వాటి జోలికెళ్తే కాళ్లు విరగ్గొడతా: బీజేపీ ఎమ్మెల్యే
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు అప్పుడే నోటికి పని చెప్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ ఆవుల విషయమై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'ఎవరైనా ఆవులను కించపరిచినా.. వాటిని చంపినా కాళ్లు విరగ్గొడతా' అని ఆయన హెచ్చరించారు.
ఇటీవల యూపీలో బీజేపీ బంపర్ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. యూపీ సీఎంగా పగ్గాలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే అక్రమ గోవధశాలలపై కొరడా ఝళిపించారు. అక్రమ గోవధశాలలన్నీ మూసేయాలని ఆదేశించారు. శనివారం స్వస్థలం గోరఖ్‌పూర్ పర్యటనకు వెళ్లిన ఆయన.. అక్కడ ఉన్న గోశాలను ప్రత్యేకంగా సందర్శించారు. మొత్తం మీద యోగి ప్రభుత్వం ఆవుల సంరక్షణ విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది.