ఎండ, వానలోనూ ఆరుబయటే రాజన్న దేవాలయ కోడెలు
బురదలోనే తిరుగుతూ రోగాలబారిన పడుతున్న గోవులు
ఆదాయం ఉన్నా వసతులు శూన్యం
పట్టించుకోని వేములవాడ ఆలయ అధికారులు
వేములవాడ అర్బన్: వేములవాడ రాజన్న గోశాలలో వసతులు కరువయ్యాయి. భక్తుల విశ్వాసంగా నిలిచే కోడెమొక్కుల కోడెలకు కనీస సౌకర్యాలు లేవు. వానకు తడుస్తూ.. ఎండకు ఇబ్బందిపడుతూ ఆరుబయటే ఉంటున్నాయి. చిన్నపాటి వర్షానికే బురదమయమవుతున్న నేలపైనే పడుకుంటున్నాయి. కనీస వసతులు లేక భక్తులు అందించే కోడెలు గోశాలలో ఇబ్బంది పడుతున్నాయి. కనీసం గోవులు నిల్చోలేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కోడెమొక్కుల ద్వారా అత్యధిక ఆదాయం వస్తున్నా గోశాలలో మాత్రం వసతుల కల్పనపై ఆలయ అధికారులు దృష్టి పెట్టడం లేదు.
రూ.కోట్లు వస్తున్నా..
వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు కోడెమొక్కులు చెల్లిస్తుంటారు. కోడె మొక్కు టికెట్ ధర రూ.200 ఉంది. అలాగే కోడెమొక్కుల ద్వారా స్వామికి వచ్చే ఆదాయం ఏడాదికి దాదాపు రూ.22 కోట్ల వరకు ఉంటుంది. ఇంత ఆదాయం వస్తున్నా గోశాలలో మాత్రం సౌకర్యాలు లేవు. గోశాలల్లోని కోడెల సంరక్షణకు ఏటా రూ.2 కోట్ల వరకు వెచ్చిస్తున్నా, ఈ నిధులతో ఎలాంటి సౌకర్యాలు కలి్పంచలేకపోతున్నారు.
వసతికి మించిన కోడెలు..
రాజన్న ఆలయానికి రెండు గోశాలలు ఉన్నాయి. గుడి చెరువు కట్ట కింద ఉన్న గోశాలలో 150 కోడెలు, 20 ఆవులు ఉన్నాయి. రాజన్నకు మొక్కులు చెల్లించే కోడెలను, ఆవులను ఉంచుతారు. తిప్పాపూర్‌లో రెండో గోశాల ఉంది. ఇక్కడ 300 కోడెల కోసం రేకులòÙడ్డు వేశారు. కానీ ఆరు నెలల క్రితం కోడెలను రిజి్రస్టేషన్ ఉన్న గోశాలకు ఇవ్వకుండా..అధికారులను తప్పుదోవ పట్టించి తీసుకెళ్లడంతో అప్పటి నుంచి ఇతర గోశాలలకు రాజన్న కోడెలు, ఆవులను ఇవ్వడం లేదు. కోడెలను తిప్పాపూర్ గోశాలలోనే సంరక్షిస్తున్నా రు. ఇక్కడ 300 కోడెలకు వసతి ఉండగా..ప్రస్తుతం 1,600 కోడెలు ఉన్నా యి. దీంతో చిన్నపాటి వర్షానికే గోశాల బురదమయం కావడంతో కోడెలు కనీసం పడుకునే పరిస్థితి లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక చోట, రాత్రి నుంచి తెల్లారేవరకు మరో చోట కోడెలను ఉంచుతున్నారు.
తడిస్తే వ్యాధుల బారినపడే అవకాశం ఉంది
వర్షాకాలంలో పశువులు, ఆవులతో జాగ్రత్తగా ఉండాలి. వర్షంలో తడిస్తే బలహీనమై వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. కాళ్లు మెత్తబడి డెక్కల్లో పుండ్లు అవుతాయి. సరిగా తినలేకపోతాయి. ఎప్పటికప్పుడు పేడ తియ్యకపోతే ఏదైనా ఒక్క ఆవుకు రోగం వస్తే అన్ని ఆవులకు సంక్రమించే అవకాశం ఉంది. బురద ఎక్కువైతే కాలు జారి కిందపడే అవకాశాలు ఉన్నాయి. – ప్రశాంత్‌రెడ్డి, మండల పశువైద్యాధికారి, వేములవాడ
త్వరలోనే అందిస్తాం
భక్తులు అందించిన కోడెలను తిప్పాపూర్ గోశాలలో సంరక్షిస్తున్నాము. గోశాలలో పరిమితికి మించి కోడెలు ఉన్నాయి. ఆలయ అధికారులతో కమిటీ నియామకానికి కలెక్టర్‌కు ఫైల్ పంపించాం. కమిటీ ఆదేశాలతో కోడెలను రైతులకు, రిజిస్ట్రేషన్ ఉన్న గోశాలలకు అందిస్తాం. వారం రోజుల్లోగా ఆదేశాలు వస్తాయని అనుకుంటున్నాం. – శ్రీనివాస్, రాజన్న ఆలయ ఏఈవో
Comments
Please login to add a commentAdd a comment