సాక్షి, ముంబై: బీజేపీ మహారాష్ట్ర ప్రదేశ్ అధ్యక్షుడిని మార్చబోతున్నారని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ పదవి ఆశిస్తున్న పలువురు ఆశావహులు ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేయడం ప్రారంభించారు. మరోపక్క ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్న చంద్రకాంత్ పాటిల్ కూడా ప్రదేశ్ అధ్యక్ష పదవిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ అధ్యక్షుడిని మార్చాలని అధిష్టానం నిర్ణయిస్తే ఈ పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై పార్టీలో చర్చ మొదలైంది. పార్టీలో యువ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీలోని యువ నేతలు ఆశిష్ శేలార్, చంద్రశేఖర్ బావన్‌కుళే ప్రదేశ్ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఢిల్లీ స్థాయిలో జోరుగా పైరవీలు చేస్తున్నారు.
బీజేపీ రూపొందించుకున్న నియమ, నిబంధనల ప్రకారం ప్రదేశ్ అధ్యక్ష పదవీ కాలం మూడేళ్ల వరకు ఉంటుంది. చంద్రకాంత్ పాటిల్ 2019 జూలైలో బీజేపీ ప్రదేశ్ అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టారు. నియమాల ప్రకారం ఆయన పదవీ కాలం 2022 జూలై వరకు ఉంటుంది. కానీ, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఒక సంవత్సరం ముందే ఆయన్ను మార్చనున్నట్లు గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పైగా, రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ బీజేపీ నాయకులు తరుచూ ఢిల్లీ వెళ్లి వస్తుండటంతో ఆ ఊహాగానాలు నిజమే కావచ్చనే సందేహాలు వెలువడుతున్నాయి. ఇదిలావుండగా గత నెలలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఢిల్లీ వెళ్లి వచ్చారు. అక్కడ ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. బీజేపీ ప్రదేశ్ ప్రస్తుత అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ కూడా ఇటీవల అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఆ తరువాత ఆశిష్ శేలార్, చంద్రశేఖ్ బావన్‌కుళేలు కూడా వెళ్లి వచ్చారు.
ఇలా ఒకరి తరువాత మరొకరు పోటీపడుతూ దేశ రాజధాని నగరానికి వెళ్లి రావడంతో ప్రదేశ్ అధ్యక్షుడి మార్పు ఉండవచ్చని గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్‌లైంది. కాగా, పార్టీ నియమ, నిబంధనలకు కట్టుబడి ఉంటామని, ఆ ప్రకారం చంద్రకాంత్ పాటిల్ మూడేళ్లు పదవిలో కొనసాగుతారని దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే స్పష్టం చేశారు. పాటిల్‌ను మధ్యలో మార్చే ప్రసక్తి లేదని చెప్పారు. ఢిల్లీ వెళ్లి వచ్చినంత మాత్రాన పార్టీలో మార్పులు జరుగుతాయని ఊహించుకోవద్దని, అనవసరంగా వదంతులు ప్రచారం చేయవద్దని మీడియాకు హితవు పలికారు. ప్రదేశ్ అధ్యక్షుడిని మార్చే అంశంపై ఎలాంటి చర్చా జరగలేదని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర బీజేపీకి పాటిల్ నేతృత్వం అసవరమని, మీడియా వదంతులు లేవనెత్తినంత మాత్రాన పార్టీలో ప్రక్షాళన జరగదని పేర్కొన్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటే తప్ప పార్టీలో ఎలాంటి మార్పులు జరగవని స్పష్టం చేశారు. చంద్రకాంత్ పాటిల్ హయాంలోనే విధాన పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో ఆయన్ను మార్చే ఆలోచన ఇప్పట్లో లేదని, పూర్తిగా పదవి కాలంలో కొనసాగుతారని ఫడ్నవీస్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment