కబేళాకు తరలిస్తున్న గోవులను కాపాడిన ఎమ్మెల్యే
ఎల్‌బీనగర్: కబేళాకు తరలిస్తున్న గోవులను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులకు పట్టించారు. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం నుంచి లారీలో నగరంలోని బహదూర్‌పురాలోని కబేళాకు గోవులను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన అనుచరులతో కలిసి ఆటోనగర్‌లో అడ్డుకున్నారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టుకున్న లారీలో ఏడు ఆవు దూడలు, 31 కోడె దూడలు ఉన్నాయి. వీటిని నగరంలోని ప్రభుత్వ గోశాలకు తరలించారు. గోవులను తరలిస్తున్న కృష్ణ, గణపతి, బైరాగిలను స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.