పోలీసుల తీరుపై మంత్రి ఆగ్రహం
Published Mon, Jul 24 2017 12:25 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
పోలీసుల దాడిలో గాయపడిన గోసంరక్షక సమితి నిర్వాహకుడికి పరామర్శ
తాడేపల్లిగూడెం: పోలీసుల దెబ్బలతో గాయపడి తాడేపల్లిగూడెం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న గో సంరక్షణ సమితి నిర్వాహకుడు కొండ్రెడ్డి శ్రీనివాసును ఆదివారం మంత్రి పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గో ప్రేమికుడిగా ఉన్న వ్యక్తిని గో మాఫియాతో చేతులు కలిపి, కావాలని ఇరికించి చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తారా అంటూ పోలీసుల తీరును దుయ్యబట్టారు. కర్ణభేరికి దెబ్బతగిలేలా కొడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని పేరును కూడా ప్రస్తావిస్తూ నువ్వేమైనా మోడీవా అంటూ పోలీసులు వ్యంగంగా మాట్లాడిన మాటలు మొబైల్‌లో విన్నానని, చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు తప్పుడు కేసులు బనాయించాలని చూస్తే చూస్తూ ఊరుకోమన్నారు.
చర్యలకు ఆదేశం
గో సంరక్షకులపై అమానుషంగా ప్రవర్తించి, 32 గోవుల మరణానికి కారకులైన దేవరపల్లి, అనంతపల్లి ఎస్సైలపై విచారణ జరపాలని కలెక్టర్, ఎస్పీలను మంత్రి మాణిక్యాలరావు ఆదివారం ఆదేశించారు. ఒడిశా, విశాఖ నుంచి వచ్చిన ఆవులతో కూడిన కంటైనర్లను అడ్డుకుని అనంతపల్లి, దేవరపల్లి పోలీసులకు గోశాల నిర్వాహకులు కొండ్రెడ్డి శ్రీనివాసు అప్పగించారన్నారు. కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి కంటైనర్లను కాకినాడ తదితర ప్రాంతాలకు తరలించి తిరిగి దేవరపల్లి తీసుకువచ్చారని చెప్పారు. దీంతో 36 గంటలపాటు ఆహారం, నీరు లేక ఆవులు దుర్మరణం పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాసు కోరినా గోవులను గోశాలకు పోలీసులు అప్పగించలేదన్నారు. ఈ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై కొవ్వూరు ఆర్డీఓతో ఫోన్‌లో మాట్లాడారు.
ప్రభుత్వ వైద్యం
పోలీసులు కొట్టిన దెబ్బలతో కర్ణభేరి దెబ్బతిన్న గో ప్రేమికుడు రాఘవేంద్రకు ప్రభుత్వపరంగా వైద్య సాయం అందిస్తామని మంత్రి తెలిపారు.
గోవులను ప్రభుత్వానికి అప్పగిస్తా
గో సంపదను సంరక్షించేందుకు నిస్వార్థంగా పనిచేస్తున్న తాను ఇటీవల జరిగిన ఘటనలతో మానసికంగా కలత చెందానని ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమాఖ్య గౌరవ కార్యదర్శి కొండ్రెడ్డి శ్రీనివాసు అన్నారు. ఏడాదిగా వివిధ పోలీసుస్టేషన్ల నుంచి వచ్చిన గోజాతిని పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ సమక్షంలో అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. చట్టాల ప్రకారం కోర్టుల ద్వారా పోరాడి గోవులను రక్షిస్తున్నానని, ఇదే పని ప్రభుత్వ అధికారులు చేయాలని కోరారు.
Advertisement
Advertisement