ఏపీలో విపక్షాల మధ్య పొత్తుల వ్యవహారం కొంత మంది నేతల్ని అయోమయానికి గురి చేస్తోంది. ఎంపీగా పోటీ చేయాలా.. లేక ఎమ్మెల్యేగా పోటీ చేయాలా.. అసలు తన సీటు తనకు దక్కుతుందా అనే అనుమానాలు టీడీపీలో వ్యక్తం అవుతున్నాయి. అక్కడక్కడా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కాషాయ దళంలో చేరిన నేతలు కూడా తమకు అవకాశం వస్తుందా? రాదా? అన్న సందేహాలతో విలవిల్లాడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఆ జిల్లాలో విపక్షాల పరిస్థితి ఎలా ఉంది?
ఉమ్మడి కడప జిల్లాకు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి అదినారాయణరెడ్డి రాజకీయ భవితవ్యం అయనకే అర్థం కావడంలేదు. పైగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు మరి కొంత మంది నేతలను గందరగోళంలోకి నెడుతున్నాయి. ఇందుకు కారణం టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో పొత్తుల వ్యవహారమే కారణం అంటున్నారు. మూడు పార్టీల మధ్య పొత్తుల వ్యవహారంపై ఎంతకీ క్లారిటీ రావడం లేదు.
ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోతే రాజకీయంగా కనుమరుగు అవుతామనే అభద్రతాభావం ఆదినారాయణరెడ్డిని వెంటాడుతోంది. ఎన్నికల పొత్తు సాకుతో జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తానంటూనే, బీజేపీ ఆదేశిస్తే ప్రొద్దుటూరు అసెంబ్లీ లేదా కడప పార్లమెంట్ సీటుకు అయినా పోటీ చేస్తానని ఆయన ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆదినారాయణ రెండు నియోజవర్గాల టీడీపీ నేతల కంట్లో నలుసులా తయారయ్యారు. గతంలో పొత్తు ఉన్నా లేకున్నా టీడీపీ టికెట్ ఖరారైందంటూ ఆది చేసిన ప్రచారం ఇతర నేతల్లో గుబులు రేపింది.
ఆదినారాయణరెడ్డి చేసిన ప్రకటన ఆయన సొంత కుటుంబంలోనే అలజడి రేపుతోంది. అన్న కుమారుడు భూపేష్ రెడ్డి తన రాజకీయ వారసుడు అంటూ 2009 ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయనే సైంధవుడిలా భూపేష్‌రెడ్డిని అడ్డుకుంటున్నారని కుటుంబ సభ్యులనుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదినారాయణ అన్న మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి పోటీ చేసి గతంలో ఓటమిపాలయ్యారు.
తీరా 2004లో దివంగత మహానేత వైఎస్ఆర్ గాలి వీస్తున్న సమయంలో ఆది అడ్డు తగిలి అన్న బదులుగా తను పోటీ చేసి గెలుపొందారు. మళ్లీ ఇప్పుడు అయన తనయుడు విషమయంలోను అదే చేస్తున్నాడంటూ కుటుంబం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వెంటనే బీజేపీలో చేరిపోయారు.
ఇక తనకు బాబాయ్ అడ్డు ఉండదని భావించిన భూపేష్‌రెడ్డి ఏడాది క్రితం జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి బాధ్యతలను తీసుకున్నారు. ఇంతలో జమ్మలమడుగు స్థానం బీజేపీకి కేటాయించాలంటూ ఆదినారాయణ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆది చర్యలు దేవగుడి కుటుంబంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భూపేష్ నాయకత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మెజార్టీ కుటుంబ సభ్యులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. కుటుంబం నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను అంచనా వేసిన ఆది ప్రొద్దుటూరులో అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం సాగుతోంది.
ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరుకు మారతారనే ప్రచారం అక్కడ టిక్కెట్లు ఆశిస్తున్నవారిలో టెన్సన్ పెంచుతోంది.ప్రొ ద్దుటూరు టీడీపీటికెట్ కోసం నలుగురు పోటీ పడుతున్నారు. ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సురేష్‌నాయుడు సీటు ఆశిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఆ సీటుపై బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి కన్ను పడింది.
ఇక్కడ టికెట్ కోసం నలుగురు పోట్లాడుకోవడం సాకుగా చూపించి..పొత్తులో భాగంగా బీజేపీకి ప్రొద్దుటూరు సీటు కేటాయించాలనే దిశగా ఆదినారాయణరెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎత్తుగడలు వేయడంలో దిట్టగా పేరున్న ఆదినారాయణరెడ్డి కుయుక్తులు కలిసి వస్తాయో...లేక బెడిసి కొడతాయో వేచిచూడాల్సిందే..
Comments
Please login to add a commentAdd a comment