మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి చంద్రకాంత్ పాటిల్(ఫైల్‌ఫోటో)
ముంబై : గతుకుల రోడ్డు వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి అనడం సమంజసం కాదంటున్నారు మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మినిస్టర్ చంద్రకాంత్ పాటిల్. విలేకరుల సమావేశంలో భాగంగా ‘ఈ మధ్య కాలంలో ముంబైలో జరుగుతున్న యాక్సిడెంట్‌లకు గతుకుల రోడ్లే కారణమంటున్నారు దీనిపై మీ అభిప్రాయం తెలపండని’ అడగ్గా చంద్రకాంత్ ఇలా అసహనం ప్రదర్శించారు.
గత నెల రోజుల్లో గతుకుల రోడ్ల వల్ల ఆరుగురు ముంబై వాసులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐదుగురు కళ్యాణి ప్రాంతానికి చెందిన వారు కాగా మరొకరు నావీ ముంబై వాసి. వీరందరు రోడ్డు మీద ఉన్న గతుకుల కారణంగానే పట్టు తప్పి ప్రమాదాలకు గురయ్యారు. ఈ మధ్య కాలంలో ముంబైని భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా రోడ్డు మీద ఉన్న గతుకులు నీటితో నిండిపోయి, కనిపించకుండా అయిపోయాయి.
దాంతో అక్కడ గుంత ఉందనే విషయం ప్రయాణికులకు తెలిసే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా పట్టు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు బారిన పడుతున్నది ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే కావడం గమనార్హం.
ఈ విషయం గురించి విలేకరులు చంద్రకాంత్‌ను అడగ్గా ‘ఆయన మీరు గతుకుల రోడ్ల వల్లనే ఈ ప్రమాదాలు జరిగాయని అంటున్నారు. కానీ అదే రోడ్ల మీద ప్రతిరోజు 5 లక్షల మంది నిత్యం తిరుగుతుంటారు. మరి వారంతా క్షేమంగానే ఉన్నారు కదా. కేవలం రోడ్ల మీద ఉన్న గతుకుల కారణంగానే ప్రమాదాలు జరిగాయనడం సబబు కాదు’ అన్నారు.
మరి సోషల్ మీడియాలో ప్రజలు ఈ గతుకుల రోడ్ల గురించి మాట్లాడుకుంటున్నారని అడగ్గా ‘ఈ మధ్య కాలంలో ప్రతి చిన్న విషయం గురించి ప్రతికూలంగా మాట్లడటం ఫ్యాషన్ అయింది. అయినా పోనుపోను వాళ్లే వారి అభిప్రాయాన్ని మార్చుకుంటారని’ తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం త్వరలోనే ఎక్స్‌గ్రేషియా అందిస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment