పొసగని ‘కాషాయం’ పొత్తు
సాక్షి, ముంబై: శివసేనతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ చర్చలు ప్రారంభించినప్పటికీ ఇరు పార్టీల మధ్య రాజీకుదిరే అవకాశాలు కని పించడం లేదు. శివసేనకు నాలుగు కేబినెట్ మంత్రి పదవులు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఎనిమిది సహాయ మంత్రులు, రాష్ట్ర మంత్రి వర్గంలో మూడు భాగాల్లో ఒక భాగం శివసేనకు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రజా పనుల శాఖ, విద్యుత్, పరిశ్రమలు, నీటి పారుదల తదితర శాఖలు శివసేనకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ శివసేనకు ఉప ముఖ్యమంత్రి లేదా హోం శాఖ లాంటి కీలక పదవులు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. ఈ కారణంగానే శివసేన బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తి కనబర్చడం లేదు.
ఉద్ధవ్ ఏమంటారో..
మరో రెండు, మూడు రోజుల్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టే సూచనలున్నాయి. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఏం నిర్ణయం తీసుకుంటారనే చర్చనీయాంశంగా మారింది. బీజేపీ చేసిన ప్రతిపాదన శివసేనకు ఆమోద యోగ్యంగా లేకపోవడంతో పొత్తు పొసగడం లేదు. ఇదిలా ఉండగా గత శుక్రవారం బీజేపీ సీనియర్ నాయకులు ధర్మేంద్ర ప్రధాన్, చంద్రకాంత్ పాటిల్ ఉద్ధవ్‌తో భేటీ అయ్యారు. తర్వాత కూడా తరుచూ బీజేపీ నాయకులు శివసేనతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇంతవరకు కొలిక్కి రాలేదు.
శివసేన ఫార్ములా
శివసేన ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ పదవులు డిమాండ్ చేస్తోంది. వీటితోపాటు 1995లో కాషాయకూటమి అధికారంలో వచ్చిన తర్వాత రూపొందించుకున్న ఫార్మూల ప్రకారం ఇప్పుడు పదవుల పంపకం జరగాలని శివసేన పట్టుబడుతోంది. ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నివాసమైన వర్షా బంగ్లాలో బీజేపీ, శివసేన నాయకుల మధ్య మరో దఫా చర్చలు జరిగాయి. శివసేన డిమాండ్ చేస్తున్న పదవులు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేకపోవడంతో సమస్య జటిలమవుతోంది. వివిధ పదవులతోపాటు హోం శాఖ లేదా ఉప ముఖ్యమంత్రి లాంటి కీలక పదవులిస్తే బీజేపీతో జతకట్టేందుకు శివసేన అంగీకరిస్తుండవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
శీతాకాలం ప్రభుత్వానికి గడ్డుకాలమే
దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తోంది. ఇప్పటికీ ఆయన కేబినెట్‌లో కేవలం 10 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి నాగపూర్‌లో శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రతిపక్షాల ప్రశ్నలకు దీటుగా సమాధానమిచ్చేందుకు 10 మంది మంత్రులు కుస్తీపడాల్సి వస్తుంది. ఈ సమావేశాలు ప్రారంభం కాకముందే మంత్రివర్గ విస్తరణ చేయాలని ఫడ్నవిస్ యోచిస్తున్నారు. అందులో శివసేన ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఇప్పట్లో ఆశలు తీరేట్టు లేదు. భవిష్యత్తులో ఫడ్నవిస్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడే ప్రమాదం పొంచి ఉంద నే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.