్తాం? మనల్ని తొక్కేస్తాయని భావించి.. పక్కకు తప్పుకుంటాం.. కానీ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో పక్కకు తప్పుకోరు.. తొక్కించుకుంటారు! గోవుల గిట్టల వల్ల గాయాలైనా.. భక్తిపారవశ్యంలో మునిగితేలుతారు. ఈ వినూత్న సంప్రదాయం ఏటా దీపావళి మరుసటి రోజున ఉజ్జయినిలో జరుగుతుంది. ఇలా చేయడం వల్ల తమ జీవితాల్లోని సమస్యలన్నీ తొలగిపోతాయని.. అదృష్టం కలసి వస్తుందని నమ్ముతారు. అందుకే ప్రమాదమని తెలిసినా.. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో పురుషులు ఇక్కడికి తరలివస్తారు.
ఈ సంప్రదాయం కొన్ని వందల ఏళ్ల నుంచి కొనసాగుతోందని.. ఇప్పటివరకూ ఒక్కరు కూడా చనిపోలేదని నిర్వాహకులు చెబుతున్నారు. ‘ఇది ప్రమాదమే.. అయితే.. ఆవు అమ్మలాంటిది. అమ్మ ఎవరినీ చంపదు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ సమస్యలు ఉన్నాయి. ఈ గోవులు తమ పాదాలతో వాటిని అణచివేస్తాయి. భగవంతుడు మా బాధను, త్యాగాన్ని గమనించి.. అదృష్టం కలసివచ్చేలా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు’ అని మనోజ్‌కుమార్ అనే స్థానికుడు తెలిపాడు.