మీకేం కావాలో చెప్పండి చేసి పెడతా...
అడ్డు నిలిస్తే ఓర్చుకునేది లేదు
ఎప్పటిలాగే ఏకపక్షంగానే పోలింగ్ ఉండాలి
దేవగుడి పల్లెల్లో హెచ్చరికలు చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి
వచ్చేది ఉమ్మడి ప్రభుత్వమే.. పాత రోజులు రానీయొద్దు
నియోజకవర్గవ్యాప్తంగా వార్నింగ్‌లు ఇస్తున్న వైనం
సాక్షి ప్రతినిధి, కడప: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే, దరిదాపుల్లో కూడా నిలవలేం. అవకాశం ఉన్న చోట పోలింగ్ ఏకపక్షంగా నిర్వహించుకునే చర్యలు చేపట్టాలి. అందుకు ఎవరి స్థాయిలో వారు పనిచేయండి. నా ప్రమేయం అవసరమైన చోట చెప్పండి. నేనే స్వయంగా రంగంలోకి దిగుతా. నయానో.. భయానో ఈమారు అనుకూలంగా మలుచుకోవాలి. ఎవరి పాత్ర వారు సమర్థవంతంగా నిర్వర్తించండి. మరీ ముఖ్యంగా ఈ ఏడు గ్రామాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.. అని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులకు దిశా–నిర్దేశం చేశారు. ఆపై బెదిరింపుల పర్వానికి తెరలేపుతున్నారు.
దేవగుడి పరిసర ప్రాంతాలైన గొరిగెనూరు, ధర్మాపురం, సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు, సుగమంచిపల్లె, శేషారెడ్డిపల్లె, శిరిగేపల్లె గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరులుగా ఉన్నప్పుడు ఆయా గ్రామాల ప్రజలు దేవగుడి కుటుంబానికి మద్దతుగా ఉండేవారు. దేవగుడి సోదరులు తెలుగుదేశం పారీ్టలో చేరిన తర్వాత అదే గ్రామాలకు చెందిన వారు వైఎస్ కుటుంబం వెంట నడుస్తూ వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలిచారు. తాజాగా బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి తెరపైకి వచ్చాక, ఇప్పుడు అవే గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సోదరులను ఆయా నేతలపైకి ఉసిగొల్పారు. సౌమ్యంగా మద్దతు కోరండి, డబ్బు ఆశ చూపండి, అప్పటికీ మీమాట వినని వారితో నేను స్వయంగా మాట్లాడతా.. తర్వాత దౌర్జన్యం చేసేందుకు కూడా వెనుకడవద్దని వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే ఆ ఏడు గ్రామాలకు చెందిన నాయకులతో వివిధ సందర్భాల్లో మాట్లాడుతూ మంచిగా మద్దతు కోరుతున్నట్లు సమాచారం. రాబోవు రోజుల్లో మరింత స్పీడు పెంచి భయపెట్టుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తే...
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్తే దరిదాపుల్లో కూడా పోటీలో నిలువలేమనే అంచనాకు దేవగుడి సోదరులు వచ్చినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో దాదాపు 87 శాతం ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందినట్లు గుర్తించారు. ఓటుకు వెళ్తే అభ్యర్థులతో నిమిత్తం లేకుండా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా వైఎస్సార్‌సీపీకి మద్దతు లభిస్తున్నట్లు గ్రహించారు. ఇక పాత తరహాలో పోలింగ్ చేపట్టకపోతే ఉపయోగం లేదనే అంచనాకు వచ్చారు. ఈ క్రమంలోనే మైలవరం మండలంలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ఓ సర్పంచ్‌పై బెదిరింపులకు దిగినట్లు తెలిసింది.
వైఎస్సార్‌సీపీకి ప్రచారం వరకే పరిమితం కావాలని, పోలింగ్‌కు మూడు రోజుల ముందు నుంచి గ్రామంలో ఉండొద్దని హెచ్చరించినట్లు తెలిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే సూత్రాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. పాత రోజులను గుర్తు చేయవద్దనే తరహాలో బెదిరిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. పరిస్థితిని బట్టి డబ్బులకు మెత్తబడే వారిని డబ్బుతో వశపరుచుకోవాలని, అలా కాదన్నవారి విషయాలపై దౌర్జన్యాకు సైతం వెనుకాడవద్దనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటి నుంచే పటిష్టమైన చర్యలు చేపట్టి గ్రామస్థాయి నేతలు భయభాంత్రులకు గురి కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment