
సాక్షి, అమరావతి బ్యూరో: కేశవరెడ్డి విద్యాసంస్థలకు తామిచ్చిన అప్పును తిరిగి ఇవ్వకుండా మంత్రి ఆదినారాయణరెడ్డి తమను తిప్పుకుంటున్నారని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన బాధితుడు శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఆరేళ్లుగా అదిగో.. ఇదిగో అంటూ తిప్పుకుంటున్నారు తప్పితే డబ్బులు ఇవ్వట్లేదని వాపోయారు. మంత్రి హామీపై విసుగుచెందిన శ్రీనివాస్‌రెడ్డి, ఆయన తన భార్య హైమావతి, ముగ్గురు సంతానంతో కలసి సచివాలయం గేట్–2 వద్ద పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించారు. అక్కడున్న భద్రతా సిబ్బంది దీన్ని గమనించి అడ్డుకుని ఆయన్ను అక్కడి నుంచి పంపించేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. 2012లో ఓ మధ్యవర్తి ద్వారా కేశవరెడ్డికి రూ. 5 లక్షలు ఇచ్చామని 8 నెలల పాటు వడ్డీ ఇచ్చి తర్వాత నుంచి ఇవ్వడం మానేశారని చెప్పారు. ఈ విషయమై మంత్రి ఆదిని కలవగా డబ్బు తాను చెల్లిస్తానని హామీ ఇచ్చి పలు దఫాలుగా రూ.లక్ష ఇచ్చి తర్వాత చేతులు దులుపుకున్నారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబును కలిసినా, ఆయన కూడా చేస్తాం.. చూస్తాం అన్నారు తప్పితే ఇంతవరకు న్యాయం చేయలేదని వాపోయాడు. నెల రోజుల్లో తమకు రావాల్సిన డబ్బులను ఇప్పించకపోతే కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు.