పాతబస్టాండ్ సమీపంలో వైఎస్సార్సీపీ నాయకుల వాహనాలను నిలిపివేస్తున్న పోలీసులు
పోలింగ్ బూత్ వద్ద బూతులు తిట్టిన కూటమి అభ్యర్థి ఆదినారాయణరెడ్డి
మైలవరం ఎ.కంబాలదిన్నెలో వైఎస్సార్సీపీ నాయకుడి కారుపై దాడి
జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్: ఎన్డీఏ కూటమి అభ్యర్థి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో సోమవారం సాయంత్రం 6 గంటలు దాటాక నవాజ్ కట్ట సమీపంలోని 116, 117 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు బారులు తీరి ఉన్నారు. అధికారులు వారికి స్లిప్పులు ఇచ్చి పోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో డీఎస్పీ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. ఇదే అదనుగా భావించిన ఆది, భూపేష్ వర్గీయులు రాళ్లతో దాడులు చేయించారు.
ఈ దాడుల్లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తలపై గాయమైంది. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని కాపాడుకునేందుకు ఎదురు దాడి చేశారు. సుధీర్‌రెడ్డిపై రాళ్ల దాడి జరిగిందన్న విషయం తెలుసుకున్న పట్టణంలోని నాయకులు, కార్యకర్తలు భారీగా ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు హృషి కేశవరెడ్డి ఎమ్మెల్యేను పరామర్శించటానికి వెళుతున్న సమయంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న టీడీపీ కార్యాలయం వద్ద గూమిగూడి ఉన్న కార్యకర్తలు రాళ్లతో దాడులు చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
మైలవరం మండలం చేరెడ్డి చెన్నకేశవరెడ్డికి చెందిన కారును ఎ.కంబాలదిన్నె గ్రామానికి చెందిన టీడీపీ, బీజేపీ కార్యకర్తలు దాడి చేసి కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై ఆదినారాయణరెడ్డి వర్గీయులు దాడి చేయగా.. ఎమ్మెల్యేకు బలమైన గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంకటేశ్వర కాలనీ వద్ద గల 116, 117 బూత్‌ల వద్దకు బలగాలను మోహరించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలంతా ఎమ్మెల్యే కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. ముద్దనూరు మండలం నుంచి మేనమామ అయిన మునిరాజారెడ్డి తన అనుచరులతో జమ్మలమడుగుకు చేరుకున్నారు. భారీగా కార్యకర్తలు వస్తుండటంతో టీఎన్ఆర్ థియేటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment