సారూ..నా భర్తను విడిపించండి | Please Leave My Husband | Sakshi
Sakshi News home page

సారూ..నా భర్తను విడిపించండి

Published Wed, Jun 6 2018 9:05 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

Please Leave My Husband  - Sakshi

తన భర్తను విడిపించాలని మంత్రిని కోరుతున్న మహిళ పద్మమ్మ 

పరిగి : పోలీసులు అరెస్టు చేసిన తన భర్తను విడిపించాలని పరిగి మండల పరిధిలోని జాఫర్‌పల్లికి చెందిన పద్మ అనే మహిళ మంత్రి మహేందర్‌రెడ్డికి విన్నవించింది. మంగళవారం మండల పరిధిలోని జాఫర్‌పల్లిలో ఏర్పాటు చేసిన గోదాముల ప్రారంభోత్సవానికి మంత్రి విచ్చేయగా ఆయనకు మొరపెట్టుకుంది. అయితే మంత్రి వచ్చే కంటే ముందే గోదాములు నిర్మించిన సమయంలో చిన్నపాటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

జాఫర్‌పల్లికి చెందిన పీఏసీఎస్‌ డైరక్టర్‌ లాల్‌కృష్ణ ప్రసాద్‌ మంత్రి కార్యక్రమానికి ముందు హల్‌చల్‌ చేశాడు. తనతో పాటు గ్రామస్తులకు చేసిన పనులు, మెటీరియల్‌కు సంబంధించి కాంట్రాక్టర్‌ డబ్బులు ఇవ్వాలని పేర్కొన్నాడు. డబ్బులు ఇవ్వకుండా గోదాములు ప్రారంభిస్తే తమ డబ్బులు ఎవరిస్తారని అక్కడే ఉన్న కాంట్రాక్టర్‌తో వాగ్వాదానికి దిగాడు.

అక్కడే ఉన్న కొందరు టీఆర్‌ఎస్‌ నాయకులు కల్పించుకుని మంత్రి కార్యక్రమంలో గొడవ చేయొద్దని ఏమైనా ఉంటే తరువాత చూసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో వాగ్వాదం ఎక్కువైంది. మరికొద్దిసేపట్లో మంత్రి వస్తాడనగా పోలీసులు లాల్‌కృష్ణను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తలరించారు. కొద్దిసేపటికే మంత్రి రావటంతో లాల్‌కృష్ణ ప్రసాద్‌ భార్య తన భర్తను విడిపించాలని మంత్రిని కలిసి మొరపెట్టుకుంది. పోలీసులతో మాట్లాడతానని మంత్రి చెప్పి కార్యక్రమం ముగించుకని వెళ్లి పోయారు. 

ఇద్దరిపై కేసు నమోదు 

మంత్రి పర్యటన సమయంలో కాంట్రాక్టర్‌ను బెదిరించటంతో పాటు అతనితో గొడవకు దిగారనే కారణంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేయటంతో పాటు వారిపై కేసు నమోదు చేశారు. జాఫర్‌పల్లికి చెందిన లాల్‌కృష్ణప్రసాద్, అదే గ్రామానికి చెందిన వెంకటయ్యలపై కేసు నమోదు చేశామని ఎస్సై కృష్ణ తెలిపారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మరో నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement