సాక్షి, ముంబై: కీలకమైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార బీజేపీ రాష్ట్రానికి నూతన పార్టీ అధ్యక్షుడిని నియమించింది. సీనియర్ నేత, మంత్రి చంద్రకాంత్ పాటిల్‌ను మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు ఆ పదవిలో ఉన్న రోషహేబ్ దేవ్‌కు కేంద్రమంత్రి మండలిలో చోటు దక్కడంతో ఆయన ఆ పదవి నుంచి వైదొలిగారు. దీంతో అధ్యక్ష పదవి చంద్రకాంత్ పాటిల్‌ను వరించింది. పాటిల్ మహారాష్ట్ర అసెంబ్లీలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపుపొందారు. కాంగ్రెస్, ఎన్సీపీలు అత్యంత బలంగా ఉన్న ఈశాన్య మహారాష్ట్రలో పార్టీని బలోపేతం చేసేందుకు అదే ప్రాంతానికి చెందిన పాటిల్‌ను బీజేపీ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 288 స్థానాలున్న ఆ రాష్ట్రా అసెంబ్లీకి సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అద్బుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అదే స్ఫూర్తితో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మంచి విజయాన్ని నమోదు చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే పార్టీ నూతన అధ్యక్ష పదవిని పాటిల్‌కు అప్పగించినట్లు బీజేపీ నేతల సమాచారం. కాగా ఎన్నికల కోసం కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు ఇప్పటికే పొత్తులపై సంప్రదింపులు జరుపుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఎమ్‌ఎన్‌ఎస్పీ చీఫ్ రాజ్ ఠాక్రే యూపీయే చైర్‌పర్సన్ సోనియా గాంధీతో భేటీ అవ్వడంతో రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment