Chandrakant Patil
-
చంద్రకాంత్ పాటిల్‌పై సిరా దాడి
ముంబై: ఇటీవలే మహాత్మాపూలే, అంబేడ్కర్‌లపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్‌పై గుర్తు తెలియని ఓ వ్యక్తి సిరా చల్లాడు. పింప్రీ చించ్వడ్లో శనివారం ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని బయటకి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. అనంతరం సిరా చల్లిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ వ్యక్తి ఏ సంస్థకు సంబంధించినవారన్నది తెలియరాలేదు. మంత్రి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని సిరా దాడికి పాల్పడినట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. ఔరంగాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి పాటిల్ మాట్లాడుతూ.. విద్యాలయాల అభివృద్ధి కోసం అంబేడ్కర్, పూలేలు ప్రభుత్వ నిధులను కోరలేదన్నారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించేందుకు వారు ప్రజల నుంచి డబ్బులు అడుకున్నారని వ్యాఖ్యానించారు. అడుక్కోవడం అనే పదం వాడటం వివాదాస్పదంగా మారినట్లు తెలుస్తోంది. వీడియో ప్రకారం ఓ వ్యక్తి ఆకస్మికంగా పాటిల్ ముందుకు వచ్చి సిరా చల్లాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మరోవైపు.. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు పాటిల్. తనపై సిరా దాడి జరిగినందుకు బాధపడటం లేదని స్పష్టం చేశారు. ‘అబేడ్కర్, పూలేలను నేను ఎప్పుడు విమర్శించాను? వారు ప్రభుత్వ సాయం కోసం వేచి చూడకుండా.. స్కూల్స్ ప్రారంభించేందుకు ప్రజలనుంచి తీసుకున్నారని చెప్పాను. కోర్టులో న్యాయం కోసం అడుకున్నాను అంటే తప్పవుతుందా? సిరా దాడి వల్ల ఏం జరగదు. నా చొక్కా మార్చుకుని వేరే కార్యక్రమానికి వెళ్లాను.’ అని తెలిపారు పాటిల్. #WATCH | Ink thrown at Maharashtra cabinet minister Chandrakant Patil in Pimpri Chinchwad city of Pune district, over his remark on Dr BR Ambedkar and Mahatma Jyotiba Phule. pic.twitter.com/FBRvRf2K4g — ANI (@ANI) December 10, 2022 ఇదీ చదవండి: క్యాబ్‌లోంచి చిన్నారిని విసిరేసి.. తల్లిపై వేధింపులు! -
బీజేపీ చీఫ్ షాకింగ్ కామెంట్స్.. మహారాష్ట్ర సీఎం షిండేకు పదవీ గండం!
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేకు షాకిస్తూ శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఏక్నాథ్ షిండే సీఎంగా, బీజేపీ మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, బీజేపీ నేత ఫడ్నీవీస్ కాకుండా ఏక్నాథ్ షిండే సీఎం కావడంపై బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాటిల్ తన అసంతృప్తి వెళ్లగక్కారు. ఈ సందర్బంగా పాటిల్ మాట్లాడుతూ.. దేవేంద్ర ఫడ్నవీస్‌కు బదులు శివసేన నేత ఏక్నాథ్ షిండే సీఎంగా బాధ్యతలు తీసుకోవాలని పార్టీ బరువెక్కిన గుండెతో నిర్ణయం తీసుకుందని అన్నారు. ఏక్నాథ్ షిండేకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడంపై తాము బాధపడ్డామని అన్నారు. మరో ఆప్షన్ లేకపోయినందువల్లే అధిష్టానం నిర్ణయం స్వీకరించామని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలందరూ కలత చెందరాని తెలిపారు. అయితే, పార్టీ ప్రభుత్వ స్థిరత్వాన్ని కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర పార్టీ చీఫ్ అయిన పాటిల్ ఇలా సీఎంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు భారీ షాక్ తగిలింది. ఇదిలా ఉండగా.. ఆదిత్య థాక్రే శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం ఎంతో కాలం సాగదని, త్వరలోనే కూలిపోతుందని అన్నారు. కాగా, థాక్రే వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే మహారాష్ట్ర బీజేపీ చీఫ్ పాటిల్ తన అసహనాన్ని బయటపెట్టడం విశేషం. Maharashtra BJP chief Chandrakant Patil says Eknath Shinde made CM with ‘heavy heart’ | Mumbai News https://t.co/hyFub38gON — mak Bugs (@News_bugs) July 24, 2022 ఇది కూడా చదవండి: 'ఆ రెస్టారెంట్ స్మృతి ఇరానీ కూతురిదే.. ఇదిగో సాక్ష్యం' -
మహిళా ఎంపీపై బీజేపీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు
మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేసి పాటిల్ వివాదంలో పడ్డారు. ఆయన వ్యాఖ్యలపై ఎన్సీపీ నేతలు మండిపడుతున్నారు. వివరాల ప్రకారం.. స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లపై స్టే విధించడంతో గత కొన్ని నెలలుగా మహారాష్ట్రలో పాలిటిక్స్ వేడెక్కాయి. ఓబీసీ రిజర్వేషన్ల కోసం న్యాయస్థానాల్లో జరిగిన పోరాటంలో ఉద్దవ్ థాక్రే సర్కార్ ఓడిపోయిందని బీజేపీ ఆరోపిస్తుండగా, కేంద్రమే సరైన డేటాను అందించడం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమర్తె, ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ.. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌కు ఓబీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నుంచి ఎలా ఉపశమనం లభించిందని ప్రశ్నిస్తూ.. ‘‘ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి ‘ఎవరినో’ కలిశారు.. అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియడం లేదు. మరో రెండు రోజుల్లో ఓబీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది’’ అని తెలిపారు. ఆమె వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఓబీసీ రిజర్వేషన్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వంపై నిరసనకు నేతృత్వం వహిస్తున్న పాటిల్.. ‘మీకు రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికి వెళ్లి వంట చేసుకోండి’ అని సూలేను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పాటిల్ వ్యాఖ్యలపై సుప్రియా సూలే భర్త సదానంద్ సూలే స్పందించారు. పాటిల్ మాటలను ఖండిస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ‘‘ నా భార్యను చూసి గర్వపడుతున్నాను. ఆమె ఒక గృహిణి, తల్లి. అలాగే.. సక్సెస్ఫుల్ పొలిటీషియన్. బీజేపీ నేతలు స్త్రీ ద్వేషులు. వీలైనప్పుడల్లా స్త్రీలను వారు కించపరుస్తారనే ఉంటారు. భారతదేశంలోని అనేక మంది కష్టపడి పనిచేసే, ప్రతిభావంతులైన మహిళలలో నా భార్య కూడా ఒకరు. చంద్రకాంత్ పాటిల్ మాటలు మహిళలందరికీ అవమానకరమే.’’ అని మండిపడ్డారు. ఇది కూడా చదవండి: అసెంబ్లీలో అఖిలేష్ నోట అసభ్యకరమైన పదాలు.. సీఎం యోగి రియాక్షన్ ఇది -
ప్రధాని మోదీపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు, ట్వీట్ వైరల్
Prakash Raj Satirical Comments On Modi: నటుడు ప్రకాశ్ రాజ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. ఓ సమావేశంలో చంద్రకాంత్ పాటిల్ ప్రధాని మోదీ రెండు గంటలే నిద్రపోతారని, ఒక రోజులో 22 గంటల పాటు ఆయన పనిచేస్తుంటారని అన్న వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ సెటైరికల్‌గా స్పందించాడు. చదవండి: భార్యతో స్టార్ హీరో రొమాంటిక్ డేట్, ఫస్ట్‌టైం పబ్లిక్‌గా.. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ ‘దయచేసి కొంచెం కామన్సెన్స్ ఉపయోగించండి. నిద్రపోలేకపోవడం అనేది ఓ జబ్బు. వైద్య పరిభాషలో దీన్ని ఇన్సోమ్నియా అంటారు. దాని గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు. ఆ జబ్బుతో బాధపడుతున్న మీ నాయకుడికి చికిత్స అందించండి’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. కాగా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రకాశ్ రాజ్ ప్రధాని మోదీ, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పిస్తుంటాడనే విషయం విధితమే. Please have some common sense… not able to sleep is a medical condition called INSOMNIA.. it should be treated .. not bragged about ..🙏🏻🙏🏻 please take care of your leader #justasking pic.twitter.com/CPj7rP7F6Z — Prakash Raj (@prakashraaj) March 22, 2022 -
త్వరలో బీజేపీకి కొత్త సారథి?
సాక్షి, ముంబై: బీజేపీ మహారాష్ట్ర ప్రదేశ్ అధ్యక్షుడిని మార్చబోతున్నారని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ పదవి ఆశిస్తున్న పలువురు ఆశావహులు ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేయడం ప్రారంభించారు. మరోపక్క ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్న చంద్రకాంత్ పాటిల్ కూడా ప్రదేశ్ అధ్యక్ష పదవిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ అధ్యక్షుడిని మార్చాలని అధిష్టానం నిర్ణయిస్తే ఈ పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై పార్టీలో చర్చ మొదలైంది. పార్టీలో యువ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీలోని యువ నేతలు ఆశిష్ శేలార్, చంద్రశేఖర్ బావన్‌కుళే ప్రదేశ్ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఢిల్లీ స్థాయిలో జోరుగా పైరవీలు చేస్తున్నారు. బీజేపీ రూపొందించుకున్న నియమ, నిబంధనల ప్రకారం ప్రదేశ్ అధ్యక్ష పదవీ కాలం మూడేళ్ల వరకు ఉంటుంది. చంద్రకాంత్ పాటిల్ 2019 జూలైలో బీజేపీ ప్రదేశ్ అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టారు. నియమాల ప్రకారం ఆయన పదవీ కాలం 2022 జూలై వరకు ఉంటుంది. కానీ, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఒక సంవత్సరం ముందే ఆయన్ను మార్చనున్నట్లు గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పైగా, రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ బీజేపీ నాయకులు తరుచూ ఢిల్లీ వెళ్లి వస్తుండటంతో ఆ ఊహాగానాలు నిజమే కావచ్చనే సందేహాలు వెలువడుతున్నాయి. ఇదిలావుండగా గత నెలలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఢిల్లీ వెళ్లి వచ్చారు. అక్కడ ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. బీజేపీ ప్రదేశ్ ప్రస్తుత అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ కూడా ఇటీవల అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఆ తరువాత ఆశిష్ శేలార్, చంద్రశేఖ్ బావన్‌కుళేలు కూడా వెళ్లి వచ్చారు. ఇలా ఒకరి తరువాత మరొకరు పోటీపడుతూ దేశ రాజధాని నగరానికి వెళ్లి రావడంతో ప్రదేశ్ అధ్యక్షుడి మార్పు ఉండవచ్చని గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లైంది. కాగా, పార్టీ నియమ, నిబంధనలకు కట్టుబడి ఉంటామని, ఆ ప్రకారం చంద్రకాంత్ పాటిల్ మూడేళ్లు పదవిలో కొనసాగుతారని దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే స్పష్టం చేశారు. పాటిల్‌ను మధ్యలో మార్చే ప్రసక్తి లేదని చెప్పారు. ఢిల్లీ వెళ్లి వచ్చినంత మాత్రాన పార్టీలో మార్పులు జరుగుతాయని ఊహించుకోవద్దని, అనవసరంగా వదంతులు ప్రచారం చేయవద్దని మీడియాకు హితవు పలికారు. ప్రదేశ్ అధ్యక్షుడిని మార్చే అంశంపై ఎలాంటి చర్చా జరగలేదని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర బీజేపీకి పాటిల్ నేతృత్వం అసవరమని, మీడియా వదంతులు లేవనెత్తినంత మాత్రాన పార్టీలో ప్రక్షాళన జరగదని పేర్కొన్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటే తప్ప పార్టీలో ఎలాంటి మార్పులు జరగవని స్పష్టం చేశారు. చంద్రకాంత్ పాటిల్ హయాంలోనే విధాన పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో ఆయన్ను మార్చే ఆలోచన ఇప్పట్లో లేదని, పూర్తిగా పదవి కాలంలో కొనసాగుతారని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. -
మళ్లీ ఎన్నికలా; ఆరోజు పరిస్థితి మారిపోతుంది!
ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భేటీ వెనుక ఎటువంటి రాజకీయ కారణాలు లేవన్న బీజేపీ స్వరం మార్చింది. రెండు ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సమావేశమైనపుడు కచ్చితంగా రాజకీయాల గురించి మాట్లాడతారని, ఇప్పుడు కూడా అదే జరిగిందని పేర్కొంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావాలని ఎవరూ కోరుకోరు. కానీ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించగలవా? అస్థిరత నెలకొన్న సమయంలో ఎన్నికలకు మించి వేరేమార్గం ఉండదు కదా. ఒకానొక రోజు పరిస్థితి మారిపోతుంది. నిజానికి ఇద్దరు బడా నాయకులు కలిసినపుడు రాజకీయాల గురించే చర్చిస్తారు. చాయ్, బిస్కెట్ల గురించి కాదు. అయితే ఆ భేటీకి సరైన ముగింపు లభించలేదు’’ అంటూ శనివారం ఫడ్నవిస్- రౌత్ భేటీ గురించి వ్యాఖ్యానించారు. (చదవండి: సంజయ్ రౌత్ వ్యాఖ్యలు; సీఎం ఠాక్రేతో పవార్ భేటీ!) కాగా సంజయ్ రౌత్, ఫడ్నవిస్ శనివారం హోటల్లో శనివారం రహస్యంగా సమావేశమైన విషయం తెలిసిందే. ఈ విషయం బయటకు పొక్కడంతో కేవలం సామ్నా పత్రిక కథనం కోసం సంజయ్ రౌత్, ఫడ్నవిస్‌ను ఇంటర్వ్యూ చేయాలని భావించారని, అందుకే ఆయనను కలిశారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ రౌత్.. ‘‘దేవేంద్ర ఫడ్నవిస్ మా శత్రువేమీ కాదు. గతంలో ఆయనతో కలిసి పనిచేశాం. సామ్నా ఇంటర్వ్యూ కోసమే ఆయనను కలిశాను’’అని చెప్పుకొచ్చారు. అయితే ఈ భేటీ జరిగిన మరుసటి రోజే శివసేన సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. (శివసేనకు సీఎం, పవార్‌కు పెద్దపోస్టు : బీజేపీ ఆఫర్!) ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రమంత్రి సోమవారం ముంబైకి చేరుకున్న రాందాస్ అథవాలే.. పాతమిత్రపక్షం శివసేనను తిరిగి ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాక రానున్న ఏడాదికాలం పాటు ముఖ్యమంత్రి పీఠం సేరకు అప్పగించడమే గాకుండా, కేంద్ర ప్రభుత్వంలోనూ పదవులు కట్టబెడతామని మీడియా ముఖంగా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అథవాలే ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత పాటిల్ ఈ మేరకు స్పందించడం గమనార్హం. దీంతో పాత స్నేహితుడితో జట్టుకట్టి మహారాష్ట్రలో మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోందన్న వార్తలకు బలం చేకూరుతోంది. వ్యవసాయ బిల్లుల నిరసన నేపథ్యంలో అకాళీదళ్ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడం, బిహార్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో రామ్ విలాస్ పాశ్వాన్ దూరం కావడం తదితర అంశాల నేపథ్యంలో సుదీర్ఘకాలంగా మిత్రపక్షంగా కొనసాగిన శివసేనను దగ్గరచేసుకుని కూటమిని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఆయన యూటర్న్ సీఎం..
పూణే : వ్యవసాయ రుణాల మాఫీపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే యూటర్న్ తీసుకున్నారని రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ దుయ్యబట్టారు. సంపూర్ణ రుణ మాఫీని వాగ్ధానం చేసిన ఠాక్రే ఇప్పుడు కేవలం రూ 2 లక్షల వరకే మాఫీని ప్రకటించారని విమర్శించారు. ఏ విషయానికైనా కొన్ని పరిమితులు ఉంటాయని తెలుసని, ప్రకటన చేయడం అమలుపరచడానికి వ్యత్యాసం ఏంటో ఇప్పుడు ఠాక్రేకు అవగతమైందని పాటిల్ ఎద్దేవా చేశారు. ఇక నుంచి యూటర్న్ అంటే ఉద్ధవ్ ఠాక్రే అని ఆయన అభివర్ణించారు. -
అసెంబ్లీ ఎన్నికలు: కమలానికి కొత్త సారథి
సాక్షి, ముంబై: కీలకమైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార బీజేపీ రాష్ట్రానికి నూతన పార్టీ అధ్యక్షుడిని నియమించింది. సీనియర్ నేత, మంత్రి చంద్రకాంత్ పాటిల్‌ను మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు ఆ పదవిలో ఉన్న రోషహేబ్ దేవ్‌కు కేంద్రమంత్రి మండలిలో చోటు దక్కడంతో ఆయన ఆ పదవి నుంచి వైదొలిగారు. దీంతో అధ్యక్ష పదవి చంద్రకాంత్ పాటిల్‌ను వరించింది. పాటిల్ మహారాష్ట్ర అసెంబ్లీలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపుపొందారు. కాంగ్రెస్, ఎన్సీపీలు అత్యంత బలంగా ఉన్న ఈశాన్య మహారాష్ట్రలో పార్టీని బలోపేతం చేసేందుకు అదే ప్రాంతానికి చెందిన పాటిల్‌ను బీజేపీ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 288 స్థానాలున్న ఆ రాష్ట్రా అసెంబ్లీకి సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అద్బుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అదే స్ఫూర్తితో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మంచి విజయాన్ని నమోదు చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే పార్టీ నూతన అధ్యక్ష పదవిని పాటిల్‌కు అప్పగించినట్లు బీజేపీ నేతల సమాచారం. కాగా ఎన్నికల కోసం కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు ఇప్పటికే పొత్తులపై సంప్రదింపులు జరుపుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఎమ్‌ఎన్‌ఎస్పీ చీఫ్ రాజ్ ఠాక్రే యూపీయే చైర్పర్సన్ సోనియా గాంధీతో భేటీ అవ్వడంతో రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కింది. -
గతుకుల రోడ్లే కారణమంటే ఎలా; మంత్రి అసహనం
ముంబై : గతుకుల రోడ్డు వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి అనడం సమంజసం కాదంటున్నారు మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మినిస్టర్ చంద్రకాంత్ పాటిల్. విలేకరుల సమావేశంలో భాగంగా ‘ఈ మధ్య కాలంలో ముంబైలో జరుగుతున్న యాక్సిడెంట్లకు గతుకుల రోడ్లే కారణమంటున్నారు దీనిపై మీ అభిప్రాయం తెలపండని’ అడగ్గా చంద్రకాంత్ ఇలా అసహనం ప్రదర్శించారు. గత నెల రోజుల్లో గతుకుల రోడ్ల వల్ల ఆరుగురు ముంబై వాసులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐదుగురు కళ్యాణి ప్రాంతానికి చెందిన వారు కాగా మరొకరు నావీ ముంబై వాసి. వీరందరు రోడ్డు మీద ఉన్న గతుకుల కారణంగానే పట్టు తప్పి ప్రమాదాలకు గురయ్యారు. ఈ మధ్య కాలంలో ముంబైని భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా రోడ్డు మీద ఉన్న గతుకులు నీటితో నిండిపోయి, కనిపించకుండా అయిపోయాయి. దాంతో అక్కడ గుంత ఉందనే విషయం ప్రయాణికులకు తెలిసే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా పట్టు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు బారిన పడుతున్నది ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే కావడం గమనార్హం. ఈ విషయం గురించి విలేకరులు చంద్రకాంత్‌ను అడగ్గా ‘ఆయన మీరు గతుకుల రోడ్ల వల్లనే ఈ ప్రమాదాలు జరిగాయని అంటున్నారు. కానీ అదే రోడ్ల మీద ప్రతిరోజు 5 లక్షల మంది నిత్యం తిరుగుతుంటారు. మరి వారంతా క్షేమంగానే ఉన్నారు కదా. కేవలం రోడ్ల మీద ఉన్న గతుకుల కారణంగానే ప్రమాదాలు జరిగాయనడం సబబు కాదు’ అన్నారు. మరి సోషల్ మీడియాలో ప్రజలు ఈ గతుకుల రోడ్ల గురించి మాట్లాడుకుంటున్నారని అడగ్గా ‘ఈ మధ్య కాలంలో ప్రతి చిన్న విషయం గురించి ప్రతికూలంగా మాట్లడటం ఫ్యాషన్ అయింది. అయినా పోనుపోను వాళ్లే వారి అభిప్రాయాన్ని మార్చుకుంటారని’ తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం త్వరలోనే ఎక్స్‌గ్రేషియా అందిస్తుందని తెలిపారు. -
మూడు నెలలు.. 639 ఆత్మహత్యలు
సాక్షి, ముంబై : దేశంలో నానాటికి రైతుల అత్మహత్యలు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర శాసన మండలిలో ప్రకటించిన ఘణాంకాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ ఏడాది మార్చి 1 నుంచి మే 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 639 మంది రైతులు అత్మహత్య చేసుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, పునరావాస శాఖమంత్రి చంద్రకాంత్ పాటిల్ మండలిలో తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు శనివారం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న 639 మందిలో ఇప్పటి వరకూ 174 మందికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున నష్టపరిహారం చెల్లించినట్లు మంత్రి ప్రకటించారు. 122 మంది రైతుల ఆత్మహత్యలకు కారణాలేంటో తెలియరాలేదని ప్రభుత్వం అందించే నష్ట పరిహారానికి వారు అర్హులు కారని మంత్రి వెల్లడించారు. రుణమాఫీ, మద్దతు ధర, ఎరువులపై రాయితీలు ఇవ్వకపోవడం మూలంగానే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎన్సీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని మహారాష్ట్ర రైతులు ఇటీవల మహా పాదయాత్రను నిర్వహించిన విషయం తెలిసిందే. రైతులు డిమాండ్లను అమలు చేస్తామని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించిన.. రైతుల ఆత్మహత్యలును మాత్రం ప్రభుత్వం నివారించలేకపోతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. -
పొసగని ‘కాషాయం’ పొత్తు
సాక్షి, ముంబై: శివసేనతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ చర్చలు ప్రారంభించినప్పటికీ ఇరు పార్టీల మధ్య రాజీకుదిరే అవకాశాలు కని పించడం లేదు. శివసేనకు నాలుగు కేబినెట్ మంత్రి పదవులు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఎనిమిది సహాయ మంత్రులు, రాష్ట్ర మంత్రి వర్గంలో మూడు భాగాల్లో ఒక భాగం శివసేనకు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రజా పనుల శాఖ, విద్యుత్, పరిశ్రమలు, నీటి పారుదల తదితర శాఖలు శివసేనకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ శివసేనకు ఉప ముఖ్యమంత్రి లేదా హోం శాఖ లాంటి కీలక పదవులు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. ఈ కారణంగానే శివసేన బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. ఉద్ధవ్ ఏమంటారో.. మరో రెండు, మూడు రోజుల్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టే సూచనలున్నాయి. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఏం నిర్ణయం తీసుకుంటారనే చర్చనీయాంశంగా మారింది. బీజేపీ చేసిన ప్రతిపాదన శివసేనకు ఆమోద యోగ్యంగా లేకపోవడంతో పొత్తు పొసగడం లేదు. ఇదిలా ఉండగా గత శుక్రవారం బీజేపీ సీనియర్ నాయకులు ధర్మేంద్ర ప్రధాన్, చంద్రకాంత్ పాటిల్ ఉద్ధవ్‌తో భేటీ అయ్యారు. తర్వాత కూడా తరుచూ బీజేపీ నాయకులు శివసేనతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇంతవరకు కొలిక్కి రాలేదు. శివసేన ఫార్ములా శివసేన ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ పదవులు డిమాండ్ చేస్తోంది. వీటితోపాటు 1995లో కాషాయకూటమి అధికారంలో వచ్చిన తర్వాత రూపొందించుకున్న ఫార్మూల ప్రకారం ఇప్పుడు పదవుల పంపకం జరగాలని శివసేన పట్టుబడుతోంది. ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నివాసమైన వర్షా బంగ్లాలో బీజేపీ, శివసేన నాయకుల మధ్య మరో దఫా చర్చలు జరిగాయి. శివసేన డిమాండ్ చేస్తున్న పదవులు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేకపోవడంతో సమస్య జటిలమవుతోంది. వివిధ పదవులతోపాటు హోం శాఖ లేదా ఉప ముఖ్యమంత్రి లాంటి కీలక పదవులిస్తే బీజేపీతో జతకట్టేందుకు శివసేన అంగీకరిస్తుండవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. శీతాకాలం ప్రభుత్వానికి గడ్డుకాలమే దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తోంది. ఇప్పటికీ ఆయన కేబినెట్లో కేవలం 10 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి నాగపూర్‌లో శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రతిపక్షాల ప్రశ్నలకు దీటుగా సమాధానమిచ్చేందుకు 10 మంది మంత్రులు కుస్తీపడాల్సి వస్తుంది. ఈ సమావేశాలు ప్రారంభం కాకముందే మంత్రివర్గ విస్తరణ చేయాలని ఫడ్నవిస్ యోచిస్తున్నారు. అందులో శివసేన ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఇప్పట్లో ఆశలు తీరేట్టు లేదు. భవిష్యత్తులో ఫడ్నవిస్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడే ప్రమాదం పొంచి ఉంద నే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
బీజేపీ కొత్త సారధి పాటిల్?
ముంబై: బీజేపీ రాష్ట్ర పగ్గాలు పుణే గ్రాడ్యుయేట్ నియోజక వర్గం ఎమ్మెల్సీ చంద్రకాంత్ పాటిల్‌కు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ ప్రదేశ్ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న దేవేంద్ర ఫడ్నవీస్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి పదవి రేసులో తను లేనని నితిన్ గడ్కరీ స్పష్టం చేయడంతో ఫడ్నవిస్‌కు రాష్ట్ర పగ్గాలు కట్టబెట్టడానికి ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దీంతో ఖాళీకానున్న ప్రదేశ్ అధ్యక్ష పదవిలో పశ్చిమ మహారాష్ట్రకు చెందిన చంద్రకాంత్ పాటిల్‌ను నియమించాలని పార్టీ సీనియర్ నాయకులు యోచిస్తున్నారు. ఇదిలాఉండగా పాటిల్‌కు, జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల మధ్య తత్సంబంధాలున్నాయి. దీంతో ఆ పదవి పాటిల్‌కు కట్టబెట్టేందుకు షా కూడా సానుకూలంగా ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన వెంటనే పాటిల్‌ను ప్రదేశ్ అధ్యక్ష పదవిలో నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.