సాక్షి ప్రతినిధి కడప : టీడీపీ నేలవిడిచి సాము చేసింది. ప్రజా శ్రేయస్సును విస్మరించి పాలకపక్షం స్వార్ధానికి అగ్రాసనమేసింది. పోల్ మేనేజ్‌మెంట్ నేర్పుంటే గెలుపొందుతామనే ధీమాతో వ్యవహరించింది. ఇదే? దిశగా టీడీపీ అధినేత పావులు కదిపారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆదినారాయణరెడ్డి పార్టీలో చేర్చుకున్నారు. చంద్రబాబు అంచనాలకు తగ్గట్లుగా ఆ తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదినారాయణ వ్యూహం పన్నారు. జిల్లాలోని 831 మంది సభ్యులున్న ఎన్నికల్లో సామ దాన దండోపాయాలను ప్రదర్శించారు. ఫలితంగా ఆ ఫలితాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ప్రత్యక్షంగా పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడి, దాదాపు రూ.100కోట్లు పైగా ఖర్చు చేసి ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుంది. అప్పట్లో 38ఏళ్లు రాజకీయ చరిత్రను 38ఓట్లతో కూల్చామని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి విర్రవీగేవారు. టీడీపీ నేతలు ‘వాపు చూసి బలుపు’అని భ్రమించారు. ఆపై నిస్సిగ్గుగా ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన్ప్పటికీ ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టారు. అమాత్య పదవి రాగానే అంతా తానై టీడీపీలో చక్రం తిప్పారు. అదే ఇప్పుడు పార్టీని నాశనం చేసిందని ఆ పార్టీ సీనియర్లు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు.
ఆది తీరుకు తీర్పు...
పులివెందుల వేదికగా వైఎస్ కుటుంబాన్ని దూషిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు తనకు అగ్రపీఠం వేస్తారని ఆదినారాయణ రెడ్డి భావించారు. అధికారానికి ఆయనలోని అహంకారం జత కలిసింది. అప్పటినుంచి వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. 2017 జనవరి 12న సింహాద్రిపురం మండలం పైడిపాళెం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు, ప్రజలు సాక్షిగా వైఎస్ కుటుంబసభ్యుల్ని చెప్పుతో కొట్టాలని మంత్రి బాహాటంగా వ్యాఖ్యానించారు. ఈ మాటలకు యావత్తు ప్రజానీకం విస్తుపోయారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఎంపికై ఆ పార్టీ పదవి అనుభవిస్తూ ఆదిరించిన కుటుంబాన్ని దూషించడాన్ని జిల్లా వాసులు తట్టుకోలేకపోయారు. కలత చెందారు. తర్వాత కూడా ఆది మరింతగా రెచ్చిపోయారు. తాను మాత్రమే వైఎస్ కుటుంబానికి దీటుగా నిలవగలనే స్థాయిలో ప్రతిసందర్భంలోనూ విపరీత వ్యాఖ్యానాలు చే?సేవారు. సమయం కోసం జనం నిరీక్షించారు. తాజా ఎన్నికల్లో ప్రజలు తీర్పుతో బదులిచ్చారు. ఆదితో టీడీపీ అభ్యర్థులందరినీ దారుణంగా ఓడించారు. 2014 ఎన్నికల్లో వరకూ ప్రత్యక్ష రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని శ్రీనివాసులరెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి చేతిలో 1,90,323 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
తాజా ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి స్వయంగా పోటీచేసి అవినాష్‌రెడ్డి చేతిలో 3,80,976 ఓట్లు తేడాతో ఓడిపోయారు. జమ్మలమడుగులోనూ ఇలాంటి అనుభవం ఎదురైంది. టీడీపీ అభ్యర్థి 51,641 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీనిని బట్టి ఆది పట్ల ప్రజలు ఏ స్థాయిలో కసితో ఉన్నారో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులంటున్నారు. ఆదినారాయణరెడ్డి చెప్పినట్లుగా ప్రజలు వైఎస్ కుటుంబ సభ్యుల్ని కాకుండా దేవగుడి కుటుంబసభ్యుల్ని ఓట్ల ద్వారా తొమ్మిదిన్నర్ర చెప్పుతో కొట్టారని వారు విశ్లేషిస్తున్నారు. ఆదికి ఆరు గురు సోదరులు, ఇరువురు రాజకీయ వారసులు, బావ.. మొత్తం తొమ్మిది మంది ఒక్కో ప్రాంతానికి ఇన్‌ఛార్జిగా వ్యవహరించి రాజకీయాలు చేశారు. ఆదినారాయణరెడ్డి చెప్పినట్లే 9మందికి తొమ్మిది చెప్పులు, వీరినే నమ్ముకొని రాజకీయాలు చేసిన రామసుబ్బారెడ్డికి అరచెప్పు గుర్తుంచుకునేలా ప్రజలు తీర్పు చెప్పారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. కడపయాసలో చెప్పాలంటే టీడీపీ దిబ్బలమీద కోడిని తీసుకువచ్చి 2014లో పోటీచేయిస్తే రెండు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయింది. రాజకీయాల్లో తనకే చతురత ఉందని, వరుసగా మూడుసార్లు తాను కాబట్టే జమ్మలమడుగులో గెలిచానని భావించే ఆదినారాయణరెడ్డికి ఈసారి ఎంపీ ఎన్నికల్లో 3.80లక్షల ఓట్ల తేడా చిత్తుగా ఓడిపోయారు. దీనికి కారణం ఆయన వ్యవహారశైలేనని అభిప్రాయం పార్టీలో ఉంది.
మదనపడుతున్న పీఆర్ వర్గీయులు...
తొలినాళ్ల నుంచి టీడీపీని నమ్ముకొని రాజకీయాలు చేసిన కుటుంబాన్ని కాదనీ, వైరిపక్ష నేతను అధినేత చంద్రబాబు దరికి చేర్చుకున్నప్పుడే ధిక్కరించాల్సిందని సీనియర్లు ఇప్పుడు మదనపడుతున్నారు. ఎమ్మెల్యే సీటు కావాలంటే ఎమ్మెల్సీ పదవీత్యాగం చేయాలని షరతు పెట్టినప్పుడైనా ధిక్కరించి, పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తే మర్యాద దక్కేదని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయులు మదనపడుతోన్నారు. ఆదినారాయణరెడ్డి కుటుంబసభ్యులతో కలిసి పీఆర్ కుటుంబసభ్యులు ప్రచారం చేయడంతోనే తమ కొంపమునిగిందంటున్నారు. వైఎస్ కుటుంబానికి జమ్మలమడుగులో అపారమైన అభిమానులున్నారు. వైఎస్ కుటుంబాన్ని ఆదినారాయణరెడ్డి టార్గెట్ చేస్తూ దూషించిన ఫలితం తమపై పడిందని వారు చెబుతున్నారు. జిల్లాలో టీడీపీ భారీ ఓటమికి ఆది ప్రధాన కారకుడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment